ఆ సెక్రటరీపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-04-13T05:18:17+05:30 IST

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి ధర పడిపోవడానికి వ్యాపారుల సిండికేట్‌ కారణమని, దానికి కారణమైన సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డికి ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.

ఆ సెక్రటరీపై చర్యలు తీసుకోండి

  1.  జేసీకి వినతి పత్రం అందజేసిన రైతు సంఘం 


కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 12: కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి ధర పడిపోవడానికి వ్యాపారుల సిండికేట్‌ కారణమని, దానికి కారణమైన సెక్రటరీపై  చర్యలు తీసుకోవాలని   జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డికి ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు.  దాదాపు ఐదారు సంవత్సరాలుగా సెక్రటరీ ఎక్కడికీ బదిలీ కాకుండా ఈ యార్డులోనే పని చేస్తున్నారని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఉల్లి పంటను సాగు చేసేందుకు పడుతున్న కష్టాలను రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ తదితరులు సునయన ఆడిటోరియంలో జేసీకి వివరించారు. కర్నూలు యార్డులో ఉల్లి వ్యాపారం చేసేందుకు దాదాపు 30 మంది లైసెన్సులు తీసుకున్నారని, అయితే.. యార్డులో ఉల్లి వేలాల్లో కేవలం ఐదారు మంది రైతులు మాత్రమే పాల్గొంటున్నారని, ఈ విషయంలో సెక్రటరీ జయలక్ష్మి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు వారు ఆరోపించారు. క్వింటానికి కేవలం కనిష్ఠ ధర రూ.400  మాత్రమే రైతుకు అందుతోందని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి రైతులకు జరుగుతున్న అన్యాయంపై వెంటనే విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సంబందిత వ్యాపారులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుసంఘం కార్యదర్శి రామక్రిష్ణ, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ఇతర నాయకులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర తదితరులు జేసీకి విజ్ఞప్తి చేశారు. అయితే రైతు సంఘం నాయకులు చేస్తున్న ఆరోపణల్లో  వాస్తవాలు లేవని, రాష్ట్రమంతటా ఉల్లి ధర తగ్గిపోయిందని కర్నూలు మార్కెట్‌ కమిటీ  సెక్రటరీ జయలక్ష్మి స్పష్టం చేశారు. తామకు, తమ సిబ్బందికి  వ్యాపారుల సిండికేట్‌తో సంబంధం లేదని అన్నారు.


Updated Date - 2021-04-13T05:18:17+05:30 IST