నాలా నోళ్లు మూసేదెన్నడో ?

ABN , First Publish Date - 2020-09-22T07:24:29+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉంది.

నాలా నోళ్లు మూసేదెన్నడో ?

మింగేస్తున్న ఓపెన్‌ నాలాలు

పైకప్పులు లేనివి ఎన్నో 

రిటైనింగ్‌ వాల్‌ ్స కూడా లేవు

పలుచోట్ల ఫెన్సింగ్‌లు సైతం కరువు

ఏటా పెరుగుతున్న ప్రమాదాలు


మహా నగరంలో ఐదారు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు.. మనుషులను నెట్టుకెళ్లే స్థాయిలో కాలనీలు, వీధుల్లో వరద ప్రవహిస్తోంది. ఆ వరద నోళ్లు తెరుచుకున్న ఓపెన్‌ నాలాల్లోకో, చెరువులు, కుంటల్లోకో తోసుకెళ్తోంది. ప్రధాన రహదారుల్లో మినహా ఎక్కడా సక్రమంగా వర్షపు నీటి డ్రెయిన్లు లేవు. సరైన నాలాలు లేవు. ఉన్న నాలాలను ఎక్కడికక్కడే కబ్జాలు చేసి భారీ భవంతులను నిర్మించడంతో వరద నీరంతా రోడ్లపైనే పరుగులు తీస్తోంది. చాలాచోట్ల నాలాలు ఓపెన్‌గానే ఉన్నాయి. అదే ప్రమాదాలకు కారణమవుతోంది.


హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉంది. కానీ ఏ సమయంలో వర్షం కురిసినా కనీసం ఐదు సెంటీమీటర్లకు తగ్గకుండా వర్షపాతం నమోదవుతోంది. పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిన సమయంలో ఇక అంతేసంగతులు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. 2000 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిర్లోస్కర్‌ కమిటీ నాలాల కబ్జాలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని పలు సూచనలు చేసింది. ఆ తర్వాత అనేకసార్లు నాలాలు పొంగిపొర్లి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. కానీ నాలాల విస్తరణ జరగలేదు. ఓపెన్‌ నాలాలను మూసేయలేదు. రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం చేపట్టలేదు. 


వివిధ ప్రాంతాల్లో ఇలా..

  • ఫతేనగర్‌డివిజన్‌ పరిధి జింకల వాడ, కార్మికనగర్‌ మధ్యలో ఉన్న నాలా ప్రమాద భరితంగా ఉంది.. రిటైనింగ్‌ వాల్‌ లేదు. వాహనదారులు అదుపు తప్పి నాలాలో పడి గాయాలపాలైన సందర్భాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం జింకల వాడ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం వెళ్ళి కాలు జారి నాలాలో పడి ప్రాణాలు విడిచాడు. 
  • అల్వాల్‌ లోని సిటిజన్స్‌ కాలనీ, రెడ్డి ఎన్‌క్లేవ్‌ - శ్రీబేకరి, భారతీనగర్‌, హరిజన బస్తీ, సాయినగర్‌ కాలనీలోని నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిపై పై కప్పులు ఏర్పాటు చేయాలి. పశువులు, మందుబాబులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
  • వినాయక్‌నగర్‌ డివిజన్‌ కాకతీయనగర్‌లో ఉన్న ఓపెన్‌ నాలాలో పడి పదేళ్ళ క్రితం ముక్కంటచారి అనే కార్పెంటర్‌ మృతి చెందాడు. అప్పటి నుంచీ ఓపెన్‌ నాలాపై మూతలు బిగించాలని కాలనీవాసులు అధికారులను కోరుతూనే ఉన్నారు. అయినా ఫలితం శూన్యం. 
  • పాతబస్తీ ఛత్రినాక చౌరస్తాలోని మ్యాన్‌హోల్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. 
  • పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే ఉప్పర్‌పల్లి 191 పిల్లర్‌ వద్ద వర్షం పడినప్పుడల్లా నీరు చేరి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాంద్రాయణగుట్ట బ్రిడ్జి దిగిన తర్వాత బండ్లగూడ వెళ్లే మార్గంలో రోడ్డుపై మోకాళ్ళ లోతు వర్షం నీరు వచ్చి చేరుతోంది.


ప్రమాదాలు

  • 2020 సెప్టెంబర్‌ 17: నేరేడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో ఓపెన్‌ నాలాలో పడి చిన్నారి సుమేధ మృతి చెందింది. 
  • 2019 సెప్టెంబర్‌ 24: యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జీ బ్లాక్‌పల్లికి చెందిన బెంగళూరు ప్రేమ్‌కుమార్‌(43) తన బంధువుతో అలకాపురికి చేరుకోగా భారీ వర్షం కురుస్తుండడంతో ఇద్దరూ సమీపంలోని ఓ బార్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్రేమ్‌కుమార్‌ పక్కనే ఉన్న నాలాలో జారి పడిపోయి వరదనీటికి కొట్టుకుపోయాడు. 
  • 2016 సెప్టెంబర్‌ 14 : చైతన్యపురి పరిధి ఫణిగిరి కాలనీలో ఉండే హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ రాచర్ల క్రాంతికుమార్‌ (27) తన స్నేహితుడితో కలిసి నాగోల్‌ రత్నా బార్‌లో మద్యం తాగి రాత్రి 10.30 గంటలకు బయటకు వచ్చారు. బైకు తీస్తానని క్రాంతికుమార్‌ ముందుకు అడుగేసి పైకప్పులేని నాలాలో పడిపోయి, గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ మిస్టరీగానే ఉంది. 
  • రేతిబౌలి బస్టాండ్‌కు సమీపంలో గర్భవతిగా ఉన్న ఓ మహిళ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తూ ఓపెన్‌ నాలాలో పడి మృతి చెందారు.

Updated Date - 2020-09-22T07:24:29+05:30 IST