ఇద్దరు సీఐల ఇళ్లలో Acb తనిఖీలు

ABN , First Publish Date - 2021-11-17T13:50:45+05:30 IST

విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే నేరారోపణలపై ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల నివాస గృహాల్లో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యభిచార నిరోధక విభాగంలో పనిచేసిన

ఇద్దరు సీఐల ఇళ్లలో Acb తనిఖీలు

                             - కీలకమైన దస్తావేజుల స్వాధీనం


ప్యారీస్‌(చెన్నై): విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే నేరారోపణలపై ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల నివాస గృహాల్లో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యభిచార నిరోధక విభాగంలో పనిచేసిన సమయంలో స్థానిక కీల్పాక్కం క్రైం విభాగం ఇన్‌స్పెక్టర్‌ శ్యాం విన్సెంట్‌, సైదాపేట లా అండ్‌ ఆర్డర్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌లు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను విడుదల చేసేందుకు, నిరంతరాయంగా వ్యభిచార వృత్తి కొనసాగేందుకు దళారుల నుంచి లక్షలాది రూపాయలు లంచంగా పొందారని ఏసీబీ విభాగానికి ఫిర్యాదులందాయి. కన్నియాకుమారి జిల్లాకు చెందిన శ్యాంవిన్సెంట్‌ ప్రస్తుతం గ్రేటర్‌ చెన్నై పోలీసుశాఖలో కీల్పాక్కం పోలీస్‌స్టేషన్‌లో నేరవిభాగం ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కీల్పాక్కంలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. అదే విధంగా, సైదాపేట లా అండ్‌ ఆర్డర్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శరవణన్‌ ప్రస్తుతం పుళిదివాక్కం పోలీస్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. వీరివురూ గత 2018 జనవరి 8, మే 15 తేదీల్లో వ్యభిచార నిరోధక విభాగంలో ఇన్‌స్పెక్టర్లుగా పనిచేశారు. ఆ సమయంలో వీరు నగరంలో ఉన్న స్పా, స్టార్‌ హోటళ్లలో వ్యభిచార వృత్తి సాగించిన బ్రోకర్ల నుంచి లంచంగా లక్షలాది రూపాయలు పొంది వారికి సహకరించారని ఆరోపణలు తలెత్తాయి. అంతేకాకుండా విధి నిర్వహణలో వ్యభిచార వృత్తిలో పాల్గొని పట్టుబడిన విదేశీ మహిళలు, సినీ నటీమణులు పలువురిపై కేసు నమోదుచేయకుండా విడుదల చేసేందుకు సహకరించారని ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారులకు సమాచారం తెలిసింది. దీంతో వారి వద్ద చేపట్టిన విచారణలో అవినీతికి సంబంధించిన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో, ఏసీబీ డీఎస్పీ శంకర్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి శరవణన్‌, శ్యాంవిన్సెంట్‌ నివాసగృహాల్లో ఆకస్మికతనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆ ఇళ్లలో ఉన్న వారు బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. అలాగే, బయట వ్యక్తులను కూడా లోపలికి అనుమతించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలు, వారి కుటుంబ సభ్యుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని టెలిఫోన్‌ కనెక్షన్లు కూడా కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇరువురి అక్రమార్జనలకు సంబంధించిన కీలకమైన దస్తావేజులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీలు పోలీసు అధికారుల మధ్య కలకలం రేపాయి.

Updated Date - 2021-11-17T13:50:45+05:30 IST