పలు చోరీ కేసులలో నిందితులు అరెస్టు

ABN , First Publish Date - 2022-08-20T06:33:23+05:30 IST

నగరంలోని పలు దొంగతనం కేసులలో నిందితులను అరెస్టు చేసినట్టు క్రైమ్‌ డీసీపీ నాగన్న తెలిపారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన వివరాలు వెల్లడించారు

పలు చోరీ కేసులలో నిందితులు అరెస్టు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ నాగన్న, ఇతర అధికారులు

మహారాణిపేట, ఆగస్టు 19: నగరంలోని పలు దొంగతనం కేసులలో నిందితులను అరెస్టు చేసినట్టు క్రైమ్‌ డీసీపీ నాగన్న తెలిపారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన వివరాలు వెల్లడించారు. గాజువాకకు చెందిన ఒక జ్యూవెలరీ షాపులో బంగారు వస్తువులను చూస్తూ సేల్స్‌మన్‌ను ఏమార్చి నకిలీ బంగారు గొలుసును అక్కడ పెట్టి, అసలైన బంగారు గొలుసును దొంగిలించిన స్టీల్‌ప్లాంట్‌కు చెందిన బంగారు శ్యామల, మద్దిరాల అంకయ్యలను అరెస్టు చేసినట్టు తెలిపారు. 

ఆరిలోవలో గవర వెంకట లక్ష్మి అనే మహిళ ఇంటి వద్దకు అల్లిపురం వెంకటేశ్వర మెట్టకు చెందిన ఆకులరాజు వెళ్లి తాగేందుకు నీరు అడిగాడు. ఈ సమయంలో అమె మెడలోని బంగారు పుస్తెల తాడును  తెంపుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. 

పెందుర్తి నాయుడు తోటలోని రవినగర్‌లో నివాసం ఉంటున్న  కాండ్రేగుల కోనేటి రావు అతని కుటుంబసభ్యులతో ఢిల్లీలోని తన కుమార్తె వద్దకు వెళ్లారు. ఈక్రమంలో అతని ఇంటి గేటు తాళాలు విరగ్గొటి,్ట కారును దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోపాలపట్నంకు చెందిన ఇద్దరు మైనర్‌లను అరెస్టు చేశారు.

తాను పనిచేస్తున్న షాపులోనే కెమెరాలను, వస్తువులను దొంగిలించి అమ్ముకున్న వ్యక్తిని త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆశీలుమెట్టలోని ఎస్‌వీఆర్‌ కెమెరా షాపులో పెంటకోట అశోక్‌ గత ఏడాది కాలంగా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై షాపులోని కెమెరాలు, బ్యాటరీలు తస్కరించాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.


Updated Date - 2022-08-20T06:33:23+05:30 IST