Abn logo
Jul 30 2021 @ 23:59PM

పక్కాగా సాగు లెక్క

కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారంలో పంట సాగు వివరాలు నమోదు చేస్తున్న ఏఈవో(ఫైల్‌)

- క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వ్యవసాయశాఖ
- విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చర్యలు
- పంటల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఉపయుక్తం
- రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ‘క్రాఫ్‌ బుకింగ్‌’ విధానం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో రైతులు ఏ ఏ పంటలను సాగు చేస్తున్నారో పక్కాగా వివరాలు నమోదు చేసేం దుకు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయికి వెళ్లి వివ రాలు సేకరించేందుకు సన్నద్ధం అవుతున్నారు. గతంలో ఆయా ప్రాంతాల్లో విక్రయమవుతున్న విత్తనాలు, సాధారణంగా రైతులు చెప్పే వివరాల ఆధారంగానే జిల్లా వ్యాప్తంగా వివిఽధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని మాత్ర మే లెక్కలు తీసే వాళ్లు. ఈ విధానం శాస్త్రీయగా లేని కారణంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను ఎంత మొత్తంలో సమ కూర్చాలి, పంట దిగుబడుల కొనుగోలు కేంద్రాలను ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలనే విషయమై స్పష్టత ఉండేది కాదు.

గత ఏడాది నుంచి..
దీంతో రైతులు ఇబ్బందులు పడడాన్ని గమనించిన ప్రభుత్వం గత ఏడాది నుంచి క్రాఫ్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకు వచ్చింది. ఏఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలను సాగు చేస్తున్నారనే విషయమై సర్వే నంబర్ల వారీగా క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో రైతులు ఏఏ పంటను ఎంత విస్తీర్ణంలో ఎంత పంటను సాగు చేశారనే విషయం పక్కాగా తెలుస్తోంది. తదనుగుణంగా ప్రభుత్వం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సమకూర్చడంతో పాటు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తొలగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో బినామీ రైతుల పేరిట పంట ఉత్పత్తులను అమ్మడానికి వీలు లేకుండా ఏర్పడింది. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించినప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక రైతు సాగు చేసిన విస్తీర్ణానికి మించి పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తే డబ్బులు చెల్లించేందుకు సాఫ్ట్‌వేర్‌ తిరస్కరించనున్నది. ‘క్రాఫ్‌ బుకింగ్‌’ పేరిట రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారమే పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాల్సి ఉంటుంది. క్రాఫ్‌ బుకింగ్‌ విధానాన్ని గత ఏడాది వానాకాలం సీజన్‌ నుంచి అమలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు మాసంలో మొత్తం పంటలు వేసిన తర్వాత వ్యవసాయ శాఖాధికారులు, విస్తరణాధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. రైతు పేరు, తనకున్న భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఏఏ పంటలను సాగు చేస్తున్నారు, వర్షాధారం ఎంత, సాగు వసతి గల బావులు, కాలువల కింద ఎంత సాగు చేస్తున్నారు, ఆధార్‌, మోబైల్‌ నంబర్‌, తదితర వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.

వివరాల ఆధారంగా..
ఆ వివరాల ఆధారంగా ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,93,441 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,05,089 ఎకరాల్లో వరి, 721 ఎకరాల్లో మొక్కజొన్న, 76,831 ఎకరాల్లో పత్తి, 258 ఎకరాల్లో పెసర, 17 ఎకరాల్లో మినుము, 1,647 ఎకరాల్లో కంది, 45 ఎకరాల్లో బబ్బెర, 101 ఎకరాల్లో ఇతర పంటలు, 8,732 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వీటికి అనుగుణంగా మార్కెట్‌లో కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబా టులోకి తెచ్చింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. ఆరుతడి పంటల కింద పత్తి, మొక్కజొన్న పంటలను ఇప్పటికే వేశారు. గత ఏడాది నమోదు చేసిన పంటల వివరాలను గ్రామాల వారీగా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని క్షేత్ర స్థాయికి వెళ్లి పంట వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమలప్రసాద్‌ ఇటీవల ఏవోలతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు చేసిన తర్వాత రైతుల సెల్‌ ఫోన్లకు వివరాల సమాచారం మెస్సేజ్‌ రూపంలో రానున్నాయి. ఈ సర్వే ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన పంటలను రైతులు పండిస్తున్నారనే వివరాలు సమగ్రంగా తెలియ నున్నవి. దానికి అనుగుణంగా ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చర్యలు తీసుకోనుంది.


నివేదికలు రూపొందిస్తాం..
 తిరుమల్‌ ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

జిల్లాలో రైతులు ఏఏ పంటలను సాగు చేస్తున్నారో పక్కాగా లెక్కలు తీసి నివేదికలను రూపొందిస్తాం. గత ఏడాది వర్షాకాలం సీజన్‌లో సేకరించిన వివరాల ప్రతులను గ్రామాల వారీగా తీసుకుని క్షేత్ర స్థాయికి వెళ్లి వివరాలు సేకరించాలని అధికారులు, సిబ్బందికి చెప్పాం. జిల్లాలో వరి నాట్లను ఆగస్టు 15 వరకు కూడా వేస్తారు. కాగా ఈసారి ముందస్తుగా వర్షాలు పడడం వల్ల ఆ లోపే వరి నాట్లు పూర్తి కానున్నాయి.