అమరావతి: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి కూన రవికుమార్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే.. వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి ఉందన్నారు. రవికుమార్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కావాలనే జగన్ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని విమర్శించారు. వరదలతో ప్రజలు ప్రాణాలు పోతుంటే దానిపై దృష్టి పెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలను అరెస్టులు చేస్తే వరదల్లో చనిపోయినవారు, నష్టపోయిన పంటలు తిరిగిరావన్నారు. దేశంలో జగన్ లాంటి డైవర్షన్ ముఖ్యమంత్రి ఎక్కడా లేరన్నారు. నిండు సభలో చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పకుండా వాఖ్యల పట్ల ఆందోళన చేసిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తారా? అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.