చర్యలు శూన్యం

ABN , First Publish Date - 2020-11-06T06:06:44+05:30 IST

శామీర్‌పేట పెద్ద చెరువు లీకై నీరు వృథాగా పోతోంది. చెరువు మరమ్మతులకు ప్రభుత్వం రూ.కోటీ 10లక్షలు మంజూరు చేసింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వచ్చిన నిధుల్లో రూ.కోటి వాపస్‌ అయ్యాయి. ప్రతిఫలంగా సాగుకు

చర్యలు శూన్యం

శామీర్‌పేట పెద్ద చెరువు లీకేజీలపై అధికారుల అలసత్వం  

నీరు వృథాగా పోతున్నా పర్యవేక్షణతోనే సరిపెడుతున్న వైనం 

మరమ్మతులకు మంజూరైన రూ.కోటీ 10లక్షలు 

రూ.10లక్షలతో తూతూ మంత్రంగా కాలువల నిర్మాణం..

మంజూరైన నిధుల్లో వాపస్‌ అయిన రూ.కోటి 

సాగునీటి కోసం అలియాబాద్‌ శామీర్‌పేట రైతుల ఆందోళన 


శామీర్‌పేట రూరల్‌: శామీర్‌పేట పెద్ద చెరువు లీకై నీరు వృథాగా పోతోంది. చెరువు మరమ్మతులకు ప్రభుత్వం రూ.కోటీ 10లక్షలు మంజూరు చేసింది. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వచ్చిన నిధుల్లో రూ.కోటి వాపస్‌ అయ్యాయి. ప్రతిఫలంగా సాగుకు అందాల్సిన నీళ్లు వృథాగా పోతూ రైతన్నకు కంటనీరు పెట్టిస్తోంది. ఇదీ నగరానికి చేరువలో ఉన్న శామీర్‌పేట పెద్దచెరువు దుస్థితి. మేడ్చల్‌ జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా ప్రసిద్ది చెందిన శామీర్‌పేట పెద్దచెరువు 1200 ఎకరాల విస్తీర్ణం ఉండగా ఆయకట్టు 2600 ఎకరాల వరకు ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండు కుండలా మారింది. గతంలో 2008లో చెరువు నిండి జలకళ సంతరించుకుంది. కాగా 2016 సంవత్సరంలో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువు మరమ్మతులకు రూ.కోటీ 10 లక్షలు మంజూరయ్యాయి.


ఆ నిధులతో పనులు చేపట్టాల్సిన అధికారులు పర్యవేక్షణ లోపంతో నిధులు రూ.10లక్షల వరకు మాత్రమే కాలువల మరమ్మతులు చేపట్టారు. దీంతో మంజూరైన నిధులు 1 కోటీ రూపాయలు వెనక్కి వెళ్లాయి. ఇది అధికారులు పనితీరుకు నిదర్శనమని రైతులు వాపోతున్నారు. చెరువు మరమ్మతులకు వాడాల్సిన డబ్బులను వాడకుండా వెనక్కి వెళ్లేలా చేయడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద చెరువు నిండి ఉండడంతో మరమ్మతులు చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ముందు జాగ్రత్తగా చెరువును పరిశీలించి కాలువల నిర్మాణం, తూముల మరమ్మతులు వంటి పనులను చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-06T06:06:44+05:30 IST