ట్రేడ్‌.. రైడ్‌!

ABN , First Publish Date - 2022-06-20T14:36:19+05:30 IST

ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. జరిమానా విధించడంతో

ట్రేడ్‌.. రైడ్‌!

 వ్యాపార అనుమతులపై అధికారుల నజర్‌

 లైసెన్స్‌ల జారీ, రెన్యూవల్‌కు చర్యలు

 రూ. 200 కోట్లు లక్ష్యం

హైదరాబాద్‌ సిటీ: ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం  చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తోంది. జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌ తీసుకునే వరకు వదిలేదని చెబుతోంది. ఈ మేరకు ప్రాంతాల వారీగా శానిటరీ జవాన్లు, సూపర్‌ వైజర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో టీంలు ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించింది. సంస్థ అప్పగించిన పని పూర్తి చేయని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించి జోనల్‌, డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సర్కిళ్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో టీంలు ఏర్పాటు చేసి వారు పరిశీలించాల్సిన కాలనీలు, బస్తీలను కేటాయించారు. బృందాలు ఏం చేయాలన్నది సర్క్యులర్‌లో పేర్కొన్నారు. 


అనుమతి ఉన్నవి అంతంతే...

గ్రేటర్‌లో లక్షల సంఖ్యలో వ్యాపార సంస్థలున్నాయి. కానీ ట్రేడ్‌ లైసెన్స్‌లు 1.70 లక్షలకు మించి లేవు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కిరాణ దుకాణం మొదలు కర్రీ పాయింట్‌, టిఫిన్‌ సెంటర్‌ ఇలా.. ఏ వ్యాపారం చేయాలన్నా అనుమతి తీసుకోవాలి. దుకాణం/వ్యాపార సముదాయం విస్తీర్ణం బట్టి రుసుం తక్కువగానే ఉంటుంది. అయినా తెలియక కొందరు, ఏమౌతుందిలే అన్న నిర్లక్ష్యంతో చాలా మంది ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోరు. బల్దియా కూడా ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా పరిగణించిన దాఖలాలు లేవు. కాసుల కష్టాలు మొదలైన నేపథ్యంలో పైసా వసూల్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణంగా ఏటా ట్రేడ్‌ లైసెన్స్‌ల అనుమతి, రెన్యువల్‌ ద్వారా రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల ఆదాయం వస్తోంది. దీనిని కనీసం రూ.150 నుంచి రూ.200 కోట్లకు పెంచాలని ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించారు. 


రోడ్డు వెడల్పును బట్టి..

 బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపారులకు అవగాహన కల్పిస్తాయని, స్పందించని పక్షంలో చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఓ అధికారి చెప్పారు. ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న వారికి రెన్యువల్‌ చేసుకోవాలని సూచిస్తారు. రోడ్డు వెడల్పు 40 అడుగులలోపు ఉన్న చోట చదరపు అడుగుకు రూ.4, అంతకంటే ఎక్కువ వెడల్పు(40 అడుగులు మించి) ఉంటే చదరపు అడుగుకు రూ.6 ట్రేడ్‌ రుసుముగా నిర్ధారించనున్నారు. అనుమతి లేని వ్యాపార సంస్థల నుంచి మెజార్టీ సర్కిళ్లలో ఏఎంఓహెచ్‌లు, శానిటేషన్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తోన్న డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు(డీఈఈ), శానిటరీ సూపర్‌ వైజర్లకు మామూళ్లు అందుతుంటాయి. ముషీరాబాద్‌లో ఓ దుకాణానికి వెళ్లిన సిబ్బందితో.. ‘మీ సార్లకు ఇస్తున్నాం కదా. మళ్లీ ఇదేంది. దరఖాస్తు చెయ్యం.’ అని కరాకండిగా చెప్పినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-20T14:36:19+05:30 IST