నాణ్యత లేకుంటే చర్యలే

ABN , First Publish Date - 2022-08-17T05:49:34+05:30 IST

ఉమ్మడి జిల్లాలో తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు.

నాణ్యత లేకుంటే చర్యలే
మాట్లాడుతున్న ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ఆర్థిక మంత్రి ఆగ్రహం
జీతాలు ఎప్పుడు ఇస్తారని ఎంపీపీల ఆవేదన
సమస్యలపై చర్చను మమ అనిపించిన అధికారులు
తీర్మానం లేకుండానే ముగిసిన జడ్పీ సర్వసభ్య సమావేశం


కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 16: ఉమ్మడి జిల్లాలో తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే  అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. మంగళవారం  జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల కలెక్టర్టు పి.కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ సామూన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ నాసరరెడ్డి, మాజీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య, పాణ్యం, నంద్యాల, నందికొట్కూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రవిచంద్రకిషోర్‌రెడ్డి, తోగూరు అర్థర్‌, కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీ చల్లా భగీఽథర్‌రెడ్డి హాజరయ్యారు.

అనవసర ప్రతిపాదనలు వద్దు: ఈ సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ సీపీఎ్‌సడబ్ల్యూ స్కీంలకు అధికారులు అనవసరమైన ప్రతిపాదనలు పంపి  సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సమస్య ఎక్కడ ఉన్నదీ  నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పైప్‌లైన్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఎక్కువగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చాయని, అలాంటి వాటిని క్వాలిటీ కంట్రోల్‌ ఽఅధికారులతో తనిఖీలు చేయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్వాలిటీ  కంట్రోల్‌ ఽఅధికారులు వచ్చిన నివేదికల్లో నాణ్యత లోపించినట్లు తేలితే సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఏజెన్సీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దికెర మండలం  నీటి పైప్‌లైన్‌ను పత్తికొండ మండలానికి ఏ విధంగా పంపిస్తారని అధికారులను ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెప్పించుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలంలో మిరపపంట వేసి నష్టపోయిన రైతులకు కాకుండా పంట వేయని వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నారని ఎమ్మెల్యే రవిచంద్రకిషోర్‌ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.

సీ.బెళగల్‌ మోడల్‌ పాఠశాలకు విద్యుత్‌ బిల్లు రూ.6 లక్షలు పెండింగ్‌ ఉండటంతో కరెంటు కట్‌ చేసారని ఎంపీపీ మునెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కట్‌ చేయడంతో పాఠశాలలో, హాస్టల్లో కరెంటు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర నుంచి ఇసుక తరలిస్తుండటంతో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని అన్నారు.  అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడడం లేదన్నారు.

హాలహర్వి మండలంలో 100 మంది రైతులు మిరప పంట నష్టపోతే అందులో 30 మందికి మాత్రమే ఇన్సూరెన్సు ఇచ్చారని జడ్పీటీసీ లింగప్ప అన్నారు. పంట వేయని రైతులకు ఇచ్చారని, తక్షణమే వంద శాతం రైతులందరికీ ఇన్సూరెన్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 అవుకు రిజర్వాయర్‌కు మరమ్మతు చేయించాలని ఎమ్మెల్సీ చల్లా భగీథర్‌రెడ్డి కోరారు. రిజర్వాయర్‌లో చిన్న చిన్న లైనింగ్‌ పనులు చేయించాలన్నారు. అవుకు నుంచి మిచ్చెనమిట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. అవుకులో ప్రభుత్వ కార్యాలయాలకు  కాంపౌండు వాల్‌ నిర్మించాలన్నారు.

 క్రిష్ణగిరి మండల కేంద్రంలో మోడల్‌ పాఠశాల వద్ద విద్యుత్‌ తీగలు కిందకి వేలాడుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదమైనా జరగవచ్చని, ఈ సమస్యను పరిష్కరించాలని జడ్పీటీసీ సుభాషిణి మంత్రిని కోరారు.

 పెద్దకడుబూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని జడ్పీటీసీ రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చాల కాలంగా ఈ సమస్య ఉన్నదని, దీన్ని పరిష్కరించాలని కోరారు.

 తుగ్గలి మండలంలో ఒక్క పాఠశాలకు కూడా నాడు-నేడు కింద నిధులు మంజూరు కాలేదని, జగనన్నకాలనీకి సంబంధించి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని జడ్పీటీసీ పులకొండనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  బొందిమడుగుల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.

 రైతులు పొలాల్లో విత్తనాలు వేశాక సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఓర్వకల్లు జడ్పీటీసీ రంగనాథ్‌ గౌడు అన్నారు. ముందుగానే రైతులకు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే రైతులు అప్పులు చేసే పరిస్థితి రాదన్నారు.  

 కొత్తపల్లి మండలం నాంపల్లి సొసైటీల్లో గోల్‌మాల్‌ జరుగుతోందని జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి అన్నారు. అ పొలం ఒకరి పేరు మీద ఉంటే ఆన్‌లైన్‌లో మరోపేరు కనిపిస్తున్నదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

 గార్గేయపురం నుంచి మిడ్డూరు డబుల్‌ రోడ్డు వేయడానికి రూ.47 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు ఎందుకు టెండర్లు పిలవలేదని జడ్పీటీసీ యుగంధర్‌రెడ్డి మంత్రిని కోరారు.

 మండల కేంద్రాల్లో జడ్పీటీసీలకు ఎలాంటి గుర్తింపు లేదని, తమను ప్రజలు ఎన్నుకున్నారనే విషయాన్ని అధికారులు గమనిం చాలని నంద్యాల జడ్పీటీసీ గోపవరం గోకుల క్రిష్ణారెడ్డి అన్నారు.  సమావేశాలకు రావడం తప్ప ఏమీ చేయలేకపోతు న్నామని, ఊళ్లలో సమస్యలపై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆవేదన చెందారు.
 
తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం ..

సర్వసభ్యసమావేశంలో తప్పకుండా ఏదో ఒక తీర్మానం చేస్తారు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి హాజరైన సమావేశం కూడా ఒక్క తీర్మానం  చేయకుండా ముగియడం ఏమిటని కొందరు జడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు.

 ఏసీ పని చేయక ఇబ్బందులు..

సమావేశభవనంలో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. ఏసీలు ఎందుకు పని చేయడం లేదని మంత్రి బుగ్గన జడ్పీ అధికారులను ప్రశ్నించారు.  మూడు నెలలకు ఒక్కసారి వచ్చే సమావేశానికి కూడా  ఏసీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని జడ్పీటీసీలు ప్రశ్నించారు.

 నలుగురు ఎమ్మెల్యేలు...ఒక్క ఎమ్మెల్సీ హాజరు....

జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఒకే ఒక్క ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఇద్దరు ఎంపీలు, ఒక మంత్రి, మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

సమావేశంలో కాలయాపన..

ప్రధానంగా అజెండాలో వ్యవసాయం, హార్టికల్చర్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, ఇరిగేషన్‌, హౌసింగ్‌ శాఖల పనితీరుపై చర్చించాలి. అయితే అధికారులు కావాలనే సమావేశంలో కాలయాపన చేశారు. దీంతో వ్యవసాయం, ఇరిగేషన్‌, మెడికల్‌ హెల్త్‌ శాఖలపై మాత్రమే మమ అనిపించారు. మిగతా శాఖల ఊసే లేదు. అజెండాలో లేని ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖపై తీవ్రస్థాయిలో చర్చ రావడంతో సమయం అంతా అక్కడే అయిపోయింది. గత సమావేశంలో ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వివరిస్తూ జడ్పీ మాజీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య కాలయాపన చేశారు.

గూడేలను ఎస్‌ఈ సందర్శించాలి

నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని గూడేలను ఆర్‌డబ్ల్యూఎ్‌సఈ ఇంత వరకు సందర్శించలేదు.  చెంచులకు  భూములు ఇచ్చారుగాని, వాటిని సాగుచేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో గిరిజనులు పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. పాములపాడులో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి.

-నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌

పనులు ఎందుకు ఆపేస్తున్నారు
 
జల్‌జీవన్‌ మిషన్‌ కింద మంజూరు చేసిన పనులను ప్రారంభించిన వెంటనే నిలిపివేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? పైపుల ధరలు పెరుగుతున్నాయని, ధరలు తగ్గాక పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అన్ని జిల్లాలకు అనస్తీషియా వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి కర్నూలు జిల్లాకు ఎందుకు నియమించలేదు? డీఎంఅండ్‌ హెచ్‌ఓ సమాధానం చెప్పాలి.  

-పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

తాగునీటి సమస్యను పరిష్కరించుకుందాం
 
కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలి. సుంకేసుల డ్యాంపై రిజర్వాయర్‌ నిర్మిస్తే జిల్లాకు తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బం దులు ఉండవు. అదే విధంగా జలాశయాల నీరు వృథా పోకుండా మరిన్ని రిజర్వాయర్లను నిర్మించుకునేందుకు అధికారులు ప్రతిపాద నలు సిద్ధం చేయాలి. త్వరలోనే ఉమ్మడి జిల్లాలో అన్ని రిజర్వార్లను పూర్తి స్థాయిలో నింపాలి. గృహ నిర్మాణాలు వేగవంతం అయ్యేలా జడ్పీటీసీలు ప్రజలకు అవగాహన కల్పించాలి. సమావేశంలో అధికా రులను ఇబ్బంది పెట్టకుండా సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. రాబోయే సమావేశంలో అన్ని శాఖలపై చర్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం.            

-యర్రబోతుల పాపిరెడ్డి, జడ్పీ చైర్మన్‌

ప్రతి ఒక్కరూ సహకరించాలి
 
జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి. జడ్పీటీసీ, ఎంపీపీలులు గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించాలి. లబ్ధిదారులు జగనన్న ఇళ్లు నిర్మించుకునే  జడ్పీటీసీలు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత  ప్రజాప్రతినిధులపై ఉంది.

-పి.కోటేశ్వరరావు, కర్నూలు జిల్లా కలెక్టర్‌

 గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తాం
 
 గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. ఇసుక, సిమెంట్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తాం. పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

-మనజీర్‌ జిలానీ సామూన్‌, నంద్యాల జిల్లా కలెక్టర్‌

ఉదయం 11.20 ప్రారంభమైన మధ్యాహ్నం 2.15 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సుబ్బారెడ్డి, వైస్‌ చైర్మన్లు దిల్షాద్‌నాయక్‌, కురువ బొజ్జమ్మ,  కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌అస్లాం ఖాద్రి, సయ్యద్‌ సులేమాన్‌, వీరశైవలింగాయత్‌ చైర్మన్‌ రుద్రగౌడు, జడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.

 మంత్రి, కలెక్టర్లకు సన్మానం..

ఇటీవల ఎంపీడీఓల పదోన్నతుల నేపథ్యంలో ఎంపీడీఓలు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పి..కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ సామూన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు శ్రీనివాసులు, నాగప్రసాద్‌, నాగశివలీల, మాధవిలత, ఈఓఆర్‌డీ రఘునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:49:34+05:30 IST