పల్లె, పట్టణ ప్రగతిలోనిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-27T04:55:28+05:30 IST

పల్లె, పట్టణ ప్రగతిలోనిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పల్లె, పట్టణ ప్రగతిలోనిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరీష్‌, పక్కన అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌

  •   సమీక్షా సమావేశంలో మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌

మేడ్చల్‌ అర్బన్‌, మే 26: పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణప్రగతి, హరితహారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న పల్లె, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను తీర్చే లక్ష్యంగా విధులు నిర్వహించాలని, మొక్కలు నాటడం, సంరక్షణపైౖ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. మండలాల్లో క్రీడాప్రాంగణాలకు స్థలాలను గుర్తించి జూన్‌ 2న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను పరిశీలించేందుకు సీఎంవో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని, అధికారులందరూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ విజయవంతం చేయాలన్నారు.

 పంటమార్పిడితోనే రైతులకు ప్రయోజనం

పంట మార్పిడితోనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వానాకాలం-2022 సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు సాగుచేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏఈవోలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తు రైతుల సందేహాలు నివృత్తి చేస్తూ, ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించాలని,  నూతనసాగు పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌, డీఆర్డీఏపీడీ పద్మజారాణి, డీపీవో రమణమూర్తి, అటవీ, వ్యవసాయ అధికారులు అశోక్‌కుమార్‌, మేరీరేఖ, ఎంపీడీవోలు, కమిషనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:55:28+05:30 IST