నిర్లక్ష్యంతో ప్రమాదం

ABN , First Publish Date - 2021-07-21T05:21:45+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టలేదు.

నిర్లక్ష్యంతో ప్రమాదం
కడప పెద్దమార్కెట్‌లో జనం

 కరోనా మూడో వేవ్‌పై హెచ్చరిస్తున్న నిపుణులు

 కనిపించని భౌతిక దూరం

 సరిహద్దు జిల్లాల్లో భారీగా తగ్గిన కేసులు


కడప, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఓ పక్క థర్డ్‌వేవ్‌పై నిపుణులు హెచ్చరిస్తుండడం, మరో పక్క పాజిటివ్‌ కేసుల నమోదులో హెచ్చుత గ్గులు ఆందోళన కలిగిస్తోంది. పగటిపూట కర్ఫ్యూ సడలించిన తరువాత జనంలో కూడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్కెట్‌, షాపింగ్‌కాంప్లెక్స్‌, సూపర్‌ మార్కెట్లలో భౌతిక దూరం పాటించకపోవడం, రాజకీయ సభలకు పెద్దఎత్తున హాజరవుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు. ఒకప్పుడు అనంతపురం, కర్నూలు జిల్లాల కంటే మన జిల్లాలో తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. అక్కడ రోజూ 2వేల మార్కు దాటితే మన వద్ద 1500లోపే నమోదయ్యేవి. అయితే ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మన వద్ద మాత్రం కేసుల సంఖ్య అదుపు కాకపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.


పొంచి ఉన్న థర్డ్‌వేవ్‌ ముప్పు

జిల్లాలో సెకండ్‌వేవ్‌ ఎందరినో బలి తీసుకుంది. మహమ్మారి బారిన పడి మరెందరో ఆర్థికంగా చితికిపోయారు. వైద్యం కోసం కొందరు అప్పులు చేస్తే మరికొందరు ఇంటిస్థలాలు, పొలాలు తాకట్టు పెట్టి కరోనా నుంచి కోలుకున్నారు. సెకండ్‌వేవ్‌ తీవ్రత కళ్లెదుటే కనిపించినా చాలా మందిలో ఇప్పటికీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కడపలో అయితే పాత మార్కెట్‌, రైతుబజారు, మిగతా షాపింగ్‌మాల్స్‌లో జనం గుంపులుగా ఉండి భౌతిక దూరం పాటించడంలేదు. అలాగే టీ దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లలో కూడా జనం నిర్లక్ష్యంగా గుమికూడుతున్నారు. కొందరు మాస్కులు పెట్టుకున్నా కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదు. అధికార యంత్రాంగం కూడా కొవిడ్‌ నిబంధనలు నిక్కచ్చిగా పాటించేలా చూడ్డంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు విమర్శలున్నాయి.


తగ్గని కరోనా కేసులు

అనంతపురం, కర్నూలుతో పోలిస్తే మన జిల్లాలో పాజిటివ్‌ కేసులు అదుపులోకి రాలేదని చెప్పవచ్చు. గత పదిరోజుల్లో అక్కడ నమోదైన కేసులు, మన వాటిని పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. కర్నూలులో ఈ నెల 11 నుంచి 20 వరకు 332 పాజిటివ్‌ కేసులు, అనంతపురంలో 705, మన జిల్లాలో 1226 కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్‌ కేసులు చూస్తే మన జిల్లాలో 1841, కర్నూలు 262, అనంతపురంలో 478 కేసులు ఉన్నాయి.


గత పదిరోజుల గణాంకాలు చూస్తే..

--------------------------------------

తేది కడప కర్నూలు అనంతపురం

-----------------------------------------------

11న 161 33 106

12న 117 35 37

13న 75 18 81

14న 217 29 69

15న 157 35 80

16న 84 29 52

18న 149 21 73

19న 106 65 98 

20న 92 43 36

------------------------------------------------


21 మండలాల్లో డేంజర్‌లో పాజిటివ్‌ రేటు

జిల్లా వ్యాప్తంగా మంగళవారం సరాసరి కరోనా పాజిటివ్‌ శాతం 1.5 గా నమోదైంది. అయితే 21 మండలాల్లో మాత్రం పాజిటివ్‌ రేటు 7.14 నుంచి 2లోపు నమోదై కరోనా తీవ్రతను తెలియజేస్తోంది.

--------------------------------------------------------

మండలం టెస్టులు కేసులు శాతం

---------------------------------------------------------

పెనగలూరు 56 4 7.14

యర్రగుంట్ల 57 3 5.66

చింతకొమ్మదిన్నె 18 1 5.56

ఓబులవారిపల్లె 112 6 5.36

బద్వేలు 21 1 4.76

రాజంపేట 85 4 4.75

లక్కిరెడ్డిపల్లె 89 4 4.49

ఒంటిమిట్ట 90 4 4.40

మైదుకూరు 29 1 3.45

నందలూరు 90 3 3.33

రామాపురం 65 2 3.08

కోడూరు 103 3 2.97

వేంపల్లె 104 3 2.88

సుండుపల్లె 110 3 2.73

పుల్లంపేట 74 2 2.7

జమ్మలమడుగు 97 2 2.06

గోపవరం 49 1 2.04

 



Updated Date - 2021-07-21T05:21:45+05:30 IST