ఏసీపీలు సెలవుబాట!

ABN , First Publish Date - 2022-05-19T06:34:29+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో (అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) ఏసీపీలుగా పనిచేస్తున్న వారంతా సెలవు బాట పడుతున్నారు.

ఏసీపీలు సెలవుబాట!
ప్రేమ్‌కాజల్‌ దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ, హర్షిత చంద్ర ఏసీపీ (విశాఖపట్నం ఈస్ట్‌)

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు ఏసీపీలు సెలవు

మరొకరు పదోన్నతిపై బదిలీ 

కారణాలపై రకరకాలుగా ప్రచారం

పని ఒత్తిడే కారణమంటున్న కొందరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో (అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) ఏసీపీలుగా పనిచేస్తున్న వారంతా సెలవు బాట పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు సెలవుపై వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకూ నలుగురు ఏసీపీలు సెలవుపై వెళ్లగా, మరొకరు పదోన్నతిపై ఇతర ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆ పోస్టు ఖాళీ అయిపోయింది. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో సబ్‌ డివిజన్‌కు ఒక్కో ఏసీపీ ఉంటారు. ఆ సబ్‌ డివిజన్‌ పరిధిలోని శాంతి భద్రతలు, ఆ పరిధిలోని స్టేషన్లలో కేసుల నమోదు, దర్యాప్తు వంటి వాటిని పర్యవేక్షిస్తూ పోలీస్‌ కమిషనర్‌కు సహాయంగా పనిచేస్తుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఏసీపీలే అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఏసీపీకి పోలీస్‌ శాఖతోపాటు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఏసీపీగా పోస్టింగ్‌ దక్కించుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతుంటారు. కొంతమంది అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించి మరీ పోస్టింగ్‌ తెచ్చుకుంటారు. కానీ గత కొంతకాలంగా నగరంలో ఏసీపీలుగా పనిచేస్తున్న వారంతా ఎందుకోగానీ తీవ్ర అసంతృప్తితో విధులు నిర్వర్తిస్తున్నారని ఆ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. నగరంలో పోస్టింగ్‌ కోసం ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఏసీపీ పోస్టులకు పోటీ కూడా లేకుండా పోయిందని విశ్లేషిస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా నగరంలో పనిచేస్తున్న ఏసీపీలు ఒకరి తర్వాత ఒకరుగా సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీగా పనిచేస్తున్న హర్షిత చంద్ర సెలవుపై వెళ్లిపోయారు. హార్బర్‌ ఏసీపీగా పనిచేస్తున్న శిరీష మెటర్నటీ లీవ్‌పై వెళ్లిపోయారు. వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీపాదరావు, దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీగా పనిచేస్తున్న ప్రేమ్‌కాజల్‌ కూడా సెలవుపై వెళ్లిపోయారు. సౌత్‌ ఏసీపీగా పనిచేసిన రాజ్‌కమల్‌కు అదనపు ఎస్పీగా పదోన్నతి రావడంతో ఆయన వెళ్లిపోయారు. ప్రస్తుతం కేవలం నార్త్‌ ఏసీపీ, ద్వారకా ఏసీపీ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇతర విభాగాల్లో ఏసీపీలుగా పనిచేస్తున్న వారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారంతా రెండు బాధ్యతలను చూడలేకపోతున్నామంటూ సతమతమవుతున్నారు. ఇదిలావుంటే ఏసీపీలంతా ఒకరి తర్వాత ఒకరు సెలవుపై ఎందుకు వెళుతున్నారనే దానిపై పోలీస్‌ వర్గాల్లో పలురకాలుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది పని ఒత్తిడి పెరగడమే అని చెబుతుంటే, మరికొందరు వ్యక్తిగత కారణాలు అని పేర్కొంటున్నారు. 


Updated Date - 2022-05-19T06:34:29+05:30 IST