రాఖీ కట్టేందుకు వెళుతుండగా...

ABN , First Publish Date - 2022-08-12T06:34:08+05:30 IST

ఇసుక లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని సోదరులకు రాఖీలు కట్టడానికి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పుట్టింటికి వెళుతుండగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ బలంగా ఢీకొంది.

రాఖీ కట్టేందుకు వెళుతుండగా...

లారీ రూపంలో కబళించిన మృత్యువు

బైక్‌ను ఢీకొన్న ఇసుక లారీ

తల్లి, కుమారుడు దుర్మరణం

చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్‌ వద్ద ఘటన


చోడవరం/సబ్బవరం, ఆగస్టు 11: ఇసుక లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని సోదరులకు రాఖీలు కట్టడానికి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పుట్టింటికి వెళుతుండగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ బలంగా ఢీకొంది. దీంతో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్‌ వద్ద సమీపంలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ విభీషణరావు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలు...

సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెదయాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (36) రాఖీ పండుగ సందర్భంగా మునగపాకలోని తన సోదరులకు రాఖీలు కట్టాలని భావించారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు కుమారుడు సుకేశ్‌రామ్‌ (19)తో కలిసి బైక్‌పై బయలుదేరారు. వీరి వాహనాన్ని చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొని, రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న సుకేశ్‌రామ్‌, వెనుక కూర్చున్న సత్యవతి దూరంగా తుళ్లిపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎస్‌ఐ విభీషణరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా రోడ్డుకు కుడివైపునకు రావడంతో ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న పెదయాతపాలెం గ్రామస్థులు, మునగపాక నుంచి బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి సత్యవతి భర్త రాంబాబు, కుమార్తె కుందన, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సుకేశ్‌రామ్‌ ఇంటర్‌ పూర్తిచేసి, ఇంజనీరింగ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు బంధువులు తెలిపారు. కాగా మృతదేహాలను చోడవరం సీహెచ్‌సీ మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కాగా మధ్యాహ్నం తరువాత మృతదేహాలను గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2022-08-12T06:34:08+05:30 IST