Chitrajyothy Logo
Advertisement

నాలుగు లుంగీలే నా కార్‌వ్యాన్‌

twitter-iconwatsapp-iconfb-icon

సాధారణంగా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వచ్చిన హీరోలు తండ్రి బాటలోనే నడుస్తూ ఉంటారు. కానీ దుల్కర్‌ సల్మాన్‌ దానికి పూర్తిగా భిన్నం. మమ్ముట్టి యాక్షన్‌ హీరో.. ఎగ్రసివ్‌ హీరో. కానీ దుల్కర్‌ మాత్రం లవర్‌ బోయ్‌. మమ్ముట్టి నమ్ముకొన్న ఫైట్లు, కమర్షియాలిటీ ఇవేమీ అవసరం లేకుండానే  తనదైన దారిలో నడిచాడు దుల్కర్‌. కేవలం మళయాళంలో మాత్రమే కాదు.. హిందీ సహా అనేక భాషల్లో దుల్కర్‌కు అభిమానులున్నారు. అందుకే దుల్కర్‌ అసలు సిసలైన పాన్‌ ఇండియా స్టార్‌. ఈమధ్యే ‘సీతారామం’లో రామ్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలచుకొన్న తరుణంలో ఈ అందాల నటుడితో ముచ్చటించింది ‘నవ్య’.


ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో  హీరోని ఎలా నిర్వచించోచ్చు? 

నేను నటన వైపుకు రావాలని అనుకున్న రోజుల్లో హీరోగా మారడం అంటే చాలా  కష్టం. హార్స్‌ రైడింగ్‌ చేయమంటారు, సడన్‌ గా వచ్చి బైక్‌ నడపమంటారు, డ్యాన్స్‌ చేయమని చెప్తారు, గీటార్‌ వాయించమంటారు. ఏదైనా చేయమంటారు. ఒకే మనిషి సరైన ప్రిపరేషన్‌ లేకుండా ఒకేసారి ఇన్ని ఎలా చేేసస్తాడనే ఆశ్చర్యం కలిగేది. హీరో అంటే ఏదైనా చేేసయాలి. కానీ నేను నమ్మేది ఏమిటంటే హీరో కంటే కథలో కథానాయకుడని ఫీలౌతాను. కథానాయకుడి కథ చెప్తున్నాం. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వాలి. ప్రేక్షకులు కథానాయకుడిని రిలేట్‌ చేసుకోవాలి. అందుకే ఈ రోజుల్లో రైటింగ్‌ పరంగా ఇంకా బాఽధ్యత పెరిగింది. కొన్ని సినిమాలు చేేససిన తర్వాత ప్రేక్షకులు ఆ హీరోని పాత్రలుగా చూడరు. నటుడిగానే చూస్తారు. అందుకే ఇలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 


మీ నాన్న గారు ఒక సూపర్‌ స్టార్‌.  మీరు తొలిరోజుల్లో కష్టపడ్డారా?

నేనూ కష్టపడ్డాను అంటే జనాలంతా నవ్వుతారు. కానీ ఇది నిజం. మా నాన్న సూపర్‌ స్టార్‌ కావటం వల్ల నా బాధ్యత మరింత పెరిగింది. నేను ప్రేక్షకులను, ఇండస్ట్రీని గౌరవిస్తాను. ఎందుకంటే ప్రేక్షకులే నాకు అవకాశం ఇచ్చారు. 


నటుడికి రెండు ప్రపంచాలు ఉంటాయి. వీటిని ఎలా బ్యాలెన్స్‌ చేసుకుంటారు?

వ్యక్తిగత జీవితాన్ని, వృత్తినీ వేరు వేరుగా చూడాలి. అయితే కొన్ని సందర్భాలలో ఇది చాలా కష్టం. ఓ కష్టంతోనో, బాధతోనో సెట్‌కి వెళ్తాం. కానీ అక్కడ ఆనందంగా ఉండాల్సిన ఓ సన్నివేశంలో నటించాల్సి వస్తుంది. అలాంటప్పుడు సీన్లు చేయడం చాలా కష్టం. కొన్ని కొన్ని సన్నివేశాలుమనసుకు మరింత దగ్గరగా వుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య  తండ్రీ కూతుర్ల మధ్య వచ్చే సన్నివేశం చేయాలంటే ఎమోషనల్‌ అయిపోతున్నా. బహుశా నేను కూడా ఒక తండ్రిని కావటం వల్ల కావచ్చు. 


మీ ఎమోషనల్‌ సపోర్ట్‌ ఎవరు?

నా కుటుంబం. వాళ్ళే నా బలం. అలాగే నా ేస్నహితులు కూడా. నా మొహంలో చిన్న మార్పు కూడా వాళ్లకి తెలిసిపోతుంది. ఏమయిందని అడిగేస్తారు. ఈ విషయంలో చాలా అదృష్టవంతుడిని.


మీపై మీ నాన్నగారి ప్రభావం ఉందా?  

ఉంది. ఆయనకి కుటుంబంతో గొప్ప అటాచ్‌మెంట్‌ వుంది. కానీ మమల్ని వదిలి షూటింగులకు వెళ్ళేవారు. సినిమా పట్ల ఆయనికి వున్న ప్రేమ ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన నిర్విరామంగా పని చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఆయనకి ఒక వింత అనుభవం. అంత బ్రేక్‌ ఎప్పుడూ తీసుకోలేదు. అయితే ఆయన్ని ఆయన ఎప్పుడూ ఓ ఛాలెంజ్‌గాతీసుకొంటారు. లాక్‌ డౌన్‌లో గడప దాటకూడదని నిర్ణయించుకున్నారు.  275 రోజులూ ఇంటి కాంపౌండ్‌ వాల్‌ కూడా దాటలేదు. లాక్‌ డౌన్‌ ఎత్తేసిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ లేకుండా పని చేస్తున్నారు. ఆయనకి ఎవరైనా ‘నువ్వు ఇది చేయలేవు’ అని చెప్తే అదే చేస్తారు. నేను కూడా ఆయన్ని నుంచి అదే నేర్చుకున్నా. 


నాన్న గారు ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవారు కదా.. మీకు అది వీలవుతుందా? 

మీరన్నది నిజమే. కానీ ఈ జనరేషన్‌ లో అన్నీ మారిపోయాయి. నంబర్స్‌ కూడా మారిపోయాయి. చాలా సెలెక్టివ్‌గా ఉండాలి. నాన్నగారి టైమ్‌కీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ప్రతి శుక్రవారం కెరీర్‌ కి ముగింపు అని ఫీలయ్యేవారు. ఆ భయమేవాళ్ళన్ని నడిపింది. కాలంతో పాటు పరిగెత్తారు. బడ్జెట్స్‌ ఉండేవి కాదు. నేను కూడా ఎప్పుడూ సెక్యూర్‌ గా ఫీలవ్వలేదు. ప్రతి నటుడికీ ఓ డ్రైవింగ్‌ ఫోర్స్‌ వుండాలని భావిస్తాను. అప్పుడే భిన్నమైన సినిమాలన్ని, వైవిధ్యమైన పాత్రల్నీ చేేస అవకాశం వుంటుంది. 


అంత చిన్న బడ్జెట్‌లో షూటింగ్‌ ఎలా చేేసవారనిపిస్తుంటుంది ? 

నాన్న గారు మూడు షిప్ట్‌లలో పని చేేసవారు. అంటే ఇరవై నాలుగు గంటలూ సెట్లోనే ఉండేవారు. కేవలం విరామ సమయంలో మాత్రమే నిద్రపోయేవారు. ఓ సినిమా షూటింగ్‌లో గేటు దగ్గర నిలబడి ఒక డైలాగ్‌ చెప్పాలి. నాన్న అప్పుడే వేరే షూటింగ్‌ నుంచి వచ్చారు. దర్శకుడు యాక్షన్‌ చెప్పిన తర్వాత అలాగే రాయిలా నిలబడ్డారు దర్శకుడు ‘యాక్షన్‌..’ అని అరిచినా ఆయనలో ఎలాంటి కదలిక లేదు. చివరికి దర్శకుడు ప్యాకప్‌ చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. నాన్న మాత్రం కదలకుండా అలానే నిలబడివున్నారు. విషయం ఏమిటంటే.. ఆయనకి నిద్రపట్టేసింది. వరుస షూటింగులతో ఆయన శరీరం అలసిపోయింది. ఆయనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఆ కష్టంలో మేం పది శాతం కూడా పడడం లేదు. ఇప్పుడు సెట్లోనే  మాకు సకల సౌకర్యాలు ఉన్నాయి. నాన్నగారికి సమయంలో ఈ లగ్జరీ లేదు.  నా మొదటి రెండు సినిమాలకు కూడా దుస్తులు మార్చుకోవడానికి వెసులుబాటు వుండేది కాదు. దాంతో నాలుగు లుంగీలు నలుగురు నాలుగు కొనలు పట్టుకుంటే ఒక రూమ్‌లా అయ్యేది. అందులో దుస్తులు మార్చుకొనేవాడిని. అదే నా కార్‌వాన్‌. ఇదంతా జర్నీలో భాగం. ఇప్పుడు ఏదైనా లగ్జరీ వస్తుంటే.. దీన్ని మనం సంపాదించుకొన్నాం కదా అనే ఫీలింగ్‌ వుంటుంది. 


మోహన్‌ లాల్‌, మమ్ముట్టి మధ్య చాలా పోటీ వుండేది కదా..? 

వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ముందుకు నడిచారు. వారి  మధ్య గొప్ప ప్రేమ వుంది. నాకు ఇద్దరి సినిమాలూ ఇష్టమే. కానీ నాన్న గారి సినిమాలంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ. డాడ్‌ ఈజ్‌ డాడ్‌. మోహన్‌ లాల్‌ సర్‌ పిల్లలు నాకంటే కొంచెం చిన్నవాళ్ళు. నేను వాళ్ళకి పెద్దన్నలా ఉండేవాడిని. మాకు చాలా స్వీట్‌ మెమోరీస్‌ వున్నాయి. ఒక సినిమా అభిమానిగా తీసుకుంటే వారి మధ్య పోటీని ఓ క్రికెట్‌ మ్యాచ్‌లా చూస్తా. అది కూడా ఇండియా- పాక్‌ మ్యాచ్‌.


మోహన్‌ లాల్‌ , మమ్ముట్టి నుంచి వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌?

నాన్న కాంప్లిమెంట్స్‌ ఇవ్వరు. నా సినిమా చూస్తున్నపుడు ఆయన ఎదురుగా కూర్చుని ఎక్స్‌ ప్రేషన్స్‌ ని చూస్తుంటా. ఆయన నవ్వడం, చప్పట్లు కొట్టడం.. అవే నాకు కాంప్లిమెంట్స్‌.  కొన్నిసార్లు.. ఒక్క ముక్కలో చెప్పేస్తుంటారు. ‘అక్కడ అంత యాక్ట్‌ చేయాల్సిన అవసరం లేదు అండర్‌ ప్లే చేేస చాలు’ అంటుంటారు. మోహన్‌ లాల్‌ గారు నాపట్ల గొప్ప వాత్సల్యంలో వుంటారు. నా సినిమా బావుంటే నలుగురితో గొప్పగా చెప్తారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు. 


మలయాళం సినిమా ఇప్పుడు కమర్షియల్‌గా కూడా పోటీ పడుతోంది. ఈ మార్పుని ఎలా చూస్తారు?

ఈ విషయంలో ఓటీటీలకు థాంక్స్‌ చెప్పాలి. ఒకప్పుడు దూరదర్శన్‌ ఒక్కటే వుండేది. ఆ సమయంలో ప్రాంతీయ సినిమానే అందుబాటులో వుండేది. కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల అన్ని భాషల సినిమాలూ చూస్తున్నారు. మలయాళం పరిశ్రమ ట్రెండ్‌ని త్వరగా అడాప్ట్‌ చేసుకుంటుంది. షూటింగ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఇది వరకు లేని వేగం వచ్చింది. ప్రేక్షకులని ఎప్పుడూ సర్‌ ప్రైజ్‌ చేస్తూ వుండాలి. అదే.. మలయాళ సినిమాల మంత్రం.

నాలుగు లుంగీలే నా కార్‌వ్యాన్‌

నాగచైతన్య నా జూనియర్‌. చాలా క్యూట్‌ కిడ్‌. తన ప్లే స్టేషన్‌లో సరదా ఆడుకునేవాడు. చాలా సిగ్గరి. తన పనేదో తనదే. నాగార్జున గారు కూడా ఇలానే వుండటం చాలా సర్‌ ప్రైజ్‌ గా అనిపించింది. ఇదే సంగతి నాగ్‌ సర్‌ తో కూడా చెప్పా.


 స్టార్‌ పిల్లలెప్పుడూ జీవితంలో ఎదగలేదనే భయం ఎప్పుడూ ఉండేది. అందుకే నేను ఏ రంగంలో వున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం మాత్రమే సాధించాలి అని అనుకొనేవాడిని. సక్సెస్‌ అవ్వడం తప్పితే మరో ఆప్షన్‌ లేదు. నాన్నతో కలిసి బయటకు వెళ్ళినపుడు గొప్ప మర్యాద ఇచ్చేవాళ్ళు. కూర్చోవడానికి మంచి సీటు, గోల్డ్‌ స్పాట్‌ డ్రింక్‌ (నవ్వుతూ). నేను ఒంటిరిగా వెళితే మాత్రం మళ్ళీ మామూలే. ఆయన లేబుల్‌తో చాలా గౌవరం పొందా.  చాలా మంది నన్ను నటన వైపు రావద్దని వేరే పని చేసుకోవడం మంచిదని చెప్పేవాళ్ళు. ఏది చేయొద్దని చెపితే అదే చేయడం నాన్నగారి దగ్గర నుంచి నాకూ అబ్బింది.  


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...