ఖాతా ఖాళీ!

ABN , First Publish Date - 2022-01-29T05:24:15+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ రోడ్డులోని ఓ సెలూన్‌లో పని చేస్తున్న వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఓ వ్యక్తి రూ.5వేలు చెల్లిస్తే రూ.10 వేలు వస్తాయని నమ్మబలకడమే కాకుండా తన ఆధార్‌కార్డు చిరునామా ఉందని ఫేసుబుక్‌లో చూయించి నమ్మించి రూ.5వేలు ఫోన్‌పేలో చెల్లించగానే అర గంటకే రూ.10వేలు పంపాడు.

ఖాతా ఖాళీ!

- ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలతో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

- యోనో యాప్‌ అప్‌డేషన్‌, జాబ్‌ ఇప్పిస్తానంటూ, ఆన్‌లైన్‌లో లాటరీ వచ్చిందంటూ రోజుకో సైబర్‌ నేరం బట్టబయలు

- ఆందోళన కలిగిస్తున్న నేరాలు

- అసలు వ్యక్తిపేరు, ప్రొఫైల్‌ ఫొటోతో కొత్త అకౌంట్‌

- మొదట స్నేహితులకు అభ్యర్థనలు

- ఆ తర్వాత నగదు అడుగుతున్న వైనం

- కామారెడ్డిలో ఓ చిరు వ్యాపారి నుంచి రూ.10వేలు

- జిల్లాలో మరో ముగ్గురి వద్ద రూ.40వేల అపహరణ


కామారెడ్డి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ రోడ్డులోని ఓ సెలూన్‌లో పని చేస్తున్న వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఓ వ్యక్తి రూ.5వేలు చెల్లిస్తే రూ.10 వేలు వస్తాయని నమ్మబలకడమే కాకుండా తన ఆధార్‌కార్డు చిరునామా ఉందని ఫేసుబుక్‌లో చూయించి నమ్మించి రూ.5వేలు ఫోన్‌పేలో చెల్లించగానే అర గంటకే రూ.10వేలు పంపాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్‌చేసి మళ్లీ కడితే మళ్లీ డబుల్‌ డబ్బులు వస్తాయని చెప్పడంతో సెలూన్‌లో పనిచేసే యువకుడు మళ్లీ రూ.10 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. రెండు గంటల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో ఆరా తీయగా మోసపోయానని గ్రహించాడు. అదేవిధంగా జిల్లాలోని బీర్కూర్‌కు చెందిన రాజేందర్‌ అనే వ్యక్తికి తన స్నేహితుడి ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేసి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని ఆసుపత్రిలో ఉన్నానని నమ్మించి రూ.30లు, పిట్లంకు చెందిన చంద్రశేఖర్‌కు రూ.30లక్షల లాటరీ ఆన్‌లైన్‌లో కలిగిందని రూ.50వేలు డిపాజిట్‌ చేస్తే రూ.30లక్షలు ఆన్‌లైన్‌ ఖాతాలో జమ చేస్తామని నమ్మబలికి మోసం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి యోనో యాప్‌ అప్‌డేషన్‌ కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు చేస్తే సైబర్‌ నేరగాళ్లు తన నెంబర్‌కు ఓ ఓటీపీ పంపి రూ.30 వేలు కాజేశారు. మరోచోట జాబ్‌ ఇప్పిస్తానంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు చేసి డబ్బులు వసూలు చేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న ఘనులు ఉన్నారు. ఇలా రోజుకోచోట సైబర్‌ నేరాగాళ్ల చేతుల్లో మోసపోతూ ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో, వాట్సప్‌ గ్రూపులో కనిపిస్తున్న సందేశాలు. వారు వీరు అనే తేడా లేదు. అధికారుల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. అయితే ఈ తరహ ఫేస్‌బుక్‌ మెసాలను పరిశీలిస్తే సదరు సైబర్‌ నేరగాళ్లు హ్యాకింగ్‌ చేస్తున్న ప్రొఫైల్స్‌ కలిగిన వ్యక్తులు అంతగా యాక్టివ్‌గా లేనివారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. నెలల తరబడి ఖాతాను యాక్టివ్‌గా లేకుండా ఉన్నవారికి వేతికి మరీ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. సైబర్‌ కేటుగాళ్లు. జిల్లాలో తరచూ సైబర్‌ నేరగాళ్లు జరుగుతుండడం అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. సైబర్‌ నేరాలకై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అన్ని మండలాల్లో అవగాహన కల్పిస్తున్న ప్రజల్లో మాత్రం అవగాహన పెరగడం లేదు.

ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా లేనివారే టార్గెట్‌

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక్క పోస్టు పెడుతూ ఉండే వారి ఖాతాలను సైబర్‌ నేరస్తులు ఎందుకు హ్యాక్‌ చేయడం లేదు. యాక్టివ్‌గా లేని వారి అకౌంట్లనే టార్గెట్‌ చేస్తున్నారంటే యాక్టివ్‌గా ఉండే వ్యక్తులు అయితే తమ స్నేహితులకు ఆ అకౌంట్‌ ద్వారా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అంతేకాదు వారు తమ ప్రొఫైల్‌ ఫొటో ఇతర సమాచారం మారుస్తూ ఉంటారు. తాము పోస్టు చేసే సందేశాలను వారి స్నేహితులకు షేర్‌ చేస్తూ ఉంటారు. అదే యాక్టివ్‌గా లేనివారు అయితే ఎప్పుడో ఒక ప్రొఫైల్‌ ఫొటో పెట్టి వదిలేస్తారు. వారి అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన వారు చూసుకోవడానికి చాలా సమయం పడుతోంది. అందుకే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా లేకపోవడం ఆరు నెలలకో, సంవత్సరానికో ఒక పోస్టుపెట్టడం లాంటివి చేస్తున్న వారి ఖాతాలనే హ్యాకర్లు టార్గెట్‌ చేసి హ్యాకింగ్‌ చేసి అవతలి వ్యక్తులను నగదు అడుగుతుంటారు. అది అసలు వ్యక్తి తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న మోసాల్లో సదరు సైబర్‌ నేరగాళ్లు అకౌంట్ల హ్యాకింగ్‌కు పాల్పడడం లేదు. ఒక అకౌంట్‌ను హ్యాక్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ కావాల్సి వస్తుండడంతో సైబర్‌ నేరగాళ్లు తమ పంతాను మార్చారు. ఆయా వ్యక్తుల పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో బాధితులు ఉంటుండగా అందులో ప్రభుత్వ అధికారులు, ఇతర సిబ్బందితో పాటు ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే వారి ఖాతాలను కూడా హ్యాక్‌ చేయడం గమనార్హం.

అదే పేరు, ప్రొఫైల్‌ ఫొటోతో కొత్త అకౌంట్‌

ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా లేని ఖాతాలను ఎంచుకుంటున్న సైబర్‌ మోసగాళ్లు ఆ ఖాతాలోని ప్రొఫైల్‌ ఫొటో పేరుతో కొత్త ఖాతాలను తెరుస్తున్నారు. ఆ ఖాతా నుంచి అసలు వ్యక్తి ఖాతాలో ఉన్న స్నేహితులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతున్నారు. అలా పదుల సంఖ్యలో స్నేహితుల లిస్టులోకి చేరిన తర్వాత ఇక వారి పని మొదలు పెడుతున్నారు. సదరు నకిలీ ఖాతా నుంచి మేసెజ్‌ ద్వారా చాట్‌ చేసి నగదు అడుగుతున్నారు. ఒకవేళ ఎవరైన అనుమానం వచ్చి ఫోన్‌ నెంబర్‌ అడిగితే తమ నెంబర్‌ పని చేయడం లేదని మరో నెంబర్‌కు ఫోన్‌ చేయాలని చెబుతున్నారు. అలా చేసిన తర్వాత కొందరు అదేమోసం అని తెలుసుకుంటుండగా మరికొందరు మాత్రం నగదు పంపి ఆ తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని అసలు వ్యక్తులకు విషయం చెప్పడంతో వారు అలర్ట్‌ అవుతున్నారు. విషయం తెలిసిన తర్వాత ఆయా వ్యక్తులు తమ అసలు ఫేస్‌బుక్‌లో, వాట్సప్‌లలో, ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందని స్టేటస్‌లు, సందేశాలు పెడుతున్నారు. ఇలా ఇటీవల జిల్లాలో ఫేస్‌బుక్‌ బాధితులు ఎందరో ఉన్నారు. వీరే కాకుండా ప్రస్తుతం డిజిటిల్‌ పేమెంట్లను విరివిగా ఉపయోగిస్తున్న వారు ఎక్కువవుతున్నారు. బ్యాంక్‌లు తమ కస్టమర్ల కోసం యాప్‌లను తయారు చేయడంతో పాటు చెల్లింపులు జరిపే సమయంలో లేదా ఏదైనా అప్‌డేట్స్‌ ఉన్నప్పుడు ఓటీపీలను సంబంధిత నెంబర్లకు మాత్రమే పంపుతోంది. ఎప్పుడైన అప్‌డేషన్‌కు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆన్‌లైన్‌లో ఉండే ఫేక్‌ కస్టమర్‌కేర్‌ నెంబర్‌లకు సదరు వినియోగదారులు ఫోన్‌లు చేయడంతో సైబర్‌ నేరగాళ్లు ఓటీపీని పంపి ఖాతాలోని డబ్బులను కాజేస్తున్నారు. 

అప్రమత్తంగా ఉండాల్సిందే..

తమకు ఫేక్‌ ప్రొఫైల్‌ ద్వారా అభ్యర్థన వచ్చిన లేదా మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నామని తమ ఆధార వివరాలు, పాన్‌కార్డు, బ్యాంక్‌ డెబిట్‌ కార్డు వివరాలను అడిగితే తాము మోసపోతున్నామనే విషయాన్ని గుర్తించాలి. తమకు వచ్చిన అభ్యర్థన నిజమైనదైన లేదంటే సైబర్‌ నేరాగాళ్ల పనేనా అనే విషయం తెలుసుకోవాలి. అవసరమైతే తమ వద్ద గల బ్రాంచ్‌కు వచ్చి వివరాలు చెబుతామని సమాధానం ఇవ్వాలే తప్ప ఎక్కడా కూడా ఓటీపీలు, ఇతర వివరాలు వెల్లడించవద్దు. ఏకధాటిగా ఫోన్‌లు అలానే చేస్తూ విసిగిస్తే సైబర్‌ మెసానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాలి. అదేవిధంగా ఫేస్‌బుక్‌లో తనకు వచ్చిన అభ్యర్థనకు సంబంధించిన ఖాతాను పూర్తిగా పరిశీలించి చూస్తే కేవలం తనకు వచ్చిన అభ్యర్థనలో ఉన్న వ్యక్తి పేరు ప్రొఫైల్‌ ఫొటో మాత్రమే సరిగా ఉంటాయి. మిగిలిన అంశాలన్నీ తప్పులుగానే ఉంటాయి. దానిని గమనిస్తే అది ఫేక్‌ ప్రొఫైల్‌ అని తెలుసుకోవడం చాలా సులభం. ఒకవేళ ఎవరైన యాక్టివ్‌గా లేని వ్యక్తులు తమ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్‌లోని మూడు చుక్కల ఐకాన్‌ఐ క్లిక్‌ చేస్తే నాటు యూ అనే అప్షన్‌ వస్తోంది. తర్వాత సెక్యుర్‌ అకౌంట్‌ అని ఫేస్‌బుక్‌ అడుగుతోంది. అక్కడ మీ అకౌంట్‌ సెక్యూరిటీ ఎంచుకునేందుకు ఆప్షన్స్‌ ఉంటాయి. అనుమానం ఉన్న డివైజ్‌ దగ్గర లాగౌట్‌పై క్లిక్‌ చేయవచ్చు. తర్వాత పాస్‌వర్డ్‌ మార్చుకుంటే సరిపోతోంది. చివరలో లాగౌట్‌ ఆఫ్‌ అల్‌ సెషన్స్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. కాగా ప్రతి ఒక్కరూ తమ సొషల్‌ మీడియా అకౌంట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.


పేటీఎం పేరుతో ఖాతాలోని డబ్బులు మాయం


- రూ. 21వేలు పోగొట్టుకున్న పిట్లం యువకుడు

- పోలీసులను ఆశ్రయించిన యువకుడు

పిట్లం, జనవరి 28: మండల కేంద్రానికి చెందిన రవీగౌడ్‌ సైబర్‌ నేరగాళ్ల మాయలోపడి ఖాతా ఖాళీ చేసుకున్నాడు. రవీగౌడ్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. నాకు పిట్లం ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉంది. అందులో అవసరాల నిమిత్తం రూ. 21,580 జమ చేసుకున్నాను. కాగా ఈ నెల 26వ తేదీన 90102 45042 నెంబర్‌తో నా సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్‌ చేసి మీకు పేటీఎం కార్డు ఉందా అని అడిగారు. లేదు నాకు ఫోన్‌పే ఉందని చెప్పాను. అయితే మీకు మేము ఉచితంగా పేటీఎం కార్డు ఇస్తాం. అయితే మీరు ఒక చిన్న పని చేస్తే చాలు అని మీ ఫోన్‌లోని ఎనీడెస్క్‌ ఓపెన్‌ చేయమని చెప్పగానే చేశాను. పేటీఎంకు, పోన్‌పేకు సీక్రెట్‌ నెంబర్‌ ఒకటే కావాలా.. వేరే కావాలా అని అడుగగా ఒకటే నెంబర్‌ కావాలి అని అన్నాను. నీ పాత పోన్‌పే నెంబర్‌ పాస్‌వర్డ్‌ కొట్టమనగానే నా ఫోన్‌లో కొట్టాను. అంతే కొద్ది క్షణాల్లోనే నీ ఖాతా నుంచి అమౌంట్‌ విత్‌డ్రా అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. అయితే 26 నాడు గణతంత్ర దినోత్సవం కావడంతో బ్యాంకులు బంద్‌ ఉన్నాయి. అయితే మరుసటి రోజు గురువారం వెంటనే బ్యాంక్‌ అధికారులకు విషయాన్ని చెప్పాను. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ తీసుకొని చూడగా ఆన్‌లైన్‌ నెంబరుతో డబ్బులు పోగొట్టుకున్నారని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. నా ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు మాయం చేశారని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాను.

Updated Date - 2022-01-29T05:24:15+05:30 IST