స్నేహితుడి పెళ్లికి వెళ్లి.. బైక్ పై తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. చివరకు..

ABN , First Publish Date - 2020-08-11T16:04:51+05:30 IST

చిన్ననాటి స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గౌలిపుర మేకలమండికి చెందిన సాయికుమార్‌, కందికల్‌గేట్

స్నేహితుడి పెళ్లికి వెళ్లి.. బైక్ పై తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. చివరకు..


పహడీషరీఫ్/చాంద్రాయణగుట్ట/హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): చిన్ననాటి స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గౌలిపుర మేకలమండికి చెందిన సాయికుమార్‌, కందికల్‌గేట్‌ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ల చిన్ననాటి స్నేహితుడి వివాహం ఆదివారం షాద్‌నగర్‌లో జరిగింది. ఈ పెళ్లికి సాయికిరణ్‌కు చెందిన ద్విచక్ర వాహనం (టీఎస్‌12 ఈజే-6760)పై ఇద్దరూ కలసి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో దగ్గరగా ఉంటుందని ఎయిర్‌పోర్టు మార్గంలో వచ్చి పహాడీషరీఫ్‌ మీదుగా పాతబస్తీకి రావాలనుకున్నారు. ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది. వారి వాహనం పహాడీషరీప్‌ పోలీస్ స్టేషన్‌ సమీపంలో స్టాపర్స్‌ను దాటి ముందుకు వెళ్లి అదుపు తప్పింది. దీంతో ముందుగా వెళ్తున్న ఏపీ 12 టీ6372 నెంబర్‌ లారీకి తగిలి కింద పడిపోయారు. ఆ లారీ వారిపై నుంచి వెళ్లగా, ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం అంత్యక్రియలు జరిగాయి. 


పిల్లలు లేకపోవడంతో.. 

గౌలిపుర మేకలమండికి చెందిన ఆనంద్‌కు పిల్లలు లేరు. దీంతో తమ్ముడి కుమారుడైన సాయికిరణ్‌ను పెంచుకున్నారు. ఆనంద్‌ కూడా గతంలో చనిపోగా, సాయికిరణ్‌ పెంచిన తల్లి సంధ్యరాణితో కలసి ఉంటున్నాడు. స్థానిక విజ్ఞాన్‌ మోడల్‌స్కూల్‌లో చదువుకున్న సాయుకిరణ్‌ ప్రస్తుతం కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి సచివాలయంలో తాత్కాలిక ఉద్యోగిని. తనకు దిక్కుగా ఉన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 


ఒక్కగానొక్క కుమారుడు..

కందికల్‌గేట్‌ ప్రాంతానికి చెందిన నాగేశ్‌చారికి కూతురు పుట్టిన తర్వాత శశికాంత్‌ అలియాస్‌ నాని జన్మించాడు. ఇంటర్‌ వరకు చదువుకున్న శశికాంత్‌ ఫొటో ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంటున్నాడు. తమకు ఆధారమై అండగా ఉంటాడని భావించిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated Date - 2020-08-11T16:04:51+05:30 IST