అక్రమ నిర్మాణాలపై చర్యలు

ABN , First Publish Date - 2022-01-29T04:33:11+05:30 IST

మెదక్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిపై చర్యలు తప్పవని ఆ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు

మున్సిపాలిటీల్లోని అభివృద్ధి పనులపై కలెక్టర్‌ హరీశ్‌ సమీక్ష


నర్సాపూర్‌, జనవరి 28: మెదక్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిపై చర్యలు తప్పవని  ఆ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ హెచ్చరించారు. శుక్రవారం నర్సాపూర్‌ ఆర్డీవో కార్యాలయంలో జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, రమే్‌షతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించే నిర్మాణాలు, అసైన్డ్‌మెంట్‌ భూముల ఆక్రమణ చేసే వారిపై  కఠినచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపైనా చర్యలు తప్పవన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కూడా జిల్లాలో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ మంజూరు చేసిన నిధుల ద్వారా చేపట్టనున్న సమీకృత మార్కెట్‌, మున్సిపల్‌ భవనం, డంప్‌యార్డు, శ్మశాన వాటిక పనులు కూడా వెంటనే ప్రారంభించాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.  డంపింగ్‌యార్డును నెలరోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఆలయ స్థలంలో చెత్తను తొలగించి ఆ స్థలాన్ని బాగుచేయాలని స్థానిక మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ డాక్టర్‌ సుధాకర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, నాలుగు మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో ఫిబ్రవరిలో ప్రారంభం

నర్సాపూర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఆర్టీసీ డిపో ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. నర్సాపూర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి విలేకరులతో కలెక్టర్‌ మాట్లాడిన సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ డిపో నిర్మాణ పనులు పూర్తయ్యాయని వచ్చే ఫిబ్రవరిలో ఏ రోజు ప్రారంభించాలనే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-01-29T04:33:11+05:30 IST