లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

ABN , First Publish Date - 2022-05-25T06:11:02+05:30 IST

మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు సమీపాన 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని వెనుక వైపు నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం చెందగా.. 8 మంది గాయపడ్డారు.

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

డ్రైవర్‌ మృతి.. 8 మందికి గాయాలు

చిలమత్తూరు, మే 24:

మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు సమీపాన 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని వెనుక వైపు నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో డ్రైవర్‌ దుర్మరణం చెందగా.. 8 మంది గాయపడ్డారు. తాడిపత్రి నుంచి బెంగళూరుకు సిమెంటుతో వెళుతున్న లారీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో  కోడూరు చెరువు కట్ట కాలువ వద్దకు రాగానే ఆగిపోయింది. ఈ  రహదారిలోనే రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న గ్రీనలైన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో  రోడ్డుపై ఆగి ఉన్న సిమెంటు లారీని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌ జియావుల్లా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ సీటు వెనుక భాగంలో కూర్చున్న ఒకే కుటుంబానికి చెందిన  వెంకటకృష్ణారెడ్డి, లతారెడ్డి, కుశలేశ్వర్‌, దివ్య గాయపడ్డారు. వీరు బెంగళూరు వెళ్లేందుకు ఆదోనిలో బస్సు ఎక్కినట్లు సమాచారం. వీరితోపాటు బెంగళూరుకు చెందిన ప్రయాణికులు రమేష్‌, ప్రణవ్‌, రాయచూరుకు చెందిన సంతోష్‌, బస్సుక్లీనర్‌ శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న లేపాక్షి ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌.. సిబ్బందితో అక్కడికి చేరుకుని, క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పెనుకొండ డీఎస్పీ రమ్య.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సోమవారం రాత్రి 11 గంటలకు లారీ రోడ్డుపై ఆగిపోతే ఎందుకు దానిని పక్కకు తీయలేదని ఎనహెచ ఎస్కార్ట్‌ సిబ్బందిపై మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Updated Date - 2022-05-25T06:11:02+05:30 IST