Abn logo
Jul 26 2021 @ 22:36PM

‘ఇంటింటా ఇన్నోవేటర్స్‌’ దరఖాస్తుల స్వీకరణ

వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తదితరులు

ఆవిష్కరణలను పంపడానికి చివరి తేదీ ఆగస్టు 10

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి

ఇంటింటా ఇన్నోవేటర్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జూలై 26 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు రూపొందించిన జిల్లా ఆవిష్కర్తలు, వారి ఆవిష్కరణలను అంతర్జాలంలో ప్రదర్శించడానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ అవకాశం కల్పిస్తున్నదని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి చెప్పారు. ఇంటింటా ఇన్నోవేటర్స్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టుకి పొడిగించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆవిష్కర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, డీఆర్‌వో చెన్నయ్య, డీపీఆర్‌వో దశరథం, డీఈవో రవికాంతారావు, జిల్లా సైన్స్‌ అధికారి కోత్వాల్‌ మహేందర్‌తో కలిసి ‘ప్రదర్శన మళ్లీ మీ ముందుకు వస్తుంది’ అన్న పేరుతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. అంతర్జాల వేదికగా జిల్లాలో ఉన్న విద్యార్థులు, గ్రామీణ, పట్టణ ఆవిష్కరణలకు, స్టార్టప్‌ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువ శాస్త్రవేత్తల నుంచి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వాటిని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ వేదికగా స్థానిక సమస్యలను పరిష్కరించే క్రమంలో సృజనాత్మకతను జోడించి తయారుచేసిన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10వ తేదీలోపు 9100678543 మొబైల్‌ నంబరుకు వాట్సాప్‌ ద్వారా తమ ఆవిష్కరణలకు సంబంధించిన రెండు నిమిషాల వీడియో, ప్రాజెక్ట్‌ నాలుగు ఫొటోలు, ఆరు లైన్లలో ఆవిష్కరణ గురించి వివరాలు, పేరు, ఫోన్‌ నంబరు, వృత్తి, వయస్సు, గ్రామం, జిల్లా వివరాలను తెలియజేయాలన్నారు. ఆవిష్కరణలు పంపేవారు మరింత సమాచారం, సందేహాల నివృత్తికి జిల్లా సైన్స్‌ అధికారి ఫోన్‌ నంబరు 9949560565ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాలోని ఔత్సాహిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

గౌరవెల్లి భూసేకరణ పదిరోజుల్లో పూర్తిచేస్తాం : కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట సిటీ, జూలై 26 : పదిరోజుల్లో గౌరవెల్లి రిజర్వాయర్‌ పెండింగ్‌ భూ సేకరణ పూర్తిచేసి, పనులు వేగవంతం చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ మీటింగ్‌ హాల్‌లో గౌరవెల్లి రిజర్వాయర్‌ పెండింగ్‌ భూ సేకరణ, పనుల పురోగతిపై రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరవెల్లి పెండింగ్‌ భూ సేకరణ వివరాలను, అందుకు గల కారణాలను హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గౌరవెల్లి రిజర్వాయర్‌లో 272 ఎకరాల భూ సేకరణ పెండింగ్‌లో ఉన్నదన్నారు. మూడురోజుల్లోగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌తో రిజర్వాయర్‌ భూ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చట్టప్రకారం అర్హులైన వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్రయోజనాలను అందిస్తామన్నారు. వచ్చే పదిరోజుల్లోగా భూ సేకరణ పూర్తిచేసి గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌ కార్య నిర్వాహక ఇంజనీర్‌ రాములు, ఉప కార్య నిర్వాహక ఇంజనీర్లు కరుణ శ్రీ, ప్రశాంత్‌, అక్కన్నపేట తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.