Action plan: కేసీఆర్‌కు బీజేపీ చెక్ పెట్టగలదా?

ABN , First Publish Date - 2021-07-28T16:30:57+05:30 IST

దళిత బంధు కమలనాథులకు సవాల్‌గా మారిందా? పథకంపై కమలం పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? దళితులను తమ వైపు తిప్పుకోవటానికి కమలనాథులు వ్యూహరచన మొదలు పెట్టారా?

Action plan: కేసీఆర్‌కు బీజేపీ చెక్ పెట్టగలదా?

దళిత బంధు కమలనాథులకు సవాల్‌గా మారిందా? పథకంపై కమలం పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? దళితులను తమ వైపు తిప్పుకోవటానికి కమలనాథులు వ్యూహరచన మొదలు పెట్టారా? దళితుల ఓట్లను కొల్లగొట్టాలనుకుంటోన్న అధికార పార్టీని బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది? గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై కాషాయపార్టీ దృష్టి సారించిందా? రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలనేది కమలనాథుల వ్యూహంలో భాగమా? 


దళిత బంధు పథకం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన పథకం. అన్ని రాజకీయ పార్టీల్లోనూ దళితబంధుపై చర్చలు జోరందుకున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీకి దళితబంధు స్కీం సవాల్‌గా మారింది. ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌లో నిజానికి బీజేపీ మంచి ఊపుమీదుంది. ఒక రకంగా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకంటే బీజేపీ ఒకడుగు ముందే ఉంది. బీజేపీ బలం..‌ బలగం మాజీ మంత్రి ఈటల రాజేందర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లు 1683. ఓట్ల శాతాన్ని చూస్తే ఒక్క శాతం కంటే తక్కువ. అయితే ఈటల కాషాయ కండువా కప్పుకోవటంతో హుజురాబాద్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అట్టడుగు స్థానం నుంచి ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి బీజేపీ చేరుకుంది. 


అయితే... హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బకొట్టడం‌ కోసమే కేసీఆర్ దళిత బంధును తీసుకొచ్చారన్న చర్చ కమలనాథుల్లో కలవరం సృష్టిస్తోంది. హుజురాబాద్ లో సుమారు 45వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్నాయంటున్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ కు మద్దతుగా నిలిచారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్‌ఎస్‌లోని పరిస్థితుల కారణంగా ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిపోయారు. అయితే.. ఈటల రాజేందర్‌ను.. టీఆర్ఎస్ పార్టీ.. అవమానకరంగా బయటకు పంపడంతో ఆయనపై సింపథీ పెరిగిపోయింది. ఈ సానుభూతితో ఈసారి కూడా దళిత ఓట్లలో మెజారిటీ ఈటలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. దీంతో ఈటలను దెబ్బకొట్టేందుకే దళితబంధు తీసుకొచ్చారనేది బీజేపీ ఆరోపణ.


ఇదిలావుంటే.. దళితబంధు.. ఈటల రాజేందర్ పుణ్యమేనని కమలనాథుల ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయకుంటే.. కేసీఆర్‌కు దళితులు గుర్తు వచ్చేవారు కాదని బీజేపీ నేతలంటున్నారు. ఇదే అంశాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించిందట. దళితబంధును స్వాగతిస్తూనే ఎస్టీలకు సైతం కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలనేది బీజేపీ తెరపైకి తీసుకొస్తున్న డిమాండ్. ఎస్సీలతో పాటు ఎస్టీ, బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌నూ కమలనాథులు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే స్లోగన్‌తో పెద్ద యెత్తున ప్రజల్లోకి వెళ్ళాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇదే అంశంపై ఈనెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దర్నాకు దిగనుంది. హుజురాబాద్ లో ఎస్సీలతో పాటు బీసీలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈటల రాజేందర్ సైతం బలహీన వర్గాలకు చెందిన నాయకుడు కావటంతో బీజేపీ బీసీ ఓటర్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎస్సీలతో పాటు‌.‌‌. ఎస్టీ, బీసీలకు సైతం కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని కమలనాథులు డిమాండ్‌ చేయబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే.. ఎస్సీలకు పది లక్షలు ఇస్తే సహజంగానే ఇతరులు సైతం ఆశిస్తారని .. తద్వారా వారిని బీజేపీ వైపు పోలరైజేషన్ చేయాలనేది కూడా బీజేపీ ఆలోచనగా ఉందట. 




ఇప్పటికే.. దళితులను ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని  బీజేపీ ఆరోపిస్తోంది. ఏడేళ్ళ తర్వాత కేసీఆర్ కు దళితులు గుర్తొచ్చారని బీజేపీ మండిపడుతున్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి హామీనిచ్చిన కేసీఆర్.. ఎందుకు అమలు చేయలేదని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నిక ఉన్నందునే కేసీఆర్ దళతులపై ప్రేమ చూపిస్తున్నారని.. ఇదే అంశాన్ని ప్రజలకు వివరిస్తామని కాషాయ పార్టీ చెప్తోంది. గత హామీల మాదిరిగానే దళితబంధు కూడా హామీగా మిగిలిపోకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు. దీంతోపాటు క్యాబినెట్ లో ఎస్సీల్లో ఒక్కరికే చోటు కల్పించటం సరైంది కాదని.. మరో ఇద్దరికి క్యాబినెట్ లో చోటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేయబోతోంది. అంతేకాదు... ట్యాంక్ బండ్ పై 125అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయటం‌ లేదో ప్రజలకు వివరించే వరకు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాషాయపార్టీ నిర్ణయించిందట. 


మొత్తంగా... దళిత బంధు పథకం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా గిరిజనులకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండడంతో కమలనాథులు అలెర్ట్ అయ్యారు. గతంలో కేసీఆర్... హమీ ఇచ్చి.. మరిచిన.. పలు అంశాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని బీజేపీ భావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేలోగానే దళిత సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలని కమలనాథులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-28T16:30:57+05:30 IST