Abn logo
Oct 28 2021 @ 23:04PM

రెండు బైకుల ఢీ.. ఒకరి మృతి

వెంకటేశ్వర్లు మృతదేహం

కొమరోలు, అక్టోబరు 28 : రెండు మోటర్‌ సైకిళ్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని అల్లినగరం గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని అల్లీనగరం గ్రామానికి చెందిన కత్తిరగండ్ల వెంకటేశ్వర్లు(65) పనిమీద కొమరోలు వచ్చి తిరిగి వెళ్తుండగా సొంతూరు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో మోటర్‌ సైకిల్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని కొమరోలు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సాంబశివయ్య సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

కొనకనమిట్ల, అక్టోబరు 28 : మండలంలోని పెదారికట్ల సమీపంలోని కొండ వద్ద 565 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్లు(28) వ్యక్తి మృతి చెందాడు. అందిన వివరాల ప్రకారం... కనిగిరి బీసీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైక్‌పై పెదారికట్ల నుంచి సొంతూరు వెళ్తూ కొండ సమీపంలో రోడ్డు మార్జిన్‌లో ఏర్పాటు చేసిన డివైడర్‌ రేకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లుకు భార్య, కుమారుడు ఉన్నాడు. ఘటన వివరాలు పూర్తిగా తెలియలేదని ఎస్‌ఐ శివ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


యువకుడి ఆత్మహత్య

బేస్తవారపేట, అక్టోబరు 28 : మండలంలోని ఓందుట్ల గ్రామంలోని పొలాల్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓందుట్ల గ్రామానికి చెందిన సాల్వ ఆంజనేయులు (28) సూరం ఈశ్వరరెడ్డికి చెందిన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు భార్య అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సారాకు బానిసై ఇటీవల మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని, ఆరోగ్యం కూడా సక్రమంగా లేదని ఆ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిఉంటాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

ముండ్లమూరు, అక్టోబరు 28 : మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామానికి చెందిన చింతలపూడి వెంకటేశ్వర్లు(25) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తమ్మలూరు సమీపంలో వెంకటేశ్వర్లు, తమ్మలూరుకు చెందిన మరో ద్విచక్ర వాహనదారుడు ఎదురెదురుగా ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లను గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి.