వర్షాలు, వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో రైతులు.. సీఎం ఏం చేస్తున్నారు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-11-20T17:22:31+05:30 IST

ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...

వర్షాలు, వరదలు.. తీవ్ర ఇబ్బందుల్లో రైతులు.. సీఎం ఏం చేస్తున్నారు: అచ్చెన్న

అమరావతి: ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు, ప్రాణ, ఆస్తి ‎ నష్టం జరిగిందన్నారు. కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోయారన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‎వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వరదలపై శ్రద్ధ పెట్టకుండ బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డికి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవటంలో లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా సీఎం బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని సూచించారు. చనిపోయిన వారి ‎కుటుంబాలకు తక్షణమే ఆర్దిక సాయం అందించాలన్నారు. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల అన్ని కోల్పోయి ఆపన్న హస్తం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, బాధితులకు అండగా నిలబడి సహాయక చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-20T17:22:31+05:30 IST