అప్రమత్తమేనా?

ABN , First Publish Date - 2021-12-07T07:03:10+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కలకలం సృష్టిస్తోంది.

అప్రమత్తమేనా?

ఒమైక్రాన్‌ను అడ్డుకునేందుకు విమానాశ్రయంలో చర్యలేమిటి?

నాలుగు దేశాల నుంచి రాకపోకలు

రిస్క్‌ ఫ్రీ భావనలో అధికారులు 

పరీక్షలు అంతంత మాత్రమే

కొవిడ్‌ రిపోర్టులు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల పరిశీలన 

వైరస్‌ను గుర్తించేందుకు ఇవి సరిపోతాయా?


ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కలకలం సృష్టిస్తోంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రిస్క్‌ ఫ్రీ దేశాలకు అంతర్జాతీయ విమానాలు యథాతథంగానే నడుస్తున్నాయి. విజయవాడ విమానాశ్రయానికి కూడా ఆరు అంతర్జాతీయ విమానాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. అవన్నీ రిస్క్‌ ఫ్రీ దేశాలేననే భావనలో అధికారులున్నారు. నామమాత్రపు పరీక్షలకే పరిమితమయ్యారు. వైరస్‌తో ఎవరైనా వస్తే ఈ పరీక్షలతో గుర్తించడం సాధ్యమేనా?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి ఒమైక్రాన్‌ రిస్క్‌ ఫ్రీ దేశాలకు మాత్రమే అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నందున ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నా, అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విజయవాడ నుంచి దుబాయ్‌, కువైట్‌, మస్కట్‌, బహ్రయిన్‌లకు ఆరు అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. వందే భారత్‌ మిషన్‌లో భాగమే అయినా ఈ విమానాలన్నీ రద్దీగానే ఉంటున్నాయి.


రిస్క్‌ దేశాల నుంచి అడ్డదారిలో వచ్చే అవకాశం

కువైట్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌, మస్కట్‌ దేశాలు ఒమైక్రాన్‌ రిస్క్‌ ఫ్రీ దేశాలుగానే ఉన్నాయి. అయినా రిస్క్‌ ఉన్న దేశాల నుంచి అడ్డదారిలో ఈ విమానాల్లో రావటానికి అవకాశం ఉంటుంది. వందేభారత్‌ మిషన్‌ ఆపరేషన్స్‌ను ఆఫ్రికా, ఇతర ఒమైక్రాన్‌ వైరస్‌ రిస్క్‌ ఎక్కువ ఉన్న దేశాలవారు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నందున రిస్క్‌ ఎక్కువ ఉన్న దేశాల నుంచి వివిధ దేశాలకు అత్యవసరంగా చేరుకోవాల్సిన వారు ఏదో ఒక దారిని వెతుకుతూనే ఉంటారు. అలాంటివారు వరల్డ్‌ డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టులకు చేరుకుంటే ఈజీగా దేశాలు దాటేయవచ్చు. వరల్డ్‌ డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ అంటే ప్రంచంలోని నలుమూలలకూ విమాన సర్వీసులు నడిపే విమానాశ్రయం. ఇటువంటి ఎయిర్‌పోర్టులు ఉన్న దేశాల్లో దుబాయ్‌ ఒకటి. విజయవాడ నుంచి ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసుల్లో అది కూడా ఉంది. దుబాయ్‌కు రాకపోకలపై పెద్దగా ఆంక్షలు లేవు. ఆఫ్రికా, ఇతర ఒమైక్రాన్‌ రిస్క్‌ దేశాల ప్రజలు ఏదో ఒక మార్గంలో దుబాయ్‌కు చేరుకుంటే.. అక్కడి నుంచి ఇక్కడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవచ్చు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ దిశగా ఆలోచించనందునే విజయవాడ విమానాశ్రయంలో తనిఖీలను ఫార్సుగా నిర్వహిస్తున్నారు. 


విజయవాడ ఎయిర్‌పోర్టులో జరుగుతున్నది ఇదీ.. 

నాలుగు దేశాల నుంచి విజయవాడ చేరుకునే అంతర్జాతీయ విమానాల ప్రయాణికులు తప్పనిసరిగా ఒమైక్రాన్‌ వైరస్‌కు సంబంధించిన పరీక్షలు  చేయించుకోవాల్సిన అవసరం ఉన్న జాబితాలో లేకపోవడంతో ఇక్కడ సాధారణ పద్ధతులనే పాటిస్తున్నారు. కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్లు, టెస్ట్‌ రిపోర్టులు మాత్రమే చెకింగ్‌ చేస్తున్నారు. సాధారణ పద్ధతుల్లో థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ స్కానింగ్‌లో టెంపరేచర్‌ ఎక్కువగా ఉన్న వారిలో రెండు శాతం మందికే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించి, ఇళ్లకు పంపించేస్తున్నారు. 

దృష్టి సారించాల్సిందే

ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనే అంశంపై విమానాశ్రయ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉంది. దుబాయ్‌, కువైట్‌, మస్కట్‌, బహ్రెయిన్‌ దేశాల నుంచి నేరుగా వస్తే ఇప్పటి కిప్పుడు సమస్య కాకపోవచ్చు. అదే ఒమైక్రాన్‌ రిస్క్‌ దేశాల నుంచి ఈ దేశాలకు వచ్చి.. అక్కడి నుంచి వస్తేనే ప్రమాదం. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. 

Updated Date - 2021-12-07T07:03:10+05:30 IST