Pattabhi భార్య ఆరోపణలు నిజమే.. పోలీసుల మెడకు కేసు..!

ABN , First Publish Date - 2021-10-30T06:17:50+05:30 IST

పట్టాభి అరెస్టు అయ్యే వరకు గవర్నరుపేట పోలీసులు కేసు నమోదు ...

Pattabhi భార్య ఆరోపణలు నిజమే.. పోలీసుల మెడకు కేసు..!

  • ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు
  • వీఆర్‌లోకి ఏసీపీ రమేష్‌
  • రేంజ్‌కు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు

విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ‘పోలీసులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పట్టాభి వద్దకు వచ్చి అరెస్టు చేస్తామని ప్రకటించారు. నేను ఆయన వద్దకు వెళ్తుంటే అడ్డుకున్నారు. అరెస్టు, విచారణకు సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.’ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్టు చేసిన రోజు ఆయన భార్య చందన చేసిన ఆరోపణలు ఇవి. ఇవన్నీ నిజమని తేలింది. దక్షిణ మండలానికి ఇన్‌చార్జ్‌ సహాయ కమిషనర్‌గా ఉన్న ఎం.రమేష్‌ను పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వీఆర్‌కు పంపారు. ఆయనను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును ఏలూరు రేంజ్‌ డీఐజీకి అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. పట్టాభి అరెస్టు అయ్యే వరకు గవర్నరుపేట పోలీసులు కేసు నమోదు చేశారనే విషయం బయటకు రాలేదు.


ఈ నెల 20వ తేదీన భారీ బందోబస్తు నడుమ పట్టాభిని అరెస్టు చేశారు. కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడిన పట్టాభి తనను అరెస్టు చేసిన తర్వాత 41(ఎ) నోటీసు ఇచ్చి, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని,  వాటిపై ముందు రోజు తేదీలు వేయించుకున్నారని చెప్పారు. పట్టాభి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సమయంలో పోలీసుల తప్పిదాలను హైకోర్టు ఎత్తి చూపడంతో సహాయ కమిషనర్‌ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావులపై చర్య తీసుకున్నారు.

Updated Date - 2021-10-30T06:17:50+05:30 IST