ఆరోపణలున్నవారే విచారణాధికారులా?

ABN , First Publish Date - 2020-06-06T10:17:50+05:30 IST

కీలకమైన అంశాలపై విచారణ జరపాలంటే ఎలాంటి ఆరోపణలు, అభ్యంతరాలు లేని వారిని విచారణాధికారులుగా నియమించడం ప్రభుత్వంలో చూస్తుంటాం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులనే పనిగట్టుకుని

ఆరోపణలున్నవారే విచారణాధికారులా?

  • శ్రీశైలం, సింహాచలం ఉదంతాల్లో అంతే!
  • ఆజాద్‌పై ఏసీబీ కేసు, ఏడీసీపై ఇసుక ఆరోపణలు


అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): కీలకమైన అంశాలపై విచారణ జరపాలంటే ఎలాంటి ఆరోపణలు, అభ్యంతరాలు లేని వారిని విచారణాధికారులుగా నియమించడం ప్రభుత్వంలో చూస్తుంటాం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులనే పనిగట్టుకుని విచారణాధికారులుగా నియమించడం ఇప్పుడు దేవదాయశాఖలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల వివాదాస్పదంగా మారిన శ్రీశైలం, సింహాచలం ఉదంతాలపై విచారణాధికారులుగా తీవ్ర ఆరోపణలున్న వ్యక్తులనే నియమించారు. సింహాచలం దేవస్థానంలో కమిషనర్‌ అనుమతి లేకుండా పనులు చేపట్టడం, భూముల ఆక్రమణలు, షాపుల కేటాయింపుల్లో అక్రమాలు తదితర అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను దేవదాయశాఖ విచారణాధికారిగా నియమించింది. ఈయన గతేడాది ఏసీబీ కేసులో ఇరుక్కుని సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసు కారణంగానే అదనపు కమిషనర్‌ కావాల్సిన ఆయన పదోన్నతి రాకుండా జాయింట్‌ కమిషనర్‌గా మిగిలిపోయారు. ఇన్ని ఆరోపణలున్న ఆజాద్‌ను విచారణాధికారిగా నియమిస్తే వాస్తవాలు బయటికొస్తాయా? అని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీశైలం దేవస్థానంలో సాఫ్ట్‌వేర్‌ లొసుగులతో కోట్లు కొట్టేసిన వ్యవహారంపై దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను విచారణాధికారిగా నియమించారు. సింహాచలం ఈవోగా పనిచేసినప్పుడు ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మానసాస్‌ ట్రస్టు ఈవోగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల విలువైన ఇసుకను తరలించడంపై అనుమానాలున్నాయని రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబ ఇటీవలే కమిషనర్‌కు లేఖ రాశారు. కారణాలు ఏవైనా ఆ తర్వాత దానిపై ఎలాంటి విచారణ చేయకుండానే వదిలేశారు. పైగా ఈ అంశంపై విచారణ జరపొద్దని రామచంద్రమోహన్‌ ఫోన్లు చేసి ఒత్తిడి చేశారని అప్పట్లో భ్రమరాంబ ఆరోపించారు. ఇటువంటి వ్యక్తితో శ్రీశైలం వ్యవహారంలో విచారణ చేయించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Updated Date - 2020-06-06T10:17:50+05:30 IST