పెళ్లింట విషాదహేల

ABN , First Publish Date - 2022-05-19T06:05:56+05:30 IST

మరో వారం రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో పెనువిషాదం అలుముకుంది. అప్పటిదాకా బంధుమిత్రులతో కళకళలాడిన ఇంటి ఆవరణలో మృతుల బంధవుల రోదనలు మిన్నంటాయి. పెళ్లిబట్టలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు సమీప బంఽధువులతో కలిసి ట్రాక్టర్‌పై నర్సంపేట పట్టణానికి బయలుదేరగా ఇంతలోనే అనుకోని ప్రమాదం.. ఐదుగురిని కబళించింది. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెళ్లింట విషాదహేల
చెరువుకట్టపై నుండి పల్టీ కొట్టిన ట్రాక్టర్‌,నర్సంపేట మార్చురీలో మృతదేహాలు

ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురి దుర్మరణం
మృతులందరూ వధువు తరపువారే..
మరో వారం రోజుల్లో వివాహ వేడుక
పెళ్లి బట్టల కోసం వెళ్తుండగా ఘటన
మృతుల్లో ముగ్గురు మహిళలు
ఖానాపురం మండలం పర్శనాయక్‌ తండా కన్నీరుమున్నీరు


ఖానాపురం, మే 18: మరో వారం రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో పెనువిషాదం అలుముకుంది. అప్పటిదాకా బంధుమిత్రులతో కళకళలాడిన ఇంటి ఆవరణలో మృతుల బంధవుల రోదనలు మిన్నంటాయి. పెళ్లిబట్టలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు సమీప బంఽధువులతో కలిసి ట్రాక్టర్‌పై నర్సంపేట పట్టణానికి బయలుదేరగా ఇంతలోనే అనుకోని ప్రమాదం.. ఐదుగురిని కబళించింది. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం పర్శనాయక్‌ తండా సమీపంలో ట్రాక్టర్‌ బోల్తాపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ ట్రాలీ కిందపడి ముగ్గురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖానాపురం మండలం చిలుకమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని పర్శనాయక్‌తండాకు చెందిన గుగులోతు ధన్‌సింగ్‌, విజయ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.  ధన్‌సింగ్‌ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె వివాహం కాగా, చిన్న కూతురు సుష్మకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమెంది.

ఈనెల 24న వివాహం జరిపించేందుకు సుష్మ తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పెళ్లి బట్టలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు బుధవారం తండా నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సంపేట పట్టణానికి పయనమయ్యారు. సుష్మ అన్న అశోక్‌ చిలుకమ్మతండాకు చెందిన తన స్నేహితుడు గణేష్‌ ట్రాక్టర్‌ తీసుకొని తమ బంధువులను ఎక్కించుకొని పర్శనాయక్‌తండా నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో తండా నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉన్న దూసముద్రం చెరువు కట్టపైకి రాగానే కట్టపై తుమ్మచెట్టు కొమ్మలను ట్రాక్టర్‌లో ఉన్నవారికి తగలకుండా తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపుతప్పి కట్ట పక్కనే ఉన్న పంటపొలాల్లోకి బోల్తా కొట్టింది. ట్రాక్టర్‌లో మొత్తం 13మంది ఉండగా, వారిలో పెళ్లి కుమార్తె పెద్ద నాన్న గుగులోతు స్వామి(48), పెద్దమ్మ శాంతమ్మ(44), మేనత్త జాటోతు బుచ్చమ్మ(60), మేనమామ గోవిందు(65), వరుసకు వదిన అయిన గుగులోతు సీత(45) మృతి చెందారు.

వీరిలో స్వామి, బుచ్చమ్మ, సీత సంఘటన స్థలంలోనే ట్రాక్టర్‌ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ శాంతమ్మ, గోవిందు నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే మృతిచెందారు. ప్రమాదంలో పెళ్లికుమార్తె తల్లి విజయ, సోదరుడు అశోక్‌, సమీప బంధువులు ధరావత్‌ మమత, ధరావత్‌ వనజ, వాంకుడోతు బుజ్జమ్మ తీవ్రంగా గాయపడడంతో వారిని నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. అలాగే సుష్మ సోదరి అనూష, ఆమె ఐదేళ్ల కుమారుడు, పెళ్లికుమార్తె అమ్మమ్మ లాలమ్మ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. వీరిని స్థానికులు స్వగ్రామానికి తరలించారు. పెళ్లి కుమార్తె తండ్రి ధన్‌సింగ్‌ ద్విచక్రవాహనంపై వస్తుండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, సాయం కోసం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది.

పర్శనాయక్‌ తండాలో విషాదం
పెళ్లి జరగాల్సిన ఉంట్లో ఒకేసారి ఐదుగురు మృతి చెందడటంతో పర్శతండాలో తీవ్ర విషాదం అలుముకుంది. మృతులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారే.. వ్యవసాయ పనుల కోసం నిత్యం అందరూ కలిసి వెళ్తుంటారు. స్వామి-శాంతమ్మ దంపతులు, గోవిందు-బుచ్చమ్మ దంపతులను మృత్యువు కబళించడం తండావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా స్వామి-శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందు-బుచ్చమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, మృతురాలు సీతకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.  నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, దుగ్గొండి, నర్సంపేట సీఐలు సూర్యప్రసాద్‌, పులి రమేష్‌, ఎస్సై పిట్టల తిరుపతి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. క్షతగ్రాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను నర్సంపేట మార్చురీకి తరలించారు.

ఎమ్మెల్యే పరామర్శ
మృతదేహాలను నర్సంపేట ఆస్పత్రిలోని మార్చురీలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివా్‌సగౌడ్‌,  వైస్‌ఎంపీపీ  రామసహాయం ఉమాఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య తదితరులు ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నర్సంపేటలో మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.

తండా వాసుల ఆగ్రహం
ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడిపి ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మృతుల కుటుంబ సభ్యులు.. పెళ్లి కుమార్తె అన్న, ట్రాక్టర్‌ డ్రైవర్‌ అశోక్‌పై, పెళ్లికుమార్తె తండ్రి ధన్‌సింగ్‌పై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ధన్‌సింగ్‌ నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ముగిసిన అంత్యక్రియలు
నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం ముగిసిన తరువాత గుగులోతు స్వామి, శాంతమ్మ, జాటోతు బుచ్చమ్మ, గోవిందు, గుగులోతు సీత(45) మృతదేహాలను బుధవారం రాత్రి పర్శానాయక్‌తండాకు తీసువచ్చారు. అనంతరం శ్మశానవాటిలో బంధువుల రోదనల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మృతువుల బంధువులతో పాటు ఎంపీపీ ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివా్‌సగౌడ్‌, రామసహాయం ఉపేందర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ప్రమాదానికి  కారణం ఇదేనా..?

పర్శానాయక్‌తండాకు వెళ్లాలంటే సైనిక్‌స్కూల్‌ సమీపంలోని దూసముద్రం చెరువ కట్టపై నుంచే వెళ్లాలి. మట్టితో నిర్మించిన ఈ కట్ట.. ఇరుకుగా ఉండటంతో పాటు మలుపులు తిరిగి ఉంటుంది. అక్కడక్కడా గుంతలు ఉన్నాయి. కట్ట సమీపంలో ఉన్న చెట్ల కొమ్మలు వేలాడడంతో వాటిని తప్పించే క్రమంలోనే ట్రాక్టర్‌ ప్రమాదం జరిగిందని తండావాసులు తెలిపారు. చెరువు కట్టపై చెట్ల కొ మ్మలను తప్పిస్తున్న సమయంలోనే అశోక్‌ సెల్‌ఫోన్‌కు కాల్‌ రాగా, జేబు నుంచి ఫోన్‌ తీస్తుండగా ట్రాక్టర్‌ అదుపు తప్పిందని మరికొందరు తెలిపారు.



Updated Date - 2022-05-19T06:05:56+05:30 IST