పక్కాగా నిరంతర నీటి సరఫరా పనులు

ABN , First Publish Date - 2022-05-20T05:43:48+05:30 IST

నిరంతర నీటి సరఫరా పథకాన్ని ప్రజలకు మరింత పక్కాగా అందించేందుకు సత్వర చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా తెలిపారు.

పక్కాగా నిరంతర నీటి సరఫరా పనులు
పైపులైన్‌ పనితీరు పరిశీలిస్తున్న కమిషనర్‌ లక్ష్మీషా

ప్రగతిని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

మాధవధార, మే 19: నిరంతర నీటి సరఫరా పథకాన్ని ప్రజలకు మరింత పక్కాగా అందించేందుకు సత్వర చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా తెలిపారు. జోన్‌-5 పరిధిలోని మురళీనగర్‌, మాధవధార, మర్రిపాలెం ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బ్లాకుల్ని గురువారం ఆయన పరిశీలించారు. బ్లాకు నంబరు 15, 18, 22 రిజర్వాయర్ల  నుంచి సరఫరా తీరును తనిఖీ చేశారు.


వేసవి దృష్ట్యా మంచినీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని విభాగం ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం మాధవధార వుడా కాలనీలో బ్లాక్‌ నంబరు 22కి ఎక్కడి నుంచి ఏ మేరకు నీరు సరఫరా అవుతోంది, ఏ ఏ ప్రాంతాలకు తిరిగి పంపిణీ జరుగుతోందనే విషయాలపై ఆరా తీశారు. రైవాడ రిజర్వాయరు నుంచి గ్రావిటీ ద్వారా నీరు వస్తుందని, అక్కడ నుంచి మురళీనగర్‌, మాధవధార, మర్రిపాలెం, బర్మాకాలనీ ప్రాంతాలకు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు ప్రతి రోజు పంపిణీ అవుతుందని అధికారులు కమిషనర్‌కు వివరించారు.


వుడా కాలనీ, రామన్నకాలనీ, సంజీవయ్య కాలనీ ప్రాంతాలకు ఇదే బ్లాకు నుంచి నీరు అందిస్తున్నట్లు తెలిపారు.  లీకేజీలపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్సీ ఎం.మల్లయ్యనాయుడు, పర్యవేక్షక ఇంజనీరు కె.వి.ఎన్‌.రవి, కార్యనిర్వాహక ఇంజనీరు పెంటారావు, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ అరుణవల్లి, ఇంజనీరింగ్‌ అధికారులు, ఎన్‌సీసీ ప్రాజెక్టు జీఎం ఎం.జయశంకర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-20T05:43:48+05:30 IST