సాధించారు..

ABN , First Publish Date - 2022-08-04T06:59:56+05:30 IST

వెలిగొండకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రాజెక్టుకు సాంకేతికంగా మరణశాసనంలా నిలిచిన లోపాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు సరిదిద్దింది.

సాధించారు..
కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు (ఫైల్‌)

వెలిగొండకు లైన్‌ క్లియర్‌ 

కేంద్ర గెజిట్‌లో ప్రాజెక్టు

గతంలో జరిగిన లోపాన్ని సరిదిద్దిన కేంద్రం

నాడు కేంద్ర జలశక్తి మంత్రిని  కలిసిన టీడీపీ నేతలు

ఎట్టకేలకు ఫలించిన వారి కృషి

తాజా నిర్ణయంపై షెకావత్‌కు కృతజ్ఞతలతో లేఖ

వెలిగొండకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.  ప్రాజెక్టుకు సాంకేతికంగా మరణశాసనంలా నిలిచిన లోపాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు సరిదిద్దింది.  గెజిట్‌లో చేర్చుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించగా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను గతేడాది జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కలిసి గెజిట్‌లో చేర్చాలని కోరారు. అనంతరం   ఈ వ్యవహారంపై కేంద్రప్రభుత్వ స్థాయిలో కదలిక రాగా ఇప్పటికి ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చుతూ  ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు కేంద్రమంత్రి షెకావత్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ కూడా రాశారు.

ఒంగోలు, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదిలింది. జిల్లాకు ప్రధానమైన పూలసుబ్బ య్య వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేరుస్తూ ఉత్తర్వు లిచ్చింది. దీంతో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకుల కృషి ఫలించినట్లైంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణానది మిగులు జలాలు ఆధారంగా వెలిగొండను జిల్లాతోపాటునెల్లూరు, కడప జిల్లాలోని 4.59లక్షల ఎకరాలకు సాగునీరు, 15.50లక్ష ల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న విషయం విదితమే. పాతికే ళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజె క్టుకు రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణ కోసం ఇచ్చిన ఉత్తర్వుల్లో వెలిగొండను అనుమతిలేని ప్రాజెక్టుగా చూపింది. ఇందుకు సంబంధించి గతేడాది జూలైలో ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయంలో  తెలంగాణ రాష్ట్ర ఫిర్యాదుల మేరకు కేంద్రం ఆ విధంగా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులు చేపట్టగా, విభ జన అనంతరం కొన్ని ఆంధ్రాలో, మరికొన్ని తెలంగాణ లోకి వచ్చాయి. అలాంటి వాటిని విభజన చట్టంలో చేర్చిన కేంద్రం వాటికి నీటి కేటాయింపులు చేయాలని కూడా ఆదేశించింది. తద్వారా నికర జలాలు వస్తాయ ని, జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమప్రాం తం సస్యశ్యామలం అవుతుందని ప్రజలు ఆశించారు. 


 పోరాడిన టీడీపీ

గతేడాది జూలైలో కృష్ణా, గోదావరి వంటి నదుల పర్యవేక్షణపై  ఇచ్చిన గెజిట్‌లోఈ తరహాలో ఉన్న ఐదు ప్రాజెక్టులను చేర్చిన కేంద్రం వెలిగొండను అనుమతి లేని ప్రాజెక్టుగా చూపింది. అసలు ప్రాజెక్టు ఉనికికే ఇబ్బంది కలిగే ఈ వ్యవహారాన్ని తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురాగా, అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామి తక్షణం రాష్ట్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గతేడాది జూలై 16న సీఎంకు లేఖ రాశారు.  ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడంతో కేంద్రప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు గత ఏడాది ఆగస్టు 31న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి ప్రాజెక్టు ప్రాధాన్యతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న ఈ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో తదుపరి చర్యలు ప్రారంభం కాగా, చాలా ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వం కదిలి కేంద్రానికి లేఖ రాసింది. 


ఏడాది తర్వాత నిర్ణయం

టీడీపీ నేతలు కలిసిన ఏడాది తర్వాత తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా నిర్మాణంలో ఉన్న ఇతర ఐదు ప్రాజెక్టులతోపాటు, వెలిగొండను కూడా తిరిగి గెజిట్‌లో చేర్చింది. ఆమేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. తద్వారా వెలిగొండ ప్రాజెక్టు భవిష్యత్‌కు, నీటి కేటాయింపులకు సాంకేతికంగా ఎదురైన పెద్ద సమస్య తొలిగిపోయింది. ఇదిలాఉండగా వెలిగొండను తిరిగి గెజిట్‌లో కేంద్రం చేర్చడంపై ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం గత ఏడాది తాము చొరవ చూపి చేసిన ప్రయత్నాలతో స్పందించిన కేంద్రం ఈ సాంకేతిక సమస్యను సరిచేసిందని ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌డీవీ స్వామిలు పేర్కొన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు బుధవారం టీడీపీ తరఫున లేఖ రాశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఇతర నేతలు డాక్టర్‌ ఎన్‌.బాలాజీ, కె.నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, దామచర్ల జనార్దన్‌, పోతుల రామారావు, బీఎన్‌.విజయ్‌కుమార్‌, దివి శివరాం, ఎరిక్షన్‌బాబు, దామచర్ల సత్య, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా లేఖపై సంతకాలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్రప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టు పూర్తిచేసేలా కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తీసుకురావాలని షెకావత్‌కు రాసిన లేఖలో వారు కోరారు. 


Updated Date - 2022-08-04T06:59:56+05:30 IST