లారీ చక్రం ఊడిపడి స్కూటరిస్టు మృతి

ABN , First Publish Date - 2021-10-20T06:15:55+05:30 IST

రోడ్డుపై వెళ్తున్న లారీ చక్రం ఊడి డివైడర్‌ మీదుగా దూసుకెళ్లి అవతల రోడ్డుపై వెళ్తున్న స్కూటీపై పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై చోటుచేసుకుంది.

లారీ చక్రం ఊడిపడి స్కూటరిస్టు మృతి

ఉంగుటూరు, అక్టోబరు 19 : రోడ్డుపై వెళ్తున్న లారీ చక్రం ఊడి డివైడర్‌ మీదుగా దూసుకెళ్లి అవతల రోడ్డుపై వెళ్తున్న స్కూటీపై పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం రాత్రి చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఆత్కూరు ఇన్‌చార్జి ఎస్సై ఫ్రాన్సిస్‌ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వడ్లమూడి రాంబాబు (33) ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లోని అతుల్‌ నిషార్‌ ఫౌండేషన్‌లో కంప్యూటర్‌ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య, మూడు, ఏడాది వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో అద్దె ఇంట్లో నివాసముంటూ ఎప్పటిలాగే సాయంత్రం 5గంటలకు విధులు ముగించుకుని ఆత్కూరు నుంచి జంక్షన్‌ వైపు స్కూటీపై ఇంటికి వెళ్తుండగా తేలప్రోలు ఉషారామా కాలేజీ సమీపంలో ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ టైరు హఠాత్తుగా ఊడి వేగంగా డివైడర్‌ మీదుగా దూసుకొచ్చి రాంబాబు స్కూటీని ఢీకొట్టింది. దీంతో రాంబాబు ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇన్‌చార్జి ఎస్సై ఫ్రాన్సిస్‌ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు మృతిచెందినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-20T06:15:55+05:30 IST