ఇంటిబిడ్డ వేడుక కోసం వెళ్తూ.. అనంతలోకాలకు..

ABN , First Publish Date - 2022-05-27T06:28:51+05:30 IST

ఇంటి ఆడబిడ్డ పెళ్లై నోముల వేడుకకు అంతా సిద్ధమయ్యారు.

ఇంటిబిడ్డ వేడుక కోసం వెళ్తూ.. అనంతలోకాలకు..

  ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద రెండు కార్లు ఢీ 

  కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి  చెందిన తల్లీకొడుకు దుర్మరణం

  మరో నలుగురికి గాయాలు 

ఇంటి ఆడబిడ్డ పెళ్లై నోముల వేడుకకు అంతా సిద్ధమయ్యారు. జరగబోయే శుభకార్యం ముచ్చట్లు కార్లో  చెప్పుకుంటూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన మరో మృత్యుకారు ధడేల్‌మని ఢీకొంది. కళ్లు తెరిచేలోపు తలోదిక్కున పడి ఉన్నారు. ప్రమాదంలో తల్లీకొడుకు తీవ్రగాయాలపాలై మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ దారుణం ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద గురువారం జరిగింది. మృతులిద్దరూ కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురానికి చెందినవారు. 

 సత్తుపల్లి, మే 26 : పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురానికి చెందిన వడాలి రంగరాజు (50), రమ దంపతుల కుమార్తెకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన వ్యక్తితో ఇటీవల వివాహం జరిగింది. సత్తుపల్లిలోని జరిగే నోములకోసం రంగరాజు తన తల్లి వడాలి భానుమతి (65), బంధువు దేవునికొండ నాగమణితోపాటు వారి ఇంటిపక్కన డ్రైవర్‌ కొల్లిపర సాంబశివరావుతో కలిసి కారులో బయల్దేరారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న వేంసూరు మండలం వెంకటాపురానికి చెందిన ఓ అధ్యాపకుడి ఇంట్లో శుభకార్యానికి తోటి అధ్యాపకులైన ప్రిన్సిపాల్‌ బీ.భాగ్యలక్ష్మి, విశ్వేశ్వరరావు, బీ.రఘునందన్‌రావు, కల్పన, జమీనాలు ఓ కారులో సత్తుపల్లి నుంచి బయలుదేరారు. ఈ కారు స్థానిక వేంసూర్‌ రోడ్డులోని సింగరేణి మైన్‌ వద్దకు చేరిన క్రమంలో లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా కలిపలేశ్వరం నుంచి వస్తున్న కారు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వడాలి భానుమతి, రంగరాజు, డ్రైవర్‌ కొల్లిపర సాంబశివరావు, వరంగల్‌కు చెందిన లెక్చరర్‌ రఘునందన్‌, సత్తుపల్లికి చెందిన విశ్వేశ్వరరావు, కల్పన తీవ్రంగా గాయపడ్డారు. వారిని సత్తుపల్లిలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ భానుమతి, రంగరాజులకు ప్రథమి చికిత్స నిర్వహించి విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. రఘునందన్‌రావు, కల్పనలను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. సత్తుపల్లి ఎస్‌ఐ ఎస్‌కే.షాకీర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.  

క్షతగాత్రులను తరలించిన మాజీమంత్రి తుమ్మల

ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఓ శుభకార్యానికి వెళ్తున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాద విషయాన్ని తెలుసుకొని అక్కడ ఆగారు. వెంటనే క్షతగాత్రులను అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించడానికి సహకరించారు. వాహనదారులను అప్రమత్తం చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయించారు. 


Updated Date - 2022-05-27T06:28:51+05:30 IST