Abn logo
Apr 9 2020 @ 05:19AM

మళ్లీ అదే నిర్లక్ష్యం

జిల్లా ఆస్పత్రిలో మారని అధికారుల తీరు

హిందూపురం ఘటన జరిగినా అదే వైఖరి

మానిరేవు వృద్ధుడి మృతి విషయంలోనూ డ్రామానే

జిల్లాలో పడగ విప్పుతున్న కరోనా 

పర్యవేక్షణ అధికారుల తీరుపై పెదవి విరుపు


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 8 : జిల్లా సర్వజనాస్పత్రిలో పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ తప్పుల మీద తప్పులు చేస్తూ అందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా అనుమానిత కేసు వస్తే ప్రత్యేక నిఘా ఉంచి వైద్య సేవలందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులకు ఎలా వైద్యసేవలందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంలో నిబంధనలు కూడా విడుదల చేశాయి. కానీ ఇక్కడ ఆ నిబంధనలు పాటించకపోవడం వల్ల వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. నాలుగు రోజుల కిందట జిల్లా ఆస్పత్రిలో కరోనాతో మరణించిన హిందూపురం వృద్ధుడి వ్యవహారమే ఇందుకు మంచి ఉదాహరణ. ఈ వృద్ధుడు మార్చి 31వ తేదీన జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు వెంటనే కరోనా వైద్యపరీక్షలు చేయాల్సిన అవస రం ఉంది. కానీ సాధారణ అనుమానితుడిగానే 1వ తేదీ రాత్రి వరకూ ఐసోలేషన్‌లో ఉంచుకున్నారు. ఆ తరువాత ఆ వృద్ధుడి పరిస్థితి విషమించడంతో రాత్రికి రాత్రే ట్రామా సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఐసీయూకు తరలించారు.


అప్పుడు కూడా వెంటనే కరోనా శాంపిళ్లు తీసి వ్యాధి నిర్ధారణకు పంపలేదు. 2వ తేదీ మధ్యాహ్నం శాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపించారు. 3వ తేదీ రాత్రి ఆ వృద్ధుడికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ అధికారికంగా వెల్లడించలేదు. 4వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో ఆ వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. అప్పటికి కూడా ఆ వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయిందని బయటకు పొక్కనీయలేదు. ఆ వృద్ధుడి కుటుంబసభ్యులను పిలిపించుకుని శవాన్ని అప్పగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు పత్రికల్లో కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో హిందూపురానికి చెందిన వృద్ధుడు కరోనాతోనే చనిపోయాడని రెండ్రోజుల తరువాత అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.


సాధారణ కరోనా అనుమానితుడిగానే గుర్తించి తొలుత రెండ్రోజులు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్‌లు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగానే ఆ వృద్ధుడికి వైద్యసేవలందించినట్లు తెలిసింది. దీంతో అనేక మంది ఆ వృద్ధుడు చనిపోయిన తరువాత తమకు కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఆవే దన చెందుతూ వచ్చారు. అప్పుడు కూడా పర్యవేక్షణ అదికారులు పెద్దగా పట్టించు కోలేదు.  అధికారుల వ్యవహార శైలిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితం కావడం తో స్పందించి ఆ వృద్ధుడి వైద్యసేవల్లో పాల్గొన్న 22 మందికి శాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపించారు.


అందులో బుధవారం నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇదిలా ఉండగా కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన 74 సం వత్సరాల వృద్ధుడు ఆస్పత్రిలో వేరే రోగానికి చికిత్స పొందుతుండేవాడు. ఆ వృద్ఢుడికి పలువురు వైద్యులు, సిబ్బంది వైద్యసేవలందిస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో కరోనా ఐసీయూ విభాగానికి తరలించినట్లు తెలిసింది. అక్కడ కూడా రెండ్రోజుల పాటు వైద్యులు, సిబ్బంది ఆ వృద్ధుడికి వైద్య చికిత్సలు అందించారు. అప్పటికే ఆ ఐసీయూ విభాగంలో హిందూపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు మృతి చెంది ఉండటంతో మానిరేవు గ్రామానికి చెందిన వృద్ధుడికి కరోనా సోకినట్లు చర్చలు విని పిస్తున్నాయి. ఆ వ్యాధితోనే పరిస్థితి విషమించి మానిరేవు వృద్ధుడు మరణించినట్లు ఆస్పత్రిలో తీవ్ర చర్చ సాగుతోంది.


ఇక్కడ కూడా ఆస్పత్రి పర్యవేక్షణ అధికారులు హైడ్రామా సాగించారు. ఆ వృద్ధుడి మరణంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా.... సాధారణంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వృద్ధుడికి కరోనా ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధారణ అయింది. ఇక్కడ కూడా అధికారులు నిబంధనలు పాటించకుండా మామూలుగానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ గ్రా మంలో ఆ వృద్ధుడి కుటుంబసభ్యులు, బంధువులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఆ వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కరోనా నిర్ధారణ కావడంతో ఇటు అధికారులు, అటు ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు, బంధువులు టెన్షన్‌ పడుతున్నారు. ఆ వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని గుర్తించి ఐసొలేషన్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.


దీనంతటికి కారణం ఆస్పత్రి అధికారులేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వృద్ధుడుకి శాంపిళ్లు తీసిన తరువాత ఫలితాలు చూసి శవాన్ని అప్ప గించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రి సమీపంలోనే వైద్య కళాశాలలో కరోనా నిర్ధారణ ల్యాబ్‌ ఉంది. 4 గంటల్లో ఆ వ్యక్తికి కరోనా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తారు. కానీ ఇక్కడి అధికారులు కరోనా విషయంలో ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో ఈ రెండు కరోనా మృతులను బట్టే అర్థమవుతోంది. 

Advertisement
Advertisement
Advertisement