బదిలీల ప్రక్రియ వేగవంతం

ABN , First Publish Date - 2021-12-17T06:39:40+05:30 IST

స్థానిక కేడర్‌ కేటాయింపులు ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

బదిలీల ప్రక్రియ వేగవంతం

 నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాలో 60వేల మంది బదిలీ

 మానసిక ఒత్తిడిలో ఉద్యోగులు, యాదాద్రివైపు సీనియర్ల చూపు 

 తప్పుల తడకగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా

స్థానిక కేడర్‌ కేటాయింపులు ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లతోపాటు ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు, అబ్జర్వర్లను జిల్లాలకు పంపింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఆప్షన్ల దరఖాస్తులు సమర్పించడం, సీనియారిటీ లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. అందరికీ ట్రాన్స్‌ఫర్లు ఖచ్చితం కావడంతో ఉద్యోగులు, వారి కుటుంబాల్లో సందిగ్ధం నెలకొంది. 

 ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ

బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ఒక్కసారిగా వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ ఉద్యోగికి స్థానచలనం తప్పనిసరి కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈబదిలీల్లో పుట్టిన గ్రామంతో సంబంధం లేకుండా సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. సీనియర్లు అంతా కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యాదాద్రి జిల్లాలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, ఆ జిల్లాకు చెందిన అక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లడం ఓ ఊహించని పరిణామం. స్థాయితో సంబంధం లేకుండా ఒకేసారి 60వేల మందికి బదిలీ అనివార్యంకావడంతో ఉద్యోగులు, వారి కుటుంబాల్లో అలజడి నెలకొంది. 


చివరి దశకు ఉద్యోగుల కేటాయింపులు

ఎన్జీవోలు, టీఎన్జీవోల సంఖ్య పరిమితంగా ఉండటం, ఉన్న వారు వివిధ శాఖల పరిధిలోని వారుకావడంతో ఆప్షన్ల దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ముగిసి సీనియారిటీ ఆధారంగా జిల్లాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈక్రమంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నల్లగొండ జిల్లాలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఎన్జీవోలు, టీఎన్జీవో నాయకులతో సమావేశమై కేటాయింపుల ప్రక్రియను గురువారం రాత్రివరకు పర్యవేక్షించారు. ఈ కేటాయింపుల ప్రక్రియపై ఉద్యోగులు కొందరు అసంతృప్తితో ఉన్నారు. కేవలం సర్వీసు సీనియారిటీనే పరిగణనలోకి తీసుకున్నారు తప్ప స్పౌజ్‌(దంపతులు ఇద్దరూ ఉద్యోగులు) అంశాన్ని పక్కనబెట్టారు. తాజా నిబంధనల ప్రకారం భార్య ఒక జిల్లాలో భర్త మరో జిల్లాలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సాధనలో కేసులు, బెదిరింపులకు భయపడకుండా ఉద్యమించిన నాయకులను సైతం కౌన్సిలింగ్‌ ప్రక్రియలోకి తెచ్చారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆందోళన నెలకొంది. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వారినే ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ అంటే జూనియర్లకు అన్యాయం జరుగుతుందన్న చర్చ కొనసాగుతోంది. జిల్లాల విభజనతో జిల్లాలు, కార్యాలయాలు పెరిగినా అధికారులు, ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. ఫలితంగా ఉద్యోగం చేస్తున్నామన్న సంతృప్తిలేదని వాపోతున్నారు. 


తప్పుల తడకగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 12,200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరి సీనియారిటీ జాబితా వెలువరించే ముందు తగు చర్యలు తీసుకోకుండా బహిర్గతం చేయడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. అంతర్‌ జిల్లాల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చినప్పుడు ఆ కొత్త జిల్లా సీనియారిటీ లిస్ట్‌లో వీరి పేరు చివరన ఉండాలి. కానీ తాజా లిస్ట్‌లో వీరిని ముందువరుసలో చేర్చారు. ఏ జిల్లా వారిని ఆ జిల్లాకు పంపాలన్న ఆందోళనతో గతంలో 610 జీవో మేరకు సొంత జిల్లాలకు ఉపాధ్యాయులు బదిలీ పై వచ్చారు. వారిని సీనియారిటీలో చివరన ఉంచాల్సి ఉండగా ముందుకు తెచ్చారు. మెరిట్‌ ర్యాంక్‌ వచ్చిన వారిని సీనియారిటీలో ముందు వరుసలో చేర్చాల్సి ఉండగా, కొందరి పేర్లు వెనక్కి వెళ్లాయి. ఎక్కువ ర్యాంకు ఉన్న వారు ముందుకొచ్చారు. ఈ జాబితాపై వేలాదిగా ఫిర్యాదులు రావడంతో నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ మూడు జిల్లాల డీఇవోలను, ఉపాధ్యాయ సంఘాలను తన క్యాంపు కార్యాలయంలో సమావేశపరిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టారు. సవరించిన జాబితాను నేడు అందరికి అందుబాటులోకి తేవాలని, బహిర్గతం చేసేముందు ఉపాధ్యాయ సంఘాలకు చూపించిన తర్వాతే వెలువరించాలని అధికారులను ఆదేశించారు. గుండెకు బైపాస్‌ సర్జరీ, క్యాన్సర్‌, కిడ్నీ మార్పిడి, చెవిటి, మూగ, ఆర్థో, నరాల వ్యాఽధుల వారు కొత్త మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. ఉద్యోగులందరికీ నల్లగొండ మెడికల్‌ బోర్డు నుంచే సర్టిఫికెట్లు జారీ చేయాలనడంతో కాలయాపన జరిగే అవకాశం ఉంది. చెవిటి, మూగ, నరాల వ్యాధులకు సంబంధించి గతంలో తీవ్రత అధికంగా ఉన్నా, కాలక్రమేణా ఇవి కొంత తగ్గి మెడికల్‌ పర్సంటేజీ తగ్గితే ఎలా అని, పాత సర్టిఫికెట్‌లలో ఉన్న పర్సంటేజీకోసం కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


యాదాద్రివైపు సీనియర్ల చూపు

స్థానిక కేడర్‌ కేటాయింపునకు సీనియర్‌ అనే ఏకైక అంశాన్ని ప్రాతిపాదికగా తీసుకోవడంతో సీనియర్లు అంతా యాదాద్రి జిల్లాకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం మూలంగా అక్కడే నివాసం ఏర్పరుచుకోవచ్చు, పిల్లలకు నాణ్యమైన చదువు, పిల్లలు ఇంటి వద్దే ఉండి చదువుకునే అవకాశం, వీటితోపాటు హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా ఉండటంతో అటు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా యాదాద్రి జిల్లాలో పుట్టి, పెరిగి ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేసుకుంటున్న వారు నల్లగొండ లేదా సూర్యాపేట జిల్లాకు బదిలీ కావడం అనివార్యం కావడంతో జూనియర్లు ఆందోళనలో ఉన్నారు. 


విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి 

సూర్యాపేటటౌన్‌: ఉద్యోగుల బదిలీలపై తనకేమి తెలియదని చెబుతున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి విడుదలచేసిన జీవో 317 పూర్తిగా అసంబద్ధంగా ఉందని, జీవోను సవరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.  


పనిచేసే చోటు, ఉద్యోగం తృప్తిగా ఉంటేనే ఫలితాలు : శ్రవణ్‌కుమార్‌, ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ

పనిచేస్తున్న ప్రాంతం, చేస్తున్న ఉద్యోగం రెండూ బాగుంటేనే ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు దక్కుతాయి. స్పౌజ్‌వంటి నిబంధనలతోపాటు పుట్టిన ప్రాంతం వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే ఈ సర్దుబాటు ప్రశాంతంగా ఉండేది. ఖాళీలు భర్తీ చేయకుండా అటూ ఇటూ ఉద్యోగులను మార్చడం మూలంగా పెద్దగా ఫలితం ఉండదు.



గందరగోళాన్ని సరిచేయాలి : పి.వెంకటేశం, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ

సీనియారిటీ జాబితాలో తప్పులు, గందరగోళాన్ని వెంటనే సరిచేయాలి, కేటాయింపుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సీనియారిటీ ఆధారంగా జిల్లాలు కేటాయిస్తారు. ఆ తర్వాత స్కూళ్లకు బదిలీల విషయంలో కొత్తగా జిల్లాలకు కేటాయించిన వారినే చేస్తారా? అందరికీ బదిలీల కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారా? అన్నది నేటికీ స్పష్టతలేదు. పాత మెడికల్‌ సర్టిఫికెట్లనే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు. ఆ సర్టిఫికెట్లను తాజాగా మెడికల్‌ బోర్డుతో సర్టిఫై చేయించాలి.

Updated Date - 2021-12-17T06:39:40+05:30 IST