డైస్పీడ్‌..!

ABN , First Publish Date - 2022-05-25T06:12:43+05:30 IST

అతివేగం ప్రాణాలను బలిగొంటోంది. మద్యం మత్తు చిత్తు చేస్తోంది. రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన కుటుంబాల్లో కన్నీళ్లు నింపుతోంది.

డైస్పీడ్‌..!

కుటుంబికుల్లో అంతులేని శోకం

నిత్యం రోడ్డు ప్రమాదాలు

ఐదు నెలల్లో 56 మంది మృతి

130మందికిపైగా గాయాలు



హిందూపురం టౌన 

అతివేగం ప్రాణాలను బలిగొంటోంది. మద్యం మత్తు చిత్తు చేస్తోంది. రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన కుటుంబాల్లో కన్నీళ్లు నింపుతోంది. ఎంత హైస్పీడ్‌తో వెళితే అంతే వేగంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుటుంబాల్లో ఆరని శోకం నింపుతున్నారు. రోడ్డు ప్రమాదాలు నిత్యం ఏదోఒకచోట జరుగుతూనే ఉన్నాయి. పెనుకొండ సబ్‌డివిజన పరిధిలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పోలీసు లెక్కల మేరకు 56 మంది మృతిచెందగా.. 130 మందికిపైగా గాయపడ్డారు.


జాతీయ రహదారిలోనే అధికం

పెనుకొండ సబ్‌డివిజన పరిధిలో ఎక్కువగా 44వ జాతీయ రహదారిలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చిలమత్తూరు మండలం కోడూరుతోపు, గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్‌, సోమందేపల్లి వైజంక్షన, పెనుకొండ సమీపంలోని గోనిపేట, కియ, సర్కిల్‌ బ్లాక్‌స్పాట్లుగా మారాయి. ఐదు నెలల వ్యవధిలో జాతీయ రహదారిపై ప్రమాదాల్లో 13 మంది మృతిచెందగా.. 40మందికిపైగా గాయపడ్డారు. హిందూపురం పరిధిలో తూమకుంట చెక్‌పోస్టుకు వెళ్లే రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది. సింగిల్‌ రోడ్డు కావడంతో ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఈ రహదారిలో ఎక్కువగా ప్రమాదాలకు కారణం అవుతున్నట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి.


రోడ్డున పడుతున్న కుటుంబాలు 

అతివేగం, ఏమరపాటు, మద్యం మత్తు కారణం ఏదైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. నమ్ముకున్నవారిని కష్టాలపాటు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు.


నిబంధనలు పాటించకనే..

ద్విచక్రవాహన ప్రమాదాలే అధికంగా జరుగుతున్నాయి. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం, సెల్‌ఫోన మాట్లాడడం, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపినపుడే 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు అధిక వేగంతో వెళ్లడం కూడా కారణమే అంటున్నారు.


అవగాహన కల్పిస్తున్నాం..

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలు పాటించాలని జరిమానా కూడా విధిస్తున్నాం. అయినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యువత ముఖ్యంగా వేగంకన్నా వారి ప్రాణం ముఖ్యమని భావించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇచ్చినపుడు, బయటకు వెళ్లినపుడు జాగ్రత్తలు, భయం చెప్పాలి.

- హమీద్‌ఖాన, రూరల్‌ సీఐ

Updated Date - 2022-05-25T06:12:43+05:30 IST