Abn logo
Oct 20 2021 @ 02:34AM

దోషులను వదలొద్దు

  • అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు 
  • హోం మంత్రికి బంగ్లాదేశ్‌ ప్రధాని ఆదేశం

ఢాకా/ఢిల్లీ, అక్టోబరు 19: బంగ్లాదేశ్‌లో మతం పేరిట అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. దోషులను వదలకూడదని ఆమె స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో చేసే ఏ పోస్టులను కూడా వాస్తవాలను నిర్ధారించుకోకుండా గుడ్డిగా నమ్మవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లోని వివిధ నగరాల్లో హిందూ ఆలయాలు, దుకాణాలు, ఇళ్లపై ముస్లింలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి కూడా హిందువులకు చెందిన 20 ఇళ్లను దుండగులు తగులబెట్టారు.


ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని హసీనా మంగళవారం ఆన్‌లైన్‌లో క్యాబినెట్‌ భేటీ నిర్వహించారు. మళ్లీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వశాఖను ఆమె ఆదేశించారని క్యాబినెట్‌ కార్యదర్శి ఖంద్కర్‌ అన్వరుల్‌ ఇస్లాం తెలిపారు. ముస్లింల దాడుల్లో నష్టపోయిన బాధిత కుటుంబాలందరికీ సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆ దేశ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అది బంగ్లాదేశ్‌ కాదని, ‘జిహాదిస్థాన్‌’ అని విమర్శించారు. మంగళవారం న్యూఢిల్లీలో పీటీఐతో ఆమె మాట్లాడారు. ‘‘మదర్సాల్లో పిల్లలకు మతతత్వం అనే విషాన్ని నూరిపోస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులను మూడో శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. గత ప్రభుత్వాల లాగే హసీనా ప్రభుత్వం కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటోంది’’ అని తస్లీమా అన్నారు.