విజేత..మనోధైర్యమే నన్ను నిలిపింది...

ABN , First Publish Date - 2020-09-24T09:02:04+05:30 IST

అన్నే అచ్యుత రామయ్య... వయసు 97 ఏళ్లు. ఆయన మనోధైర్యం ముందు పలు ఆరోగ్య సమస్యలు తలవంచిన సందర్భాలెన్నో

విజేత..మనోధైర్యమే నన్ను నిలిపింది...

అన్నే అచ్యుత రామయ్య, 97 ఏళ్లు. 


అన్నే అచ్యుత రామయ్య... వయసు 97 ఏళ్లు. ఆయన మనోధైర్యం ముందు పలు ఆరోగ్య సమస్యలు తలవంచిన సందర్భాలెన్నో. కొద్దిరోజుల కిందట కొవిడ్‌ను సైతం జయించారు. వయసు శరీరానికే కానీ, మనసుకి కాదనడానికి రామయ్య జీవన విధానమే ఉదాహరణ. ఆయన అన్నం వండుకోవడం, దుస్తులు ఉతుక్కోవడం వంటి రోజూవారీ పనులన్నీ చేసుకుంటారు. రెగ్యులర్‌గా ఆఫీసుకెళతారు. ‘‘నా పనులు నేను చేసుకోవడంలోనే నాకు ఆనందం, ఆరోగ్యం’’ అంటున్న అచ్యుత రామయ్య కొవిడ్‌ జయించిన తీరు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.! 


 హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి) : శ్రమ మాత్రమే వానరం నుంచి మనిషిని అత్యున్నతంగా మలిచిందనేది నా ప్రగాఢ విశ్వాసం. నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ నా పనులన్నీ నేనే చేసుకోవాలనేది నా పాలసీ. ఇతరుల మీద ఆధారపడటం నాకిష్టం ఉండదు. చాలాకాలంగా సీపీఎం రాష్ట్ర కార్యాలయం, అకౌంట్స్‌ విభాగంలో పని చేస్తున్నాను. పార్టీ ఆడిట్‌ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నాను. నా సహచరి గోవర్ధనమ్మ దూరమై మూడేళ్లు. ఆనాటి నుంచి ఇంటి, వంట పనులన్నీ చేసుకోవడం అలవాటైంది. నేనుండేది కూడా, మా ఆఫీసుకు దగ్గర్లోని ఒక అపార్టుమెంట్‌లోనే. పైగా ఒక్కడినే ఉంటాను. బీపీ, షుగర్‌ వంటి ఇతర ఆరోగ్యసమస్యలేమీ లేవు. కనుక సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, లాక్‌డౌన్‌లోనూ రోజూ ఆఫీసుకెళ్లేవాడిని. అక్కడ ఒకరోజు ఉద్యోగులందరికీ కొవిడ్‌ పరీక్షలు చేశారు. అప్పుడు నాకు పాజిటివ్‌ అని తేలింది. ఎక్కడ, ఎలా అటాక్‌ అయిందో తెలియదు. కానీ నాలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ లేవు. మా శ్రేయోభిలాషులంతా నన్ను గాంధీలో అడ్మిట్‌ అవ్వమని సూచించారు. వాళ్ల మాటను కాదనకుండా, చేరాను. ఆస్పత్రికి వెళ్లేముందు, ‘‘ఆరోగ్యంగా తిరిగొస్తాను. నన్ను ఈ కొవిడ్‌ ఏమీ చేయలేదు’’ అని మా వాళ్లందరితోనూ బలంగా చెప్పాను కూడా.. (నవ్వుతూ...). 


రెండు రోజుల్లో తిరుగుబాట...

గాంధీ ఆస్పత్రి వాతావరణం నాకు పెద్దగా నచ్చలేదు. రెండు రోజులు చూసి, నేనుండలేనని ఇంటికి తిరుగుబాట పట్టాను. ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూనే, నా పనులు నేను చేసుకునేవాడిని. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలేమీ లేవు. కనుక ఉదయాన్నే చాయ్‌ పెట్టుకోవడం, అన్నం వండుకోవడం, వాషింగ్‌మిషీన్‌లో దుస్తుల్ని ఉతుక్కోవడం, పాత్రలు శుభ్రం చేసుకోవడం, ఇల్లు తుడవడం వంటి పనులన్నీ నేనే చేసుకున్నా. అంతకు ముందు కూడా అవన్నీ చేసుకోవడం నాకు అలవాటే. అయితే, కొవిడ్‌ సమయంలో నా కూతురు రోజూ కూరలు పంపేది. వాళ్లు ఆ కర్రీ డబ్బాలను తెచ్చి మా ఫ్లాట్‌ బయట పెడితే, నేను వెళ్లి తీసుకొనేవాడిని. ముందు జాగ్రత్తగా ఆక్సీమీటరు, చిన్నపాటి ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా దగ్గర పెట్టుకున్నా. నాకు మొదటి పదిరోజులూ పెద్ద సమస్యలేమీ ఎదురవలేదు. కానీ తర్వాత శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయింది.


బహుశా! పద్నాలుగో రోజు అనుకుంటా... తెల్లవారుజామున ఊపిరి తీసుకోవడం బాగా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు, నాలో నేను ఈ సమస్యను ఎలాగైనా ఎదుర్కోవాలని చాలా బలంగా అనుకున్నాను. వెంటనే అప్రమత్తమై, ఆక్సిజన్‌ మాస్కు పెట్టుకున్నాను. రెండు గంటల తర్వాత కాస్త స్థిమితపడ్డాను. అలా మూడు రోజులు శ్వాస సమస్యతో బాధపడ్డాను. కానీ సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యంతో సమస్యను అధిగమించగలిగాను. నాకు మొదటి నుంచి పట్టుదల ఎక్కువ. ఐదేళ్ల కిందట నా కాలు ఫ్రాక్చర్‌ అయింది. ‘ఈ వయసులో సర్జరీ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండద’ని కొందరు డాక్టర్లూ అభిప్రాయపడ్డారు. కానీ, మా విజ్ఞప్తి మేరకు కాలికి ఆపరేషన్‌ చేసి, రాడ్‌ వేశారు. అప్పుడు మా వాళ్లతో ‘ఒక్క నెలరోజుల్లో మామాలుగా నడుస్తాను’ అన్నాను. కేవలం ఒక లక్ష్యాన్ని బలంగా కోరుకోవడమే కాదు, అందుకోసం శాస్త్రీయ పద్ధతిలో కృషి జరగాలి. అప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. నాకు సమస్య ఎదురైన రెండు సందర్భాల్లోనూ, నేనూ ఆ విధంగానే ప్రయత్నించాను. కనుకే త్వరగా కోలుకోగలిగాను. 


నా ఆహారశైలి...

కొవిడ్‌ సమయంలో నేను సాధారణ ఆహారమే తీసుకున్నా. ముఖ్యంగా నా భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ ఉండేట్లు చూసుకున్నా. పొద్దున్నే చాయ్‌ పెట్టుకొని, తాగేవాడిని. రోజూ మధ్యాహ్నం ఒక కోడిగుడ్డు తప్పక తీసుకునేవాడిని. పెరుగు, పండ్లు తీసుకోవడం కూడా అవసరం. అప్పుడు రుచిలో కాస్త తేడా వస్తుంది. కానీ ఆరోగ్యం కోసం మనం పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. డాక్టర్ల సలహా మేరకు కొన్ని విటమిన్‌ మాత్రలు వాడాను. అందుకు నాకు అయిన ఖర్చు కూడా ముఫ్ఫై రూపాయలే.! పదహారు రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నాను. తర్వాత రెండు వారాలు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పటికీ నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. కొద్దిరోజులు ఆఫీసుకూ వెళ్లాను. పార్టీ నాయకులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కలెక్టీవ్‌ సజిషన్‌ను గౌరవించాలి కదా.! అందుకోసం ఇప్పుడు డ్యూటీకి వెళ్లడం లేదు. రోజూ పత్రికలతో పాటు మరికొన్ని సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవడంతో కాలక్షేపం అవుతుంది. న్యూస్‌ చానల్స్‌నూ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటా. ఒంటరిగా ఉన్నా, నాకు ఒంటరితనం అనిపించదు. మనం వాస్తవిక దృక్పథంతో జీవితాన్ని చూసినప్పుడు, మన లైఫ్‌లోని మార్పులనూ స్వాగతించగలం. కొవిడ్‌ సమయంలో ఒక్కడినే ఉన్నా. కానీ ధైర్యంగా ఉన్నా. అదే నన్ను ఆరోగ్యవంతుడిని చేసింది. 

Updated Date - 2020-09-24T09:02:04+05:30 IST