జిల్లాలో పోడు కసరత్తు వేగవంతం

ABN , First Publish Date - 2021-10-29T03:42:51+05:30 IST

పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రతిఏటా రావణకాష్టంలా రగులుతున్న పోడు సమస్య కారణంగా రైతులు అటవీ, రెవిన్యూశాఖల మధ్య తరుచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వతపరిష్కారం చూపేదిశగా అడుగులు ప్రారంభించింది.

జిల్లాలో పోడు కసరత్తు వేగవంతం

-సమీక్షలతో కలెక్టర్‌ బిజీబిజీ

-బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం

-గురువారం అటవీ, రెవిన్యూ సిబ్బందితో సమీక్షలు

-దరఖాస్తుల స్వీకరణకు విధి విధానాలపై కసరత్తు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రతిఏటా రావణకాష్టంలా రగులుతున్న పోడు సమస్య కారణంగా రైతులు అటవీ, రెవిన్యూశాఖల మధ్య తరుచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో శాశ్వతపరిష్కారం చూపేదిశగా అడుగులు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం గడిచిన వారం రోజులుగా పోడు భూములపై సమీక్షలతో బిజీబిజీగా గడుపుతోంది. ముఖ్యంగా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నేతృత్వంలో ఇప్పటికే మూడు దఫాలుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. తాజాగా బుధవారం జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో ఈ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. గురువారం జిల్లాలోని రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నవంబరు 8నుంచి డిసెంబరు 8వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోడు రైతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల పరిష్కారం.., ఎంత మంది రైతులు పోడు సాగులో ఉన్నారు..? ఎవరి ఆధీనంలో ఎంత విస్తీర్ణం ఉంది..? ఇందులో అర్హులు ఎంత మంది..? వంటి సమాచారాన్ని సేకరించే పనిలో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే జిల్లాలో రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదాస్పదంగా మారిన భూముల అంశాన్ని కూడా తేల్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకుగాను రెండు శాఖలకు చెందిన రికార్డుల ఆధారంగా సంయుక్త సర్వే చేపట్టి భూముల లెక్క తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఇలా రెండు శాఖల మధ్య దాదాపు 20వేల హెక్టార్లలో వివాదా లున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా అనధికారికంగా హద్దులు మార్చి సాగు చేసుకుంటున్న భూముల జాబితాను కూడా సేకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. 

పకడ్బందీగా పోడు జాబితా..

పోడు రైతుల సమస్య పరిష్కరించడంలో ఏమాత్రం అవకతవకలు చోటు చేసుకోకుండా చూడటం కోసం అధికార యంత్రాంగం అత్యంత పకడ్బందీగా కసరత్తు జరుపుతోంది. ఇందుకుగాను గ్రామస్థాయిలో అధికారులతో, రెవెన్యూ, అటవీ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వాస్తవిక పోడు రైతులను గుర్తించి వారు అర్హులా..? కాదా అనేది నిర్ణయిస్తారు. అలాగే వారి ఆధీనంలో నిర్ధేశిత పరిమితికి మించి ఉన్న భూమిని మిగితా రైతులకు కేటయించేలా ఏర్పాటు చేయటం కోసం గ్రామస్థాయిలోనే సర్దుబాట్లు చేసే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. తద్వారా భవిష్యత్తులో గ్రామస్థాయిలో వాస్తవిక పోడు రైతులకు సంబంధించిన భూములు మినహాయించి కొత్తగా ఆక్రమణలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు అటవీశాఖ కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా పోడు రైతులకు హక్కుల కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న పోడు భూముల విషయంలో రెవెన్యూ అటవీశాఖల సమన్వయంతో దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి కేటాయింపులు జరిపే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా పట్టాల జారీతో పాటు వెంటనే హద్దులు చూపించి పొజిషన్‌ కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2005లో ఇచ్చిన పట్టాలకు నేటికీ హద్దులు చూపిం చకపోవడంతో చాలా చోట్ల పోడు రైతులు అడవిలోకి వెళ్లి కొత్తగా సాగు చేపడుతున్నారన్న అటవీశాఖ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దఫా అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టను న్నట్టు చెబుతున్నారు. 

జిల్లాలో 50వేలకుపైగానే వచ్చే అవకాశం..

ప్రస్తుతం అడవులను నరికి పోడుసాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా నవంబరు 8నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలోని 15మండలాల నుంచి దరఖాస్తుల వెల్లువ కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం గణాంకాల ప్రకారం జిల్లాలో 33వేల మంది పోడు రైతులు హక్కుల కోసం ఎదురు చూస్తున్నట్టు భావిస్తున్నారు. ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలైతే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2006లో ఆర్‌వో ఎఫ్‌ఆర్‌ పట్టాల జారీ నాటికే పట్టాలు పొందిన రైతుల సంఖ్య సుమారు 15వేల వరకు ఉన్నట్టు తేల్చారు. ప్రస్తుతం ఈసంఖ్య 33వేలకు చేరుకుంది. ఇందులో మూడు ఎక రాలకు పైబడి విస్తీర్ణం సాగు చేసుకుంటున్న వారి సంఖ్య 14వేల నుంచి 18వేల మధ్య  ఉంటుందని చెబుతున్నారు. వీరిలో చాలా ఉమ్మడి కుటుంబాలు విడిపోవటంతో ఈ సంఖ్య 33వేల నుంచి 50వేల దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-10-29T03:42:51+05:30 IST