నిరుపేదల జీవితాలు చిన్నాభిన్నం

ABN , First Publish Date - 2021-03-05T06:22:15+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదల బతుకులు చిన్నాభిన్నమయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

నిరుపేదల జీవితాలు చిన్నాభిన్నం
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తున్న అచ్చెన్నాయుడు

విశాఖ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

మహారాణిపేట, మార్చి 4: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పేదల బతుకులు చిన్నాభిన్నమయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దక్షిణ నియోజకవర్గంలోని 30, 37వ వార్డులలో ఎన్నికల పరిశీలకుడు నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన జగన్‌మోహన్‌రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోక పోయినా, ప్రస్తుతం ఆకాశంలో ఉన్న ఆయన కళ్లు కిందికి దిగుతాయన్నారు. గడచిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతల అంశాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ చేసింది కాదన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసినందున టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు.


విశాఖతో  చంద్రబాబుది విడదీయలేని అనుబంధం అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో విశాఖ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కరించేవారని, విశాఖ అంటే ఆయనకు అంత మక్కువని అన్నారు. సీఎం ఆదాయం రోజుకు రూ. 300 కోట్లు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘ఈ ఎన్నికలలో ఓటుకు ఎంత ఇచ్చినా తీసుకోండి... అది మన డబ్బు’ అని అని చెప్పారు. అయితే ఓటు మాత్రం సైకిల్‌ గుర్తుపై వేయాలన్నారు. 


పార్టీ పరిశీలకుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కుపై ముఖ్యమత్రి జగన్‌ కన్ను పడిందని, అందుకే అమ్మకం ప్రయత్నం చేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు. ప్రజలు మేయర్‌ పీఠం కట్టబెడితే వైసీపీ పెంచుతున్న ఇంటి పన్నులను తగ్గిస్తామని, అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వార్డులో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతోపాటు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌ , పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:22:15+05:30 IST