పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-05-17T05:26:52+05:30 IST

పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు.

పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
తూప్రాన్‌ ఆస్పత్రిని పరిశీలిస్తున్న వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఆజయ్‌కుమార్‌

  రోగులకు సరైన రీతిలో సేవలు అందడం లేదు

 వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌

 గజ్వేల్‌ ఆస్పత్రి వైద్యులకు చార్జి మెమోలు 


గజ్వేల్‌/తూప్రాన్‌/నర్సాపూర్‌, మే 16: పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో విధుల నిర్వహణ సక్రమంగా లేదని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఆజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. డ్యూటీలకు సక్రమంగా రాని వైద్యులకు చార్జి మెమోలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, మెదక్‌ జిల్లా తూప్రాన్‌, నర్సాపూర్‌ ఆస్పత్రులను మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఆజయ్‌కుమార్‌ మాట్లాడారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో ఉదయం 10.30 గంటల వరకు అక్కడే కూర్చుంటే 52 మంది వైద్యలకు కేవలం 15 మంది వైద్యులు భయపడి వచ్చారన్నారు. లేదంటే 10,  ఐదు మంది వైద్యులే వస్తారన్నారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో 74 మంది రోగులుంటే, 52 మంది వైద్యులున్నట్లు చెప్పారు. కేవలం మెటర్నటీ తప్ప ఏ వర్క్‌ ఎక్కువ చేయడంలేదని, ఇద్దరు ముగ్గురు ఆర్థో రోగులున్నారన్నారు. ఆస్పత్రిలో వైద్యుల తీరు బాగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో విధులకు రాని వైద్యులకు చార్జిమోమోలు జారీ చేస్తున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. తూప్రాన్‌ ఆస్పత్రి చాలా భాగుందని కితాబిచ్చారు. ఆస్పత్రి నిర్వహణ తీరును చూసిన కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌ను అభినందించారు. నర్సాపూర్‌ ఆస్పత్రిలో కొంత గడబిడగా కనిపించిందని, రోగులకు మందులను బయటకు రాస్తున్నట్లు కనిపించిందన్నారు. అటువంటివి జరిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆస్పత్రిలో వైద్యులు కొంత రొటేషన్‌ పద్ధతిలో వస్తున్నట్లు కనిపించిందని, ఇటువంటివి చేస్తే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని ఆజయ్‌కుమార్‌ హెచ్చరించారు. ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు పెట్టాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆస్పత్రి సమయంలో ప్రైవేటు వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనవెంట గజ్వేల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సాయి, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. 


 

Updated Date - 2022-05-17T05:26:52+05:30 IST