ఒక్కరోజులో ఖాతా ఖాళీ

ABN , First Publish Date - 2022-04-06T06:01:22+05:30 IST

పత్తికొండ మేజరు గ్రామ పంచాయతీ జనాభా 28 వేలు.

ఒక్కరోజులో ఖాతా ఖాళీ

  1. పంచాయతీ నిధులు తీసేసుకున్న ప్రభుత్వం
  2. జీతాలు లేక అర్థాకలితో పారిశుధ్య కార్మికులు
  3. సున్నం, బ్లీచింగ్‌ పౌడరూ కొనలేని దుస్థితి
  4. వీధి దీపం చెడిపోతే కొత్తది వేసేందుకు డబ్బేదీ?
  5. రూ.15 కోట్లకుపైగా ఖజానా నుంచి మాయం
  6. ఆందోళనలకు సిద్ధమవుతున్న సర్పంచులు


  పత్తికొండ మేజరు గ్రామ పంచాయతీ జనాభా 28 వేలు. నివాసాలు 15 వేలు పైనే ఉన్నాయి. పన్నులు, అద్దె రూపంలో ఏటా రూ.1.25 కోట్ల ఆదాయం వస్తుంది. ఇటివల మార్కెట్‌ వేలాలు, పన్నులు రూపంలో వచ్చిన సాధారణ నిధులు మార్చి 31 నాటికి పంచాయతీ ఖాతాలో రూ.2.10 కోట్లు ఉన్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీకి ఆ డబ్బు ప్రభుత్వం తీసేసుకుంది. పారిశుధ్య కార్మికులు 52 మంది ఉన్నారు. వారి జీతాలు, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ వంటి వాటికి ప్రతినెలా రూ.15 లక్షలు చెల్లించాలి. ఖాతా ఖాళీ కావడంతో చెల్లింపుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 


  15వ ఆర్థికసంఘం నిధులు రూ.65వేలు, జనరల్‌ ఫండ్స్‌ రూ.43లక్షలు ఖాతాలో ఉండాలి. ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఒక్కరూపాయి కూడా లేదు. ప్రతినెలా 36 మందికి రూ.2.73 లక్షలు చెల్లించాలి. నంద్యాల తాగునీటి పథకం పైపులైన్లు పగిలిపోయాయి. డబ్బుల్లేక వీటి మరమ్మతులు చేయలేక పోతున్నాము. జీతాలు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. 

-మద్దికెర గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీహరి 


కర్నూలు-ఆంధ్రజ్యోతి: ఏప్రిల్‌ 1వ తేదీ వచ్చేసింది. పారిశుధ్య కార్మికుల జీతాలు, నిర్వహణ ఖర్చులకు డబ్బులు డ్రా చేసేందుకు సర్పంచలు బ్యాంకుల వద్దకు వెళ్లారు. మీ ఖాతాల్లో డబ్బుల్లేవని బ్యాంకర్లు చెప్పడంతో వారు కంగుతిన్నారు. అదేంటి.. నిన్నటి వరకు నిధులు ఉన్నాయి కదాని వారు విస్తుపోయారు. దీంతో వేతనాలు అందక పారిశుధ్య కార్మికులు ఉగాది పండుగ పూట ఇబ్బంది పడాల్సి వచ్చింది. వీధి లైట్లు, సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా కొనలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వమే ఈనిధులను తీసుకుందని తెలుసుకున్న సర్పంచలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.310 కోట్లు ఆపేశారని, తాజాగా పన్నులు, అద్దె రూపాల్లో వసూలు చేసిన సాధారణ నిధులు కూడా ఖాళీ చేయడం ఏమిటని ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. 


ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, పాణ్యం, వెలుగోడు.. వంటి మేజరు పంచాయతీలు 32 ఉన్నాయి. జనాభా నిష్పత్తి ఆధారంగా 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు ఆయా పంచాయతీ ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ నిధులను తాగునీటి సరఫరా, విద్యుత బిల్లుల చెల్లింపు, పారిశుధ్యం, వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. ఉమ్మడి జిల్లాలోనే పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.140 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.170 కోట్లు కలిపి రూ.310 కోట్లు వచ్చాయి. రెండు నెలల క్రితమే ఈ నిధులు ఖాతాల నుంచి మాయం అయ్యాయి. జిల్లా పంచాయతీ అధికారులను అడిగితే విద్యుత బిల్లులు చెల్లించామని పేర్కొనడం కొసమెరుపు. అయితే.. 15వ ఆర్థిక సంఘం నిధులు తిరిగి పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం. 

సాధారణ నిధులూ ఖాళీ

ఆర్థిక సంఘం నిధుల తరువాత పంచాయతీల నిర్వహణకు మిగిలింది సాధారణ (జనరల్‌ ఫండ్‌) నిధులే. ప్రజల నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, అద్దె పన్ను రూపాల్లో వసులు చేసిన డబ్బులు ఇవి. పంచాయతీ జనాభాను బట్టి ఏడాదికి రూ.రెండు మూడు లక్షల నుంచి రూ.1.50 కోట్లకు పైగా వస్తాయి. ఈ డబ్బుతోనే పారిశుధ్య పనులు, వీధి లైట్లు, తాగునీటి సరఫరా వంటి పనులు చేయాలి. మార్చి 31వ తేది నాటికి ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ ఖాతాల్లో రూ.15 కోట్లకు పైగా సాధారణ నిధులు ఉన్నాయి. ఏప్రిల్‌ 1 తర్వాత పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఒక్క రోజులో నిధులు మాయం కావడంపై సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. కొందరు సర్పంచులు అప్పులు చేసి పారిశుధ్య కార్మికుల వేతనాలు ఇవ్వాల్సి వచ్చింది. వేసవిలో తాగునీటి మోటర్లు చెడిపోయి.. పైపులైన మరమ్మతులు చేయాలన్నా నిధుల్లేక అల్లాడాల్సిన పరిస్థితి. 

ఇవీ వాస్తవాలు

  కోడూమూరు మేజర్‌ గ్రామ పంచాయతీ జానాభా 40 వేలు. పారిశుధ్య కార్మికులు 70 మంది ఉన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, అద్దె పన్ను రూపాల్లో ఏటా రూ.1.5 కోట్ల ఆదాయం వస్తుంది. మార్చి 31వ తేది వరకు పంచాయతీ ఖాతాలో రూ.95 లక్షలు ఉంది. ఏప్రిల్‌ 1న ప్రభుత్వం జీరో ఖాతా చేయడంతో పారిశుధ్య కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నెలకు జీతాలు, నిర్వహణ ఖర్చులు దాదాపు రూ.15 లక్షలు చెల్లించాలి. 

- గోనేగండ్ల మేజర్‌ గ్రామ పంచాయతీ జనాభా 22 వేలు. నివాసాలు 6 వేలకు పైగా ఉన్నాయి. ఇంటి, నీటి పన్నులు, మార్కెట్‌ వేలాలు, అద్దెలు తదితర రూపాల్లో రూ.45 లక్షలకు పైగా ఆదాయం ఉంది. పారిశుధ్య కార్మికులు 23 మంది జీతాలు, నిర్వహణ ఖర్చులు నెలకు రూ.5 లక్షలు చెల్లించాలి. ఇప్పటికే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.80 కోట్లు తీసేసుకున్న ప్రభుత్వం.. తాజాగా సాధారణ నిధులు రూ.8లక్షలు తీసుకుని ఖజానా ఖాళీ చేసింది.

-  మద్దికెర మేజర్‌ గ్రామ పంచాయతీలో 25వేల జనాభా ఉంది. ఇంటి, నీటి పన్నులు, అద్దె వసూళ్లు కలిపి రూ.43లక్షలు కనిపించకుండా పోయాయి. పంచాయతీలో పారిశుఽధ్మ కార్మికులు, వాటర్‌మెన్‌ 36మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.2.73లక్షల వేతనాలు చెల్లించాలి. మద్దికెరకు ప్రధానంగా నీరు అందించే నంద్యాల నీటి పథకానికి సంబంధించి పైపులైన్‌లు పగిలిపోయినా డబ్బులు లేకపోవడంతో బాగు చేయలేదు. 

-  ఆలూరు మేజర్‌ గ్రామ పంచాయతీ 14,15 ఆర్థిక సంఘ నిధులు రూ.68 లక్షలు, రూ.38 లక్షలు ప్రభుత్వం ఇప్పటికే తీసేసుకుంది. నాలుగు రోజుల క్రితం సాధారణ నిధులు కూడా రూ.20 లక్షలు రాత్రికి రాత్రే ఖాతాల నుంచి ఖాళీ చేసింది. ప్రతినెలా పంచాయతీలో జీతాల రూపంలో రూ.4.5 లక్షలు, ట్రాక్టర్ల డీజిల్‌ ఖర్చులు రూ.50 వేలు, విద్యుత చార్జీలు రూ.30 వేలకు పైగా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం పంచాయతీ నిధులను తీసేసుకుంటే ఎలా అని సర్పంచ అరుణదేవి అంటున్నారు. 

బ్లీచింగ్‌ కొనాలన్నా డబ్బు లేదు: 

మా పంచాయతీ ఖాతాలో మార్చి 31 వరకు రూ.95 లక్షల వరకు సాధారణ నిధులు ఉన్నాయి. ఏప్రిల్‌ ఒకటి తరువాత ఖాతా ఖాళీగా కనిపిస్తోంది. పారిశుధ్య కార్మికుల జీతాలు, తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతినెలా రూ.15 లక్షలు కావాలి. ఖాతా జీరో కావడంతో బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం కూడా కొనలేని పరిస్థితి. ఇప్పటికే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు తీసేసుకున్న ప్రభుత్వం.. జనరల్‌ ఫండ్‌ను కూడా తీసుకోవడం ఎంత వరకు న్యాయం?

భాగ్యరత్న, సర్పంక్‌, కోడుమూరు మేజరు పంచాయతీ 


వేసవిలో దాహం తీర్చేదెలా?: 

 విద్యుత మోటర్లు, పైపులైన్లు చెడిపోతే మరమ్మతులు చేసేందుకు రూపాయి కూడా లేదు. పంచాయతీ ఖాతాను ప్రభుత్వం ఖాళీ చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.45 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.10 లక్షలు తీసుకుంది. ఏకగ్రీవం ప్రొత్సాహక నిధులు రూ.5 లక్షల్లో 4.45 లక్షలు మార్చి 31న ప్రభుత్వం తీసుకుంది. సాధారణ నిధులు కూడా తీసుకుంటే ఎలా?

రవిమోహన, సర్పంచ, బి.బొంతిరాల పంచాయతీ, కృష్ణగిరి మండలం


ఇదెక్కడి న్యాయం?: 

జనరల్‌ ఫండ్‌ను కూడా ప్రభుత్వం తీసుకోవడం ఎంత వరకు న్యాయం? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మా పంచాయతీ పరిధిలో ఇప్పటికే 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.19 లక్షలు ప్రభుత్వం తీసుకుంది. ఇంటి పన్నులు రూపంలో వసూలు చేసిన రూ.లక్ష కూడా తీసుకుంటే గ్రామాల్లో పనులెలా చేయాలి? వేసవిలో తాగునీటి బోర్లు చెడిపోతే మరమ్మతులకు నిధులు లేవు. సున్నం కూడా కొనలేని పరిస్థితి ఉంది. 

నక్కి లెనినబాబు, సర్పంచ, కటారుకొండ పంచాయతీ, కృష్ణగిరి మండలం  


  

Updated Date - 2022-04-06T06:01:22+05:30 IST