హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-02T05:55:08+05:30 IST

నగర శివారు ప్రాంతం బుజబుజ నెల్లూరులో గత నెల 27వ తేదీ జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను ఆదివారం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వివరాలు వెల్లడించారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్‌
నిందితుల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి

పాతకక్షలే కారణం


నెల్లూరు(క్రైం), ఆగస్టు 1: నగర శివారు ప్రాంతం బుజబుజ నెల్లూరులో గత నెల 27వ తేదీ జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను ఆదివారం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వివరాలు వెల్లడించారు. బుజబుజనెల్లూరు శివాజీ కాలనీకి చెందిన సంపత్‌ సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఫ్రిబవరిలో బుజబుజనెల్లూరుకు చెందిన మురుగన్‌ భాస్కర్‌ను అదే ప్రాంతానికి చెందిన దేవా, రసూల్‌, వెంకటేశ్వర్లు, ఆరీఫ్‌ తదితరులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో సంపత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే నిందితులకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న కారణంగా మురుగన్‌ భాస్కర్‌ బావలు సూర్య, మునిస్వామి కలిసి సంపత్‌పై కక్ష పెంచుకున్నారు. భాస్కర్‌ హత్య వెనుక సంపత్‌ ప్రమేయం ఉందనే అనుమానంతో అతని హత్యకు పథకం రచించారు. గతనెల 27వ తేదీ రాత్రి సంపత్‌ వెళుతుండగా సూర్య, మునిస్వామితోపాటు వారి స్నేహితులైన నాగమ్మకాలనీకి చెందిన షేక్‌ ఖలీల్‌ అలియాస్‌ అబ్బు, జీ వినోద్‌, మహమ్మద్‌ షఫీ, సమతానగర్‌కు చెందిన షేక్‌ జావిద్‌, రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌ ప్రాంతానికి చెందిన పీ నవీన్‌తో కలిసి సంపత్‌ కళ్లలో కారం చల్లి దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న సంపత్‌ స్థానికంగా ఉండే శశి మెడికల్‌ షాపులోకి చొరబడ్డాడు. నిందితులు కూడా దుకాణంలోకి వెళ్లి కత్తులతో సంపత్‌ను పొడిచి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న సంపత్‌ను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ కేసు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం నిందితులను బుజబుజనెల్లూరు శిల్పారామం వద్ద అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల్లో ఒకరిపై రౌడీషీటు ఉందని, మిగిలిన వారందరిపై రౌడీషీట్లు తెరిచామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-02T05:55:08+05:30 IST