Dhanbad అక్రమ బొగ్గుగనిలో ఘోర ప్రమాదం..13మంది మృతి

ABN , First Publish Date - 2022-02-02T12:46:26+05:30 IST

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కూలిపోయిన దుర్ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు...

Dhanbad అక్రమ బొగ్గుగనిలో ఘోర ప్రమాదం..13మంది మృతి

ధన్‌బాద్:  జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కూలిపోయిన దుర్ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. మరికొంత మంది గనిలో చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కూలిపోయిన బొగ్గు గని వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ధన్‌బాద్‌లోని నిర్సా బ్లాక్‌లోని ఈసీఎల్ ముగ్మా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివున్న బొగ్గు గనిని చట్టవిరుద్ధంగా తెరిచారు. మైనింగ్ పరికరాలు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో గని పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో 12మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే కొంత మందిని రక్షించారు.


క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగినప్పుడు, అక్రమ గనిలో ప్రతిరోజూ పని చేయడానికి వచ్చే మహిళలు, పురుషులు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ధన్‌బాద్‌లోని నిర్సా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బొగ్గు గనిలో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.ధన్‌బాద్‌ కోల్‌ బెల్ట్‌లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. పాడుబడిన గనుల్లో అక్రమంగా తవ్వడమే ఈ ప్రమాదాలకు కారణమని భారత్ కోకింగ్ కోల్ పబ్లిక్ రిలేషన్స్ మాజీ హెడ్ రామానుజ్ ప్రసాద్ చెప్పారు.


Updated Date - 2022-02-02T12:46:26+05:30 IST