పరమాత్మ దర్శనం

ABN , First Publish Date - 2020-08-01T10:16:52+05:30 IST

ఆదిశంకరాచార్యుల వారు ‘భజగోవిందం’లోని ఈ శ్లోకం ద్వారా ‘‘మానవాళికి గురుచరణ కమలముల పట్ల అచంచలమైన భక్తి కలిగి ఇంద్రియాలనూ, మనస్సునూ అదుపులో పెట్టుకోవడం ద్వారా సంసార

పరమాత్మ దర్శనం

గురుచరణాంబుజ నిర్భరభక్తః సంసారాదచిరాద్భవ ముక్తః!

సేంద్రియ మానస నియామాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్‌!!


ఆదిశంకరాచార్యుల వారు ‘భజగోవిందం’లోని ఈ శ్లోకం ద్వారా ‘‘మానవాళికి గురుచరణ కమలముల పట్ల అచంచలమైన భక్తి కలిగి ఇంద్రియాలనూ, మనస్సునూ అదుపులో పెట్టుకోవడం ద్వారా సంసార చక్రం నుంచి త్వరలో విముక్తులు కాగలరు. అప్పుడే హృదయంలోని పరమాత్మను దర్శించుకోగలుగుతారు’’ అని బోధించారు.


పరమాత్మ, పరబ్రహ్మ, బ్రహ్మము, ఆత్మ-ఇవి అన్నీ పర్యాయ పదాలే. ఆత్మ అంటే అనన్యమైన బ్రహ్మము మాత్రమే. బ్రహ్మము నిత్యబుద్ధము, నిత్యయుక్తము, నిరవయవము, నిర్గుణము, రూపరహితము, అపరిచ్ఛిన్నము, అవిభాజ్యము, పరిపూర్ణము, నిత్యము, అనులినము. బ్రహ్మము అనేది జీవులందరిలోనే కాక విశ్వమంతా వ్యాపించి ఉన్నది. బ్రహ్మము ఒక్కటే సత్యం. ఈ జగత్తు మిథ్య.


‘‘సూర్యుడి నుంచే కిరణాలు వెలువడినట్లుగా ఈ ఆత్మనుంచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు వెలువడుతున్నారు. సముద్రం నుంచి బుడగలవలె ఈ ఆత్మ నుంచే జగత్తులు పుడుతున్నాయి’’ అని యోగావాశిష్ఠం చెబుతోంది. లోకంలో చాలామంది ఈ స్థూలశరీరమే తామనుకుని, దీనిని పోషించుకుంటూ, అలంకరించుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఇది నిలిచేది కాదు. మరణిస్తుంది. కానీ, నీకు చావు లేదు. నీవు ఇలాంటి శరీరాలెన్నో ధరిస్తావు. ఇది నీ శరీరమే కానీ నీవు కాదు.. అని చెప్పినా.. దానిపై అభిమానం పోవడం లేదు. నేను కాని ఈ శరీరాన్ని నేననుకోవడం వల్లే అజ్ఞానం పెరిగిపోయి, ఇన్ని దుఃఖాలేర్పడుతున్నాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్థక్య దశల్లో దేహం మారుతున్నప్పటికీ, మార్పు లేకుండా ఉన్నది నేను అని చెప్పుకొంటున్న ఆత్మ మాత్రమే. అందరిలోనూ, అన్ని ప్రాణుల్లోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. 


భగవాన్‌ షిరిడీ సాయిబాబ- ‘‘నన్ను వెదుకుటకు నీవు దూరముగాని, మరెచ్చటికో గాని పోనక్కరలేదు. నీ ఆకారము, నీ నామము విడిచినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నన్ను చూడు’’ అని చెప్పారు. సుఖాలు, భోగభాగ్యాలు ఉన్న మానవుడైనా ఇంకా ఏదో కావాలనే మోహంలో పడిపోతున్నాడు. ఫలితంగా మానసిక శాంతి లేక బాధపడుతున్నాడు. దీనికి కారణం అవిద్య. మానవుడు జ్ఞానము సహాయమునే భగవత్‌ సాక్షాత్కారం పొందగలడు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు అయినటువంటి పరమాత్మ ద్వారానే లభిస్తుంది. అట్టి శాశ్వతానందమే ముక్తి. ఎంత ఎత్తుకు ఎదిగినా చివరి మజిలీ మాత్రం పరమాత్మ పాదాలేననే సత్యాన్ని ఎరిగి మనమంతా మోక్షసాధనకు కృషి చేయాలి. 


ఆచార్య ఎస్‌.జయరామరెడ్డి, 9949027118 

Updated Date - 2020-08-01T10:16:52+05:30 IST