అన్న త్యాగం..తమ్ముడి విజయం

ABN , First Publish Date - 2022-08-02T09:08:05+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలోని చిన్న ఊరు దేవుల్‌పూర్‌. జరీ వర్క్‌కు పేరుగాంచిన ఈ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించాడు..

అన్న త్యాగం..తమ్ముడి విజయం

కటిక దారిద్య్రం..

హఠాత్తుగా తండ్రి మరణం.. దహన సంస్కారాలకే డబ్బుల్లేక వెక్కివెక్కి ఏడ్చిన పసితనం.. కుట్టు పనులతో బతుకీడ్చిన తల్లి.. తమ్ముడి కోసం కూలీగా మారిన అన్న.. చాలీచాలని తిండి.. ముక్కుపచ్చలారని వయసులోనే కొండంత కష్టాలు మోసిన అచింత షూలి.. మానసికంగా రాటుదేలాడు. మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. 


పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలోని చిన్న ఊరు దేవుల్‌పూర్‌. జరీ వర్క్‌కు పేరుగాంచిన ఈ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించాడు అచింత. తండ్రి జగత్‌ రిక్షా తోలేవాడు. కాగా.. తల్లి కుట్టు పనులు చేసేది. అన్న అలోక్‌కు చిన్ననాటి నుంచే వెయిట్‌ లిఫ్టింగ్‌ అంటే ఇష్టం. దీంతో ఆ క్రీడలో అతడు శిక్షణ తీసుకొంటూ ఉండేవాడు. 11 ఏళ్ల వయసులో అచింతకు పతంగులు ఎగరేయడం, తెగిన వాటిని పరుగెత్తి పట్టుకోవడం అంటే సరదా. దీంతో ఓసారి గాలిపటం తెగి తన అన్న శిక్షణ తీసుకుంటున్న వ్యాయామ శాల వద్ద పడింది. గాలి పటం కోసం అక్కడకు వెళ్లిన అచింత.. అనుకోకుండా వెయిట్‌ లిఫ్టింగ్‌లో పడిపోయాడు. పతంగి ఎగుర వేస్తున్నప్పుడు షూలి మణికట్టు మాయాజాలం కోచ్‌ ఆస్థమ్‌ దాస్‌ను ఎంతో ఆకర్షించింది. దీంతో తర్వాతి రోజు నుంచి అకాడమీకి శిక్షణకు రమ్మన్నాడు. 


అంత్యక్రియలకు డబ్బుల్లేక..

హాయిగా సాగుతున్న అచింత జీవితం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. 2013లో షూలి తండ్రి జగత్‌.. గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అన్నదమ్ములిద్దరూ చిన్నవారే. తండ్రి అంత్యక్రియలకు డబ్బులు లేని సమయంలో.. అచింత భోరున ఏడ్వడం తనకు ఇప్పటికీ గుర్తుందని అలోక్‌ జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే, అన్న అలోక్‌ ప్రభావం అచింతపై ఎక్కువగా ఉంది. తనకంటే తమ్ముడిలోనే ఎక్కువ ప్రతిభ దాగుందని గుర్తించిన అలోక్‌.. తన ఆశలను త్యాగం చేశాడు. కుటుంబ పోషణ కోసం కూలీగా మారాడు. కానీ, అచింత పెద్ద ఆటగాడు కావాలని నిత్యం కోరుకొనే వాడు. 


  జీవితాన్ని మార్చిన ‘ఆర్మీ స్పోర్ట్స్‌’

జాతీయ జూనియర్‌ పోటీల్లో పతకం నెగ్గడంతో అచింతకు మంచి రోజులు మొదలయ్యాయి. 2015లో ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అవకాశం దక్కడం జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాతి ఏడాదే జాతీయ క్యాంప్‌నకు ఎంపికైన షూలి.. కామన్వెల్త్‌ యూత్‌ చాంపియన్‌షి్‌ప, ఆసియా యూత్‌ చాంపియన్‌షి్‌పలో రజతాలు సాధించాడు. గతేడాది కామన్వెల్త్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణంతో మెరిశాడు. ‘ఒకప్పుడు ఇల్లు గడవడం కోసం అందరం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరీ వర్క్స్‌ చేసేవాళ్లం.


కానీ, నా కెరీర్‌ కుదుటపడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గాయి. ప్రస్తుతం చిన్నపాటి ఇల్లు కట్టుకుంటున్నామ’ని అచింత తెలిపాడు. గతాన్ని తలుచుకున్నప్పుడు బాధనిపించినా.. ఇప్పుడు అంతా మంచే జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. తన కోసం తనకిష్టమైన లిఫ్టింగ్‌ను వదిలేసిన అన్న అలోక్‌కు తన స్వర్ణ పతకాన్ని అంకితమిస్తున్నానని గర్వంగా చెప్పాడు.

Updated Date - 2022-08-02T09:08:05+05:30 IST