కరోనా కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-12-06T05:15:14+05:30 IST

కరోనా వైరస్‌ రెండో దశ విజృంభించకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ నివాస్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయటమే ప్రధాన అజెండాగా 50 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్‌ రానున్నట్టు కేంద్రం నుంచి సమాచారం రావడంతో.. దీనిని భద్రపరిచేందుకు కసరత్తు ప్రారంభించారు. ముందుగా ఈ వ్యాక్సిన్‌ వైద్యసిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు.

కరోనా కట్టడికి చర్యలు

వ్యాక్సిన్‌ వస్తే.. వైద్య సిబ్బందికి తొలి ప్రాధాన్యం

టెక్కలి, డిసెంబరు 5: కరోనా వైరస్‌ రెండో దశ విజృంభించకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ నివాస్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేయటమే ప్రధాన అజెండాగా 50 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్‌ రానున్నట్టు కేంద్రం నుంచి సమాచారం రావడంతో.. దీనిని భద్రపరిచేందుకు కసరత్తు ప్రారంభించారు. ముందుగా ఈ వ్యాక్సిన్‌ వైద్యసిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌ఎన్‌సీ, పీహెచ్‌సీలు, స్త్రీ శిశు సంక్షేమం, ప్రైవేటు ఆసుపత్రులు, ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది, ఆయుష్‌ విభాగం, ఆశావర్కర్లు, ఆశా సూపర్‌వైజర్లు, మల్టీపర్పస్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బంది అయిన ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, వార్డుబాయ్‌లు, శానిటరీ వర్కర్లు, డ్రైవర్లు, అంబులెన్స్‌ డ్రైవర్లు, క్లరికల్‌ సిబ్బందికి తొలిదశలో కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీరు ఎంతమంది ఉన్నారన్న విషయమై వివరాలు సేకరిస్తున్నారు.  పాన్‌కార్డు, ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు,  డ్రైవింగ్‌ లెసెన్సు, బ్యాంకు ఖాతా, చిరునామా, సెల్‌ నెంబరు తదితర వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ మండల కేంద్రాలకు చేరిన వెంటనే భద్రపరిచిన చోట 24 గంటలు విద్యుత్‌ సరఫరా ఉండేలా ఏఈ సేవలను వినియోగించుకోనున్నారు. శాంతిభద్రతల నడుమ వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు రవాణా శాఖ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌ చైర్మన్‌గా, పీహెచ్‌సీ వైద్యులు కన్వీనర్‌గా,  మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. తహసీల్దార్‌ అధ్యక్షతన వీటికి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ భద్రపరిచేందుకు అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయమై  డీఐవో భారతి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వస్తే మొదటగా వైద్యరంగంలో పనిచేసేవారికి సరఫరా చేసేందుకు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.


ఇంట్లో సంబరం.. ఊరంతా కలవరం

వజ్రపుకొత్తూరు మండలంలో పది మందికి కరోనా పాజిటివ్‌

వజ్రపకొత్తూరు : కరోనా వ్యాప్తి రెండో దశ మొదలవుతున్న వేళ... ఒక ఇంట్లో  సంబరం.. ఊరంతా కలవరపడేలా చేసింది. వజ్రపుకొత్తూరు మండలంలోని ఒక గ్రామంలో పది మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని తహసీల్దార్‌ బి.అప్పలస్వామి తెలిపారు.  గ్రామంలోని  ఒక ఇంట్లో ఇటీవల శుభకార్యం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి ఒకరిద్దరు రావడంతో వారి ద్వారా గ్రామంలో పది మందికి పాజిటివ్‌ లక్షణాలు వ్యాప్తి చెందాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల్లో వలంటీర్‌ కూడా ఉండడంతో గ్రామస్థులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. గ్రామస్థులందరికీ కరోనా పరీక్షల కు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ వైరస్‌ వ్యాప్తి చెందుతోందని కొన్ని రోజులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ప్రజలు పెడచెవిన పెడుతున్నారని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం పెళ్లిళ్లలతో పాటు ఇతర శుభకార్యాలకు భారీగా హాజరవుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవడంతో కొంతమంది వైరస్‌ బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ నెల 9, 11 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఉన్నాయని.. కరోనా రెండో దశ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా జాగ్త్రతగా ఉండాలని అధికారులు సూచించారు.  


Updated Date - 2020-12-06T05:15:14+05:30 IST