నకిలీ పాసుపుస్తకాల తయారీదారులపై చర్యలు

ABN , First Publish Date - 2022-05-28T06:35:31+05:30 IST

పాలసముద్రం మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకులో రుణాలు తీసుకున్న.. రైతు భరోసా పొందుతున్న వారిపై చర్యలు తప్పవని నగరి ఆర్డీవో సృజన హెచ్చరించారు.

నకిలీ పాసుపుస్తకాల తయారీదారులపై చర్యలు
రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో సృజన

పాలసముద్రం, మే 27: పాలసముద్రం మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకులో రుణాలు తీసుకున్న.. రైతు భరోసా పొందుతున్న వారిపై చర్యలు తప్పవని నగరి ఆర్డీవో సృజన హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఆమె నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. వనదుర్గాపురం, శ్రీకావేరిరాజుపురం, సింహరాజుపురం, తిరుమలరాజు పురం, నరసింహరాజుపురం పంచాయతీల్లో నకిలీ పాసుపుస్తకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశాలపై తాను రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. మూడు రోజులపాటు రికార్డులను పరిశీలించి నకిలీ లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్‌, జేసీలకు నివేదిక ఇస్తామన్నారు. నకిలీ పాసుపుస్తకాల తయారీకి సహకరించిన రెవన్యూ అధికారులపైనా చర్యలు చేపడతామన్నారు. తహసీల్దార్‌ భాగ్యలత పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:35:31+05:30 IST