ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-05-15T06:52:15+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 817 కోట్ల ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి రోజూ 15 నుంచి 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గన్నీబ్యాగులను, వాహనాలను, హమాలీలను సమకూరుస్తూ వెంట వెంటనే తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ఇప్పటి వరకు రూ.817 కోట్ల ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో 4లక్షల 16వేల 846 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

నిజామాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 817 కోట్ల ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి రోజూ 15 నుంచి 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గన్నీబ్యాగులను, వాహనాలను, హమాలీలను సమకూరుస్తూ వెంట వెంటనే తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రక్‌షీట్‌ ఆధారంగా రైతులు అమ్మిన ధాన్యానికి బిల్లులను జనరేట్‌చేస్తూ వారి ఖాతాలో డబ్బులను జమచేస్తున్నారు. త్వరగా కొనుగోళ్లను పూర్తిచేసేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ దఫా చెల్లింపులకు కొత్తగా ఓటీపీని తీసుకువచ్చారు. ధాన్యం అమ్మి బిల్లులు ఎంట్రీచేసే సమయంలో రైతుల ఫోన్‌ నెంబర్‌లకు ఓటీపీ పంపిస్తున్నారు. వారు చెక్‌చేసుకున్న తర్వాతనే ఎంట్రీ పూర్తిచేస్తున్నారు.

యాసంగిలో 3లక్షల 86వేల ఎకరాలకుపైగా సాగు

జిల్లాలో ఈ యాసంగిలో 3లక్షల 86వేల ఎకరాలకుపైగా వరి సాగుచేశారు. ఈ సీజన్‌లో దిగుబడి 9లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా వస్తుందని అంచనా వేశారు. దీనిలో 3లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉండగా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లను చేశారు. జిల్లాలో ఈ సీజన్‌లో 472 కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 457 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 450 కొనుగోలు కేంద్రాల ద్వారా ధా న్యాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మెప్మా, మార్కెట్‌ కమిటీలు, ఐకేపీల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిధిలో ఈ కొనుగోలును చేస్తున్నారు.

ఇప్పటి వరకు రూ.817 కోట్ల ధాన్యం కొనుగోలు

జిల్లాలో ఇప్పటి వరకు రూ.817 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 55,146 మంది రైతుల నుంచి 4లక్షల 16వేల 846 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.  సన్న రకాలతో పాటు దొడ్డు రకాలను కొంటున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో రైతులు 65 శాతానికి పైగా సన్న రకాలను సాగుచేయడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని కొన్ని మిల్లులు ఆపుతున్నా అధికారులు జోక్యం చేసుకుని త్వరగా తరలించేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో కొంతమేర గన్ని బ్యాగుల కొరత ఉన్నా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ సరఫరా చేస్తున్నారు. మిల్లుల్లో వాహనాలు త్వరగా అన్‌లోడ్‌ కాకపోవడం వల్ల సమస్యలు వస్తుండడంతో ఇప్పటికే తీసుకున్న 1600 వాహనాలకు తోడుగా మరికొన్ని వాహనాలను సమకూరుస్తూ ధాన్యాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండలు పెరగడంతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా తరలింపులపై దృష్టిపెట్టి కొనుగోలు చేస్తున్నారు.

తరుగుపై ఫిర్యాదులు...

జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో తరుగుపై ఫిర్యాదులు వస్తుండడంతో అధికారులు ఆ కొనుగోలు కేంద్రాలకు వెల్లి సమీక్షిస్తూ సజావుగా జరిగేవిధంగా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సమీక్షిస్తుండడంతో త్వరగా కొనుగోలు పూర్తయ్యేవిధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 434.97 కోట్ల రూపాయలను ట్యాబ్‌ ఎంట్రీ చేశారు. ఈ బిల్లులకు అనుగుణంగా ట్రక్‌ షీట్‌ను జనరేట్‌ చేశారు. జిల్లాలో ధాన్యం అమ్మిన రైతుల ఆధారంగా రూ.396 కోట్లకు మిల్లుల నుంచి ఎకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకున్నారు. దానికి అనుగుణంగా జిల్లాలో 317 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమచేశారు. ఈ దఫా ధాన్యం చెల్లింపులలో కీలకంగా ఓటీపీ మా రింది. గతంలో లేనివిధంగా ఈ సీజన్‌లో ట్యాబ్‌ ఎంట్రీచేసే టైంలో ఓటీపీని రైతు ఫోన్‌ నెంబర్‌కు పంపిస్తున్నారు. రైతు ఓటీపీ చెప్పగానే ట్యాబ్‌ ఎంట్రీ పూర్తిచేసి చెల్లింపుల కోసం పౌరసరఫరాల సంస్థకు ఆ బిల్లులను పంపిస్తున్నారు. ఏ రైతు ధాన్యం అమ్మిన ఆ రైతు ఫోన్‌ నెంబర్‌ ఎంట్రీ చేసే సమయంలో ఈ ఓటీపీ తప్పనిసరి చేశారు. రైతుకు ఓటీపీ వచ్చి నెంబర్‌ను సంస్థకు చెప్పగానే ఎంట్రీ పూర్తి అవుతుంది. ఒకటి రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థల అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి వెంట వెంటనే తరలిస్తున్నామన్నారు. రైతులకు సమస్యలు రాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి వెంట వెంటనే చెల్లింపులు చేసేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా త్వరగా తరలించేవిధంగా ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు.

Updated Date - 2022-05-15T06:52:15+05:30 IST