14 చోట్ల మళ్లీ ACB తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-21T13:26:16+05:30 IST

అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణి బంధువులు, సన్నిహితుల నివాసగృహాలు, కార్యాలయాలు సహా 14 చోట్ల ఏసీబీ అధికారులు మళ్ళీ తనిఖీలు నిర్వహించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తంగమణి రెవెన్యూ,

14 చోట్ల మళ్లీ ACB తనిఖీలు

                 - మాజీ మంత్రి తంగమణి అక్రమార్జన కేసు


చెన్నై: అన్నాడీఎంకే మాజీ మంత్రి తంగమణి బంధువులు, సన్నిహితుల నివాసగృహాలు, కార్యాలయాలు సహా 14 చోట్ల ఏసీబీ అధికారులు మళ్ళీ తనిఖీలు నిర్వహించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తంగమణి రెవెన్యూ, పరిశ్రమలు, విద్యుత్‌ శాఖల మంత్రిగా పనిచేసి ఆదాయానికి మించి అక్రమార్జనలకు పాల్పడ్డారని, చర, స్థిరాస్తులు కొనుగోలు చేశారని నామక్కల్‌లోని ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. తంగమణి, ఆయన భార్య శాంతి, కుమారుడు ధరణీధరన్‌ పేర్లపై పలు ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 15న చెన్నై, నామక్కల్‌ తదితర నగరాలలోని తంగమణి నివాసగృహాలు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలు సహా మొత్తం ఒకే సమయంలో 69 చోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా రూ.2కోట్లకు పైగా నగదు, కేజీ బంగారు నగలు, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న కీలకమైన దస్తావేజులలో లభించిన కీలకమైన సమాచారాల ఆధారంగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు తంగమణి స్నేహితులు, బంధువుల నివాసగృహాలు సహా 14 చోట్ల ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించారు. నామక్కల్‌ జిల్లాలో 10 ప్రాంతాలలో, ఈరోడ్‌ జిల్లాలో మూడు  చోట్ల, సేలం జిల్లాలో ఒక చోట ఈ తనిఖీలు కొనసాగాయి. సేలం తిరువాగవుండనూరులో తంగమణి సన్నిహితుడు కుళందైవేలు కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మణికంఠన్‌ నివాసగృహం, కార్యాలయంలో సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణన్‌రాజన్‌ నాయకత్వంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు జరిపారు. ఇదే విధంగా నామక్కల్‌కు చెందిన పారిశ్రామికవేత్త దీపన్‌ చక్రవర్తి, పోత్తనూరుకు చెందిన పారిశ్రామికవేత్త షణ్ముగం, కోళ్ళఫారమ్‌ యజమాని మోహన్‌, పొన్నేరి పారిశ్రామికవేత్త అశోక్‌కుమార్‌, కొల్లిమలై పారిశ్రామికవేత్త పెరియసామి కార్యలయాలు, నామక్కల్‌ మోహనూరు రోడ్డులోని శ్రీనివాస కోళ్ళఫారమ్‌ కార్యాలయంలో, పళ్లిపాళయం టవున్‌ ప్రాంతంలోని కావేరి ఆర్‌ఎస్‌ రోడ్డు కృష్ణవేణి బస్టాపు వద్దనున్న తంగమణి బంధువు, ప్రముఖ ఆడిటర్‌ సెంథిల్‌కుమార్‌ కార్యాలయాలు, పరమత్తివేలూరు సమీపం కరుంగల్‌పట్టిలోని ఎస్‌ఎంఎన్‌ కోళ్ళపారమ్‌లో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి తనిఖీలు నిర్వహించారు. ఇదేవిధంగా ఈరోడ్‌ శక్తిరోడ్డు సీమంపలోని సాత్తాన్‌కాడు ప్రాంతంలో కుమార్‌ (అలియాస్‌) గోపాలకృష్ణన్‌ నివాసగృహం, విల్లరసంపట్టి సమీపం ఒండికారన్‌ పాళయం ఐశ్వర్యా గార్డెన్‌లో తంగమణి కుమారుడి కాలేజీమేట్‌ సెంథిల్‌నాధన్‌ నివాసగృహం, బాలసుందరం అనే ప్రముఖుడి నివాసగృహంలో ఈ తనిఖీలు నిర్వహించారు.. సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు సాయంత్రం ఐదు గంటలకు పైగా కొనసాగాయి. ఇదే విధంగా ఆరోడ్‌లో తంగమణి బంధువైన గోపాలకృష్ణన్‌, సెంథిల్‌నాధన్‌, బాల సుందరం నివాసగృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. తంగమణి సన్నిహితులు, బంధువుల ఇళ్ళ వద్ద ఏసీబీ తనిఖీలు జరగటంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, స్థానిక నేతలు ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుమికూడారు. దీనితో పోలీసులు వారిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించారు.

Updated Date - 2021-12-21T13:26:16+05:30 IST