Hyderabadలో ఏసీపీ పోస్టింగ్‌ల లొల్లి.. ఆ ఇద్దరు మంత్రుల హస్తం..!?

ABN , First Publish Date - 2022-05-24T16:46:27+05:30 IST

Hyderabadలో ఏసీపీ పోస్టింగ్‌ల లొల్లి.. ఆ ఇద్దరు మంత్రుల హస్తం..!?

Hyderabadలో ఏసీపీ పోస్టింగ్‌ల లొల్లి.. ఆ ఇద్దరు మంత్రుల హస్తం..!?

  • ఎల్బీనగర్‌, పంజాగుట్ట ఏసీపీల బదిలీ 
  • రాజకీయ ఒత్తిళ్లతో ఉత్తర్వులు వెనక్కి..?

హైదరాబాద్‌ : పోలీసుశాఖలో ఎల్బీనగర్‌, పంజాగుట్ట ఏసీపీల బదిలీ చర్చనీయాంశమైంది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే.. బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. బదిలీలను ఆపడం వెనక.. ఇద్దరు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డీజీపీ మహేందర్‌రెడ్డి కొద్ది రోజులుగా డీఎస్పీ/ఏసీపీలను బదిలీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్‌ ఏసీపీగా సి.అంజయ్యను, పంజాగుట్ట ఏసీపీగా నర్సింగ్‌రావును నియమిస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. ఆయా స్థానాల్లో కొనసాగుతున్న శ్రీధర్‌రెడ్డిని, గణేశ్‌ను తన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అయితే.. వారు రిలీవ్‌ కాలేదు. పాతపోస్టింగ్‌లోనే కొనసాగుతున్నారు.


అంతేకాదు, సి.అంజయ్యకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ బాధ్యతలు అప్పగించారు. పంజాగుట్ట ఏసీపీగా నియమించిన నర్సింగ్‌రావు.. పాత పోస్టింగ్‌(సీసీఎస్‌ ఏసీపీ)లోనే కొనసాగుతున్నారు. ఈ బదిలీలు అమలవ్వకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు మంత్రులు ఉత్తర్వులు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. దళిత అధికారులకు పోస్టింగ్‌లివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. 


పోస్టింగ్‌లను అడ్డుకుంటే ఊరుకోం : జి.చెన్నయ్య

దళిత సామాజిక వర్గానికి చెందిన ఏసీపీలకు పోస్టింగ్స్‌ ఇస్తే అగ్రవర్ణాలకు చెందిన అధికారులు తమ రాజకీయ ప్రాబల్యంతో అడ్డుకుంటున్నారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హెచ్చరించారు. దళిత ఏసీపీల పోస్టింగ్‌లు అడ్డుకుంటే ఊర్కోమని అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2022-05-24T16:46:27+05:30 IST