విద్యుదాఘాతంతో మెడికల్‌షాపు దగ్ధం

ABN , First Publish Date - 2022-08-09T04:20:53+05:30 IST

విద్యుదాఘాతంలో కల్లూరులోని అంబేద్కర్‌ సెంటర్‌లో సోమవారం సౌమ్య మెడికల్‌ షాప్‌ దగ్ధమైంది. రూ. కోటి ఆస్తినష్టం వాటిల్లింది.

విద్యుదాఘాతంతో మెడికల్‌షాపు దగ్ధం
మెడికల్‌ షాపు నుంచి వస్తున్న పొగలు

ఖరీదైన మందులు, సామగ్రి బూడిదపాలు

రూ. కోటి ఆస్తినష్టం

కల్లూరు, ఆగష్టు 8: విద్యుదాఘాతంలో కల్లూరులోని అంబేద్కర్‌ సెంటర్‌లో సోమవారం సౌమ్య మెడికల్‌ షాప్‌ దగ్ధమైంది. రూ. కోటి ఆస్తినష్టం వాటిల్లింది. ఇందుకు సంబంఽధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ బస్వీరెడ్డి అనే వ్యక్తి కల్లూరులో సౌమ్య మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి పది గంటలకు షాపు మూసి ఇంటికెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గుమాస్తా షాపు షట్టర్లు తీయగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. మంటలు ఇతర షాపులకు వ్యాపిస్తుండటంతో అతడికి భయం వేసి బస్విరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆయన పోలీసులకు, అగ్నిమాపక దళం వారికి సమాచారం అందించారు. అప్పటికే విద్యుదాఘాతం జరగడంతో షాపులో ఉన్న మందులు, ఏసీ, ఇతర సామగ్రి, ఫ్రిజ్‌, విలువైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి కాలిపోయింది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీపీ ఎన్‌ వెంకటేష్‌ ఎస్‌ఐ కె వెంకటేష్‌లు సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా బాధితుడు బస్విరెడ్డిని పలువురు పరామర్శించారు.

Updated Date - 2022-08-09T04:20:53+05:30 IST