తిరుపతిలో విమాన మరమ్మతుల కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-12-02T06:37:38+05:30 IST

తిరుపతి విమానాశ్రయంలో కేంద్రం ప్రతిపాదించిన విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

తిరుపతిలో విమాన మరమ్మతుల కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయండి
పార్లమెంటులో మాట్లాడుతున్న ఎంపీ గురుమూర్తి

లోక్‌సభలో కోరిన ఎంపీ గురుమూర్తి 

ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణపై ఊసెత్తని వైనం


తిరుపతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయంలో కేంద్రం ప్రతిపాదించిన విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటును వేగవంతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి  కోరారు. లోక్‌సభలో బుధవారం ఎంపీ మాట్లాడుతూ.. పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది విమాన మరమ్మతు (ఎంఆర్‌వో.. మెయింటెనెన్స్‌, రిపేర్స్‌ అండ్‌ ఓవర్‌ హాలింగ్‌ సెంటర్‌) కేంద్రాల్లో తిరుపతి కూడా ఒకటని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు త్వరగా అమలయ్యేలా చూసేందుకు ఓ ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. కేంద్రం ప్రకటించిన ఉడాన్‌ పథకం కింద వివిధ విమానాశ్రయాల నుంచి తిరుపతికి ఎయిర్‌ కనెక్టివిటీని పెంచాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. కాగా, ప్రధాన సమస్య అయిన తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణ గురించి ఎంపీ ప్రస్తావించలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పైవేటీకరించదలచిన విమానాశ్రయాల తొలి జాబితాలోనే తిరుపతి ఉన్న సంగతి తెలిసిందే. విమానాశ్రయ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే వామపక్షాలు తిరుపతి ఎయిర్‌పోర్టు ఎదుట ఆందోళన నిర్వహించాయి. విమానాశ్రయాన్ని ప్రైవేటీకరిస్తే కొన్ని సేవలు నాణ్యంగా, త్వరగా అందవచ్చునేమో గానీ ఆర్థికంగా ప్రయాణికులకు భారం అవుతుందన్న అనుమానాలు స్థానికంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గళం విప్పాల్సిన ఎంపీ.. ఆ అంశాన్ని విస్మరించడం గమనార్హం. 

మరోవైపు తిరుపతి విమానాశ్రయానికి లాజిస్టిక్స్‌ పార్క్‌ ప్రాజెక్టు మంజూరైన సంగతి తెలిసిందే. ఇక్కడ కార్గో సర్వీసెస్‌ ప్రారంభించడానికి బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అనుమతిచ్చింది. తిరుపతి విమానాశ్రయానికి స్పెషల్‌ కార్గో ఫ్లైట్స్‌ను హ్యాండిల్‌ చేసే సామర్థ్యం ఉందని గుర్తించినందునే సంబంధిత అనుమతి లభించింది. దానికి అవసరమైన టెర్మినల్‌ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇపుడున్న సర్వీసులతో బెల్లీ కార్గో సర్వీసులు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుంది. అది కూడా రోజుకు 10 టన్నుల వరకే రవాణా చేయడానికి అవకాశముంది. టెర్మినల్‌ నిర్మాణం పూర్తయ్యే లోపు బెల్లీ కార్గో సర్వీసులు నడిపేలా ఆ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చే విషయాన్నీ ఎంపీ ప్రస్తావించలేదు.

Updated Date - 2021-12-02T06:37:38+05:30 IST